Dailyhunt
ACB raid in Hanmakonda : హన్మకొండలో ఏసీబీ దాడి... కళ్లు చెదిరే రిజిస్ట్రార్ల అవినీతి సొమ్ము

ACB raid in Hanmakonda : హన్మకొండలో ఏసీబీ దాడి... కళ్లు చెదిరే రిజిస్ట్రార్ల అవినీతి సొమ్ము

RTV News 1 week ago

ACB raid in Hanmakonda : హన్మకొండలోని వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ జరిపిన ఆకస్మిక తనిఖీల్లో రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల అక్రమ సంపాదన గుట్టు రట్టయింది.

గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు జరిపిన ఈ దాడులకు సంబంధించి ఏసీబీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం..వరంగల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అవినీతి బట్టబయలైంది.ఆఫీసులో అధికారులకు అనుబంధంగా 20 మంది అనధికార ఏజెంట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. లెక్కల్లోకి రాని రూ. 47,450 మొత్తాన్ని సీజ్ చేశారు. అదేవిధంగా 70 రిజిస్ట్రేషన్ జరగని డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఇక డాక్యుమెంట్ రైటర్ల మొబైల్ ఫోన్లను పరిశీలించగా ఏడాదిలో రూ.42 లక్షల ఫోన్పే లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. 204 డెలివరీ కాని డాక్యుమెంట్లు ఎస్ఆర్వోల వద్ద ఉన్నట్లు తేల్చారు. సబ్ రిజిస్ట్రార్ -1 జమలాపురం రామనరసింహారావు, సబ్ రిజిస్ట్రార్-2 దేవలూరి ఆనంద్ ల వాట్సాప్ చాట్స్ బాగోతం బహిర్గతమైంది. గడచిన ఏడాది కాలంలో ఈ ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్ రైటర్లతో కలిసి రూ. 42.03 లక్షల మొత్తం లావాదేవీలు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇదే క్రమంలో డెలివరీ కానీ 204 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు కనుగొన్నారు.

అనంతరం సబ్ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్ ల నివాసాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు జరపగా, కళ్లు చెదిరే ఆస్తులు బహిర్గతమయ్యాయి. ఈ సందర్భంగా రూ. 24.61 లక్షల నగదు, 819.500 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.600 కిలోల వెండి ఆభరణాలు, కపిల్ చిట్ ఫండ్ లో రూ. 30.10 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్లను దేవలూరి ఆనంద్ నివాసంలో కనుగొని స్వాధీనం చేసుకున్నారు. ఆకస్మిక తనిఖీల్లో కనుగొన్న అనేక అవకతవకలు, అక్రమాలపై తదుపరి చర్య కోసం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనున్నట్లు ఏసీబీ పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu