Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Crime News : మాఫియా డాన్ కావాలనే పిచ్చితో..తల్లినే చంపిన తనుయుడు

Crime News : మాఫియా డాన్ కావాలనే పిచ్చితో..తల్లినే చంపిన తనుయుడు

RTV News 1 week ago

Crime News : ఈ హృదయ విదారక ఘటన సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నవమాసాలు మోసి, పెంచి పెద్ద చేసిన కన్నతల్లే ఆ కొడుకు కిరాతకానికి బలైపోయింది. చెడు స్నేహాలు, సెల్ఫోన్ వ్యసనం, క్రైమ్ వెబ్సిరీస్ల మాయలో పడి ఒక మైనర్ బాలుడు ఎంతటి ఘోరానికి ఒడిగట్టాడో తెలిపే సమగ్ర కథనం ఇది.

హత్యకు గురైన స్పందన కుమారుడు పదో తరగతి పరీక్షల్లో 525 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే, అతడు సెల్ఫోన్లో జపాన్ యానిమేషన్ చిత్రాలు, క్రైమ్, డాన్ సినిమాలకు తీవ్రంగా ఆకర్షితుడయ్యాడు. చదువుపై శ్రద్ధ పెట్టాలని, సెల్ఫోన్ ఎక్కువగా వాడొద్దని తల్లి అతడిని మందలించేది. ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్లు కడుక్కోవాలని, పెద్దలతో మర్యాదగా ఉండాలని కొన్ని కట్టుబాట్లు పెట్టింది. అంతేకాకుండా, అతడి పుస్తకాలు, లెటర్లను తరచూ తనిఖీ చేసేది.ఇదే క్రమంలో తాను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు ఆ బాలుడు రాసుకున్న లేఖ తల్లి కంటపడటంతో ఆమె అతడిని గట్టిగా మందలించింది. ఈ కట్టుబాట్లను భరించలేకపోయిన ఆ బాలుడు.. తన తల్లి తనను టార్చర్ పెడుతోందని, ఇల్లు వదిలి వెళ్లి ముంబైలో ‘మాఫియా డాన్’ అవ్వాలని కలలు కనడం ప్రారంభించాడు.

ఈ క్రమంలోనే అతడికి డోలపేట సమీప గ్రామానికి చెందిన మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ రెండో యువకుడు కూడా చదువుపై శ్రద్ధ లేకుండా ఇంటర్ పరీక్షలు రాయకుండా వదిలేశాడు. తండ్రి మందలించడంతో ఇల్లు వదిలి తిరుగుతున్నాడు. వ్యవస్థపై కోపంతో ఉన్న ఆ యువకుడు కూడా ముంబై మాఫియాలో చేరాలని అనుకునేవాడు. ఇద్దరి ఆలోచనలు కలవడంతో, తమ కష్టాలను పంచుకుంటూ ఒక భయంకరమైన పథకానికి తెరతీశారు. మాఫియాలో చేరాలంటే తాము ఎంతటి నేరమైనా చేయగలమని నిరూపించుకోవాలని, అందుకోసం కన్నతల్లినే చంపాలని స్పందన కుమారుడు నిర్ణయించుకున్నాడు.

ఈ నెల 4న పథకం ప్రకారం ఇద్దరూ స్పందన ఇంటికి వెళ్లారు. అప్పటికి ఆమె ఇంట్లో లేదు.ఇంటికి రాగానే తల్లి అలవాటు ప్రకారం కాళ్లు కడుక్కోవడానికి బాత్రూమ్కు వెళ్తుందని కొడుకు చెప్పడంతో, స్నేహితుడు బాత్రూమ్లో నక్కాడు. ఆమె లోపలికి వెళ్లగానే స్నేహితుడు వెనుక నుంచి మెడ పట్టుకుని కిందపడేశాడు. ఆమె గట్టిగా అరవకుండా నోరు మూసేశాడు. రక్షించుకునే క్రమంలో ఆమె ఆ యువకుడి చేతిని కొరికినా వదల్లేదు. ఆమె చనిపోయిందని భావించి వదిలేసినా, మళ్లీ కదలికలు రావడంతో ఇద్దరూ కలిసి ఇంట్లో ఉన్న కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఆమె శరీరంపై దాదాపు 16 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

హత్య అనంతరం బాత్రూమ్లోని రక్తాన్ని కడిగేసి, మృతదేహాన్ని ఒక చీరలో చుట్టి సమీపంలోని కోనేరు (చెరువు) లో పడేశారు. తాము ధరించిన రక్తపు బట్టలు, కత్తులను ఎవరికీ దొరకకుండా విసిరేశారు.హత్య తర్వాత ఇంట్లో ఉన్న తొమ్మిదిన్నర తులాల బంగారం, రూ. 5 వేల నగదు తీసుకుని ఇద్దరూ పారిపోయారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఫోన్లలోని సిమ్ కార్డులను పారేశారు. భువనేశ్వర్, ముంబై, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లో తిరిగారు. అయితే, తమ స్నేహితులకు అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ (Instagram) ద్వారా మెసేజ్లు పంపేవారు.

ఈ సోషల్ మీడియా కదలికల ఆధారంగా నిందితులు తిరుపతిలో ఉన్నట్లు గుర్తించిన రాజాం పోలీసులు, అక్కడి పోలీసుల సాయంతో నిఘా పెట్టారు. చివరకు నిందితులు పలాస వెళ్లే క్రమంలో చిలకపాలెం వద్ద పోలీసులకు చిక్కారు. వారి నుంచి కత్తులు, బంగారం కడియం, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ జువైనల్ హోమ్కు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు.

పిల్లల ప్రవర్తన, వారి కదలికలపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని డీఎస్పీ రాఘవులు సూచించారు. సెల్ఫోన్లకు అతిగా అలవాటుపడుతున్న పిల్లలు ఏం చూస్తున్నారు? ఎవరితో స్నేహం చేస్తున్నారు? సోషల్ మీడియాలో వారి పాత్ర ఏమిటి? అనే విషయాలను గమనించాలన్నారు. పిల్లల్లో వచ్చే మార్పులను ముందే గుర్తిస్తే ఇలాంటి ఘోరమైన నేరాలను అరికట్టవచ్చని హితవు పలికారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu