Dailyhunt
Fisherman: జాలరి ప్రాణం తీసిన చేప.. బతికున్న చేప కడుపులోకి వెళ్లి..!

Fisherman: జాలరి ప్రాణం తీసిన చేప.. బతికున్న చేప కడుపులోకి వెళ్లి..!

RTV News 3 weeks ago

చేపలు పట్టడం ఆ యువకుడికి అలవాటే.. కానీ అదే చేప తన పాలిట యమశాపంలా మారుతుందని అతడు ఊహించలేదు. వలలో చిక్కిన చేపని నోట పట్టుకుని మరో చేపను తీయబోగా, అది కాస్తా గొంతులోకి జారి ఊపిరాడకుండా ప్రాణం పోయింది.

ఒడిశా రాష్ట్రం(odisha) లో జరిగిన ఈ విచారకర ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లా దిఘి గ్రామానికి చెందిన అవినాష్ బిజులీ అనే యువకుడు శుక్రవారం మధ్యాహ్నం చేపల వేట(fisherman) కి చెరువుకు వెళ్లాడు. వల విసరగా అతడికి మంచి వేట దొరికింది. వలలో చిక్కిన చేపలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్న క్రమంలో, ఒక చేపను తీసి పక్కన పెట్టడానికి బదులుగా.. రెండు చేతులూ ఖాళీ లేకపోవడంతో ఆ చేపను నోటితో గట్టిగా పట్టుకున్నాడు. వలలో పడ్డ మిగతా చేపలను తీస్తున్నాడు. అవినాష్ నోటితో పట్టుకున్న చేప ఒక్కసారిగా విదిలించుకోవడంతో, అది జారి నేరుగా అతడి గొంతులోకి దూరింది. ఆ చేప గొంతులో అడ్డంగా ఇరుక్కుపోవడం(fish stuck in throat) తో అతడికి శ్వాస తీసుకోవడం కష్టతరమైంది. చేప లోపలికి వెళ్లక, బయటకు రాక గొంతులోనే గిలగిలలాడటంతో అవినాష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

ఆసుపత్రిలో వైద్యులు అత్యవసరంగా చికిత్స ప్రారంభించి, గొంతులో ఉన్న చేపను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో అవినాష్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కాగా, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే అవినాష్ మరణించాడని, చికిత్స అందించడంలో ఆలస్యం చేశారని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.

చేపలు పట్టే సమయంలో చాలామంది జాలర్లు ఇలాగే చేపలను నోటితో పట్టుకోవడం వంటి ప్రమాదకర పనులు చేస్తుంటారు. చిన్నపాటి అజాగ్రత్త ఎంతటి ప్రాణాపాయానికి దారితీస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. యువ జాలరి మృతితో దిఘి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu