Dailyhunt
Custodial Deaths: దేశంలో లాకప్ డెత్స్ కలకలం.. దక్షిణాదిలో తమిళనాడే టాప్

Custodial Deaths: దేశంలో లాకప్ డెత్స్ కలకలం.. దక్షిణాదిలో తమిళనాడే టాప్

RTV News 3 weeks ago

దేశంలో గత కొన్నేళ్లుగా తగ్గుతున్నాయని అనుకుంటున్న కస్టడీ మరణాలు(lockup deaths in india) 2026 ప్రారంభంలోనే రికార్డు స్థాయికి చేరాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 15 వరకు, అంటే కేవలం 74 రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 170 కస్టడీ మరణాలు నమోదైనట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పార్లమెంట్ వేదికగా వెల్లడించింది.

జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సేకరించిన సమాచారం ప్రకారం, ఈ ఏడాది లాకప్ డెత్ కేసుల్లో బీహార్ 19 మరణాలతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత రాజస్థాన్‌లో 18 కేసులు, ఉత్తరప్రదేశ్‌లో 15 మరణాలు సంభవించాయి. పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రాలో ఒక్కో రాష్ట్రంలో 14 చొప్పున కేసులు నమోదైయ్యాయి.

Custodial Deaths Across Country

ఇక తూర్పు భారతదేశంలో ఒడిశా (9), పశ్చిమ బెంగాల్ (7) ఆందోళనకర రీతిలో ఉండగా, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాంలో 5, అరుణాచల్ ప్రదేశ్‌లో 3 కేసులు నమోదయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో 4 కేసులు వెలుగుచూశాయి. అయితే, జమ్ముకశ్మీర్‌లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

దక్షిణాదిలో తమిళనాడు టాప్.. తెలంగాణ పరిస్థితి ఇదే!
దక్షిణ భారతదేశం విషయానికి వస్తే, తమిళనాడు 7 మరణాలతో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో 5 కేసులు నమోదు కాగా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో చెరో 3 కేసులు రికార్డయ్యాయి. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసుల అదుపులో ఉండగానే ప్రాణాలు పోతుండటంపై పౌర సమాజం నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, కస్టడీ మరణాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.

2021-22: 176 మరణాలు
2022-23: 163 మరణాలు
2023-24: 157 మరణాలు
2024-25: 140 మరణాలు

కానీ, 2026లో కేవలం రెండున్నర నెలల్లోనే 170 మరణాలు సంభవించడం షాక్‌కు గురిచేస్తోంది. గత ఏడాది మొత్తం నమోదైన కేసుల సంఖ్యను ఈ ఏడాది తొలి 74 రోజుల్లోనే దాటేయడం భద్రతా వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతోంది.

"కస్టడీలో మరణం అనేది మానవ హక్కుల ఉల్లంఘనలో అత్యంత దారుణమైన రూపం. నిందితులకు రక్షణ కల్పించడంలో వైఫల్యాలను ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి."

ఈ డేటా ఆధారంగా దేశంలో పెరుగుతున్న లాకప్ మరణాల నివారణకు కఠినమైన సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu