అమెరికాలో మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపింది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగో ఇస్లామిక్ సెంటర్ (మసీదు) బయట ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు.
ఈ దాడిలో ఒక సెక్యూరిటీ గార్డుతో సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పులకు పాల్పడిన తర్వాత దుండగులు ఇద్దరు తమను తాము కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
మెక్సికోలో దారుణం.. 10 మందిని కాల్చి చంపిన దుండగుడు
మరణించిన వాళ్లలో ఒకరైన సెక్యూరిటీ గార్డు.. దుండగులను లొపలికి చొరబడకుండా అడ్డుకున్నాడు. తన ప్రాణాలకు తెగించి మరీ వాళ్లతో పోరాడాడు. అదే సమయంలో మసీదు కాంప్లెక్స్ పరిధిలో అల్ రషీద్ అనే స్కూల్లో వందలాది మంది చిన్న పిల్లలు ఉన్నారు. ఒకవేళ సెక్యూరిటీ గార్డు అడ్డుకోకపోయి ఉంటే అక్కడ భారీ ఎత్తున రక్తపాతం జరిగి ఉండేది. ఈ ఘటన జరిగిన అనంతరం సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్కూల్ పిల్లలను సురక్షితంగా బయటకు తరలించారు. అయితే ఈ దాడికి పాల్పడ్డ ఆ దుండగులు ఎవరు ?, ఏదైనా ఉగ్రసంస్థకు చెందిన వాళ్లా ? లేదా సాధారణ వ్యక్తులా ? అనేదానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

