Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Dasari Narayana Rao : 'దర్శకరత్న' సమాధి దుస్థితిపై నెటిజన్ల ఆవేదన..స్పందించిన మనోజ్‌

Dasari Narayana Rao : 'దర్శకరత్న' సమాధి దుస్థితిపై నెటిజన్ల ఆవేదన..స్పందించిన మనోజ్‌

RTV News 2 weeks ago

Dasari Narayana Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమను దశాబ్దాల పాటు శాసించి, ఎప్పుడూ ఎవరికీ తలవంచని మహారాజులా బతికిన వ్యక్తి దాసరి నారాయణరావు. మే 30, 2017న ఆయన కనుమరుగైన తర్వాత మొయినాబాద్లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించి, అక్కడ ఒక మెమోరియల్ను నిర్మించారు.

అయితే, మే 30న ఆయన వర్ధంతి సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫొటోలు, వీడియోలు దాసరి అభిమానులను, సినీ ప్రియులను తీవ్రంగా కలచివేసాయి. ఎటు చూసినా పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలు, చెత్తాచెదారంతో నిండిపోయి.. అది ఒక మహనీయుడి స్మారక స్థలమా లేక పాడుబడిన గుహనా అనేలా ఆ ప్రాంగణం మారిపోయింది.

ఆయన బతికున్నప్పుడు గురువుగారూ అంటూ చుట్టూ చేరి భజన చేసిన శిష్యగణం, ఇండస్ట్రీ పెద్దలు, ఆయన ఇంట్లో నిత్య అన్నదానంలో ఆకలి తీర్చుకున్నవారంతా ఇప్పుడు ఏమయ్యారంటూ నెటిజన్లు ఆక్రోశం వెళ్లగక్కారు. రాజు గారి ఆన లేనిదే తమ జీవితం ముందుకు సాగదని వినయం ప్రదర్శించినవారు కనీసం వర్ధంతి రోజున కూడా ఇటువైపు చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు, ఆయన ఆస్తుల కోసం కొట్టుకుంటున్న ఇద్దరు కొడుకులకు కనీసం తండ్రి స్మారక స్థలాన్ని పట్టించుకోవాలనే స్పృహ లేదా అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన, ఆవేశం వ్యక్తం చేశారు.

ఈ హృదయ విదారక దృశ్యాలపై టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ సానుకూలంగా స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను శుక్రవారం రాత్రి తన టీమ్ షేర్ చేయడంతో ఆయన తీవ్రంగా చలించిపోయారు. అన్న మాట ప్రకారం శనివారం ఉదయాన్నే తన షూటింగ్ను కూడా పక్కనపెట్టి, తన అనుచరగణంతో కలిసి మొయినాబాద్లోని స్మారక స్థలానికి చేరుకున్నారు. గతంలో (మూడేళ్ల క్రితం) కూడా ఇక్కడ పరిస్థితి ఇలాగే ఉంటే శుభ్రం చేశామని గుర్తుచేసుకున్న మనోజ్.. స్వయంగా చెత్తాచెదారాన్ని తొలగించే పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. దర్శకుడు సాయిరాజేష్ బృందం కూడా ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగస్వామ్యమైంది.

ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే ప్రముఖ నిర్మాణ సంస్థ 'గీతా ఆర్ట్స్' కూడా అంతే వేగంగా స్పందించింది. వివాదాలు, విమర్శల జోలికి వెళ్లకుండా సమస్యను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రతినిధుల బృందాన్ని రంగంలోకి దించింది. మంచు మనోజ్ అనుచరులు, గీతా ఆర్ట్స్ ప్రతినిధులు సమిష్టిగా శ్రమించి, ఆ ప్రాంగణంలోని పిచ్చి మొక్కలను, ముళ్ల పొదలను తొలగించి చకచకా పనులు పూర్తి చేశారు. ఈ ఇరు బృందాల చొరవతో ఆ స్మారక స్థలానికి తక్కువ సమయంలోనే పూర్వ వైభవం చేకూరింది.

పారిశుద్ధ్య పనులు పూర్తయిన అనంతరం మంచు మనోజ్ స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి దాసరి నారాయణరావు విగ్రహానికి, సమాధికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పరిశ్రమకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన ఒక మహోన్నత వ్యక్తికి జరిగిన అవమానాన్ని తుడిచేస్తూ.. మంచు మనోజ్, గీతా ఆర్ట్స్ చూపిన ఈ బాధ్యతాయుత ప్రవర్తనపై టాలీవుడ్ వర్గాల నుండి ప్రశంసలు కురుస్తున్నాయి. పరిశ్రమలో ఇదొక మంచి సంప్రదాయానికి దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకనైనా ఆ మహనీయుడి స్మారకానికి తగిన గౌరవ మర్యాదలు దక్కుతాయని అభిమానులు ఆశిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu