Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
E-Pharmacy : ఈ-ఫార్మసీలపై పోరు...రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్..

E-Pharmacy : ఈ-ఫార్మసీలపై పోరు...రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్..

RTV News 5 days ago

E-Pharmacy : కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ మందుల అమ్మకాలకు (ఈ-ఫార్మసీ) అనుమతిస్తూ తీసుకువచ్చిన కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఫార్మసీ రంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి.

ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ (ఏఐఓసీడీ) పిలుపు మేరకు రేపు (బుధవారం - మే 20వ తేదీన) దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్కు సర్వం సిద్ధమైంది. ఈ భారీ నిరసన సమ్మెకు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్లు పూర్తి మద్దతు ప్రకటించాయి.ఈ బంద్ కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 12.40 లక్షలకు పైగా మెడికల్ దుకాణాలు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు తమ సేవలను పూర్తిగా నిలిపివేయనున్నాయి. ఒక్క తెలంగాణలోనే 30 వేలకు పైగా ఫార్మసీలు మూతపడనుండగా, అందులో రాజధాని హైదరాబాద్ నగర పరిధిలోనే 16 వేలకు పైగా మెడికల్ షాపులు బంద్లో పాల్గొంటుండటం గమనార్హం.

మందుల వ్యాపారుల ఆగ్రహానికి కారణాలు ఏంటి..?

ఆన్లైన్ ఫార్మసీల వల్ల ఇటు వ్యాపారాలు దెబ్బతినడమే కాకుండా, అటు ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి:చిన్న వ్యాపారాల మనుగడ ప్రశ్నార్థకం: ఆన్లైన్ సంస్థలు భారీ డిస్కౌంట్లతో మందులను విక్రయిస్తుండటంతో కస్టమర్లంతా ఆన్లైన్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక చిన్న చిన్న మెడికల్ షాపుల వ్యాపారం పూర్తిగా క్లోజ్ అయిందని యజమానులు ఫైర్ అవుతున్నారు.
ఎలాంటి పర్యవేక్షణ, కఠిన నిబంధనలు లేకుండా ఆన్లైన్ ఫార్మసీలు ఇష్టానుసారంగా మందులు విక్రయిస్తుండటం వల్ల నకిలీ మందుల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఏఐఓసీడీ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఒకవైపు ఆన్లైన్ సంస్థలకు ఎటువంటి నియంత్రణలు లేకుండా వదిలేసిన కేంద్రం, రకరకాల రూల్స్ పేరుతో సాధారణ మెడికల్ షాప్ ఓనర్లను మాత్రం డ్రగ్ ఇన్స్పెక్టర్ల ద్వారా తీవ్రంగా వేధిస్తోందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు.

ఒకేసారి దేశవ్యాప్తంగా వేలాది షాపులు మూతపడుతుండటంతో పేషెంట్లు, వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే, ప్రజల అత్యవసర ప్రాణ రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఈ బంద్ నుంచి కొన్ని కీలక మినహాయింపులను ప్రకటించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని అమృత్ ఫార్మసీలు యథావిధిగా పనిచేస్తాయి.పెద్ద హాస్పిటల్స్ లోపల ఉండే ఇన్సైడ్ మెడికల్ షాపులు ఎప్పటిలాగే తెరిచి ఉంటాయి.అత్యవసర మందుల సరఫరా కోసం 24/7 (రౌండ్ ది క్లాక్) పనిచేసే మెడికల్ స్టోర్లకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఈ బంద్ నేపథ్యంలో షుగర్, బీపీ, కిడ్నీ వంటి దీర్ఘకాలిక (Chronic) వ్యాధులతో బాధపడే రోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు.. ముందుగానే రెండు, మూడు రోజులకు సరిపడా మందులను కొనుగోలు చేసి పెట్టుకోవాలని అసోసియేషన్ ప్రతినిధులు సూచించారు.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆన్లైన్ మందుల సరఫరా నిబంధనలను తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో 'నిరవధిక బంద్'కు సైతం వెనకాడబోమని వ్యాపార సంఘాలు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu