హైదరాబాద్,జూలై 10,2026 : క్రీడాకారుల శారీరక దృఢత్వంలో కీలకమైన 'పోస్ట్-రికవరీ' (ఆట తర్వాత కోలుకునే ప్రక్రియ) విభాగంలో సరికొత్త భాగస్వామ్యం కుదిరింది. దేశంలో వేగంగా దూసుకుపోతున్న ప్రముఖ ఓపెన్ ఫుట్‌వేర్ బ్రాండ్ 'చుప్స్ ఫుట్‌వేర్', ప్రతిష్టాత్మక 'పి. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ' (పీజీబీఏ)తో చేతులు కలిపింది. ఏడాది పాటు కొనసాగే ఈ ఒప్పందం ద్వారా అకాడమీకి చుప్స్ సంస్థ 'అధికారిక ఫుట్‌వేర్ రికవరీ భాగస్వామి'గా వ్యవహరించనుంది. హైదరాబాద్‌లో జరిగిన ఒక మీడియా సమావేశంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజ కోచ్ పుల్లెల గోపీచంద్, చుప్స్ ఫుట్‌వేర్ వ్యవస్థాపకుడు యశేష్ ముఖి ఈ వివరాలను సంయుక్తంగా వెల్లడించారు.
దిగ్గజ కోచ్ పర్యవేక్షణలో సరికొత్త పరిశోధన..
ఒలింపిక్ విజేతలు సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి మేటి ఆటగాళ్లను దేశానికి అందించిన ద్రోణాచార్య అవార్డీ పుల్లెల గోపీచంద్ ఈ భాగస్వామ్యంలో కీలక పాత్ర పోషించనున్నారు. కఠినమైన శిక్షణ తీసుకునే అకాడమీ ఆటగాళ్లు కోర్టు వెలుపల ఈ రికవరీ ఫుట్‌వేర్‌ను ధరిస్తారు. దీని ద్వారా లభించే సౌకర్యం, కుషనింగ్, ఫిట్టింగ్‌లపై క్రీడాకారులు, కోచ్‌ల నుంచి చుప్స్ బ్రాండ్ నేరుగా ఫీడ్‌బ్యాక్ సేకరించనుంది. ఈ వాస్తవ అనుభవాల ఆధారంగా భవిష్యత్తులో అథ్లెట్లకు మరింత ఉపయోగపడేలా, శాస్త్రీయ పద్ధతుల్లో ఉత్పత్తుల రూపకల్పనను చుప్స్ సంస్థ మెరుగుపరచనుంది.
పాదాల ఆరోగ్యమే పరమావధి..
క్రీడాకారుల సమగ్ర శ్రేయస్సు, పాదాల ఆరోగ్యానికి అకాడమీ ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ ఒప్పందం అద్దం పడుతోంది. కేవలం ఉత్పత్తుల సరఫరాకే పరిమితం కాకుండా.. పీజీబీఏ ప్రాంగణంలో బ్రాండింగ్, అథ్లెట్ల రికవరీ జర్నీకి సంబంధించిన డిజిటల్ కంటెంట్ తయారీ, నిరంతర నాణ్యత పరిశీలన వంటి అంశాలు ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి.
ఆటలో రికవరీ ఎంతో ముఖ్యం: గోపీచంద్
"ప్రతి అథ్లెట్ కెరీర్‌లో శిక్షణ ఎంత ముఖ్యమో, సెషన్ల మధ్య శరీరం కోలుకోవడం (రికవరీ) కూడా అంతే ముఖ్యం. దురదృష్టవశాత్తూ చాలామంది దీనిని నిర్లక్ష్యం చేస్తారు. ఆటగాళ్లు అలసట నుంచి త్వరగా కోలుకోవడానికి సరైన పాదరక్షలు ఎంతో తోడ్పడతాయి. అథ్లెట్ల అవసరాలను గుర్తించి, వాస్తవ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్న చుప్స్ సంస్థతో కలవడం సంతోషంగా ఉంది."- పుల్లెల గోపీచంద్, పీజీబీఏ అధినేత..
ఓమ్నిఛానల్ విస్తరణలో చుప్స్..
ప్రస్తుతం క్రీడా రంగంలో రికవరీ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశమని చుప్స్ ఫుట్‌వేర్ వ్యవస్థాపకుడు యశేష్ ముఖి పేర్కొన్నారు. అథ్లెట్ల నిజమైన అనుభవాల ద్వారా తమ బ్రాండ్ విశ్వసనీయత మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ బ్రాండ్ డి2సి (D2C) ప్లాట్‌ఫారమ్‌లతో పాటు మింత్రా, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లు మరియు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా దేశవ్యాప్తంగా తన మార్కెట్‌ను విస్తరిస్తోంది.

