Dailyhunt
Instagram Blackmail Trap Case : ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అమ్మాయిలకు వల...లక్షల్లో వసూలు చేసిన ముఠా గుట్టు రట్టు

Instagram Blackmail Trap Case : ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అమ్మాయిలకు వల...లక్షల్లో వసూలు చేసిన ముఠా గుట్టు రట్టు

RTV News 1 week ago

Instagram Blackmail Trap Case : ఇన్స్టాగ్రామ్ వేదికగా సాగుతున్న వలపు వలను జూబ్లీహిల్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ఆకర్షణీయమైన ఫోటోలు, విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శిస్తూ యువతులను వంచించే ఓ ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు, నిందితుల అరాచకాలను వెలుగులోకి తెచ్చారు.

గతంలో ముఠాకు చెందిన అర్జున్ అలీయాస్నే ఆజాద్ అనే యువకున్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ రోజు అతని సోదరున్ని కూడా అరెస్ట్ చేశారు. వారితో పాటు ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఈ ముఠా ప్రధానంగా సామాజిక మాధ్యమాల్లో తమను తాము అత్యంత ధనవంతులుగా చిత్రించుకోవడానికి ఇన్స్టాగ్రామ్ను వాడుకుంది. నిందితులైన అర్జున్, రాజీవ్లు ఖరీదైన కార్లు, బ్రాండెడ్ దుస్తులు ధరించి, స్టార్ హోటళ్లలో విందులు చేస్తున్న రీల్స్, ఫోటోలను పోస్ట్ చేసేవారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లోని సంపన్న యువతులను లక్ష్యంగా చేసుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపేవారు. ఆడంబరాలకు ఆకర్షితులయ్యేలా చేయడం ద్వారా మొదట వారి నమ్మకాన్ని గెలుచుకునేవారు.యువతులతో పరిచయం ఏర్పడిన కొద్దిరోజులకే నిందితులు ప్రేమ నాటకాన్ని మొదలుపెట్టేవారు. పెళ్లి చేసుకుంటామని, తమ జీవితం మొత్తం వారితోనే గడుపుతామని నమ్మబలికేవారు. ఇలా మాటల గారడీతో యువతుల సాన్నిహిత్యాన్ని పెంచుకునేవారు. ఈ క్రమంలో వారి వ్యక్తిగత విషయాలు, సున్నితమైన సమాచారాన్ని సేకరించడమే నిందితుల అసలు లక్ష్యం. నమ్మకం కుదిరిన తర్వాత అత్యవసరాల పేరుతో మొదట చిన్న చిన్న మొత్తాలు తీసుకుని, ఆపై అసలు రూపం చూపించేవారు.

యువతులతో సాన్నిహిత్యం పెరిగిన తర్వాత సేకరించిన వారి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను నిందితులు ఆయుధాలుగా మార్చుకున్నారు. "మేము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతాం లేదా మీ తల్లిదండ్రులకు చూపిస్తాం" అంటూ బెదిరింపులకు దిగేవారు. ఈ భయంతో పలువురు యువతులు నిశ్శబ్దంగా లక్షలాది రూపాయలు సమర్పించుకున్నారు. ఇప్పటివరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను బ్లాక్మెయిల్ చేసి సుమారు రూ. 13 లక్షల వరకు వసూలు చేశారని తేలింది. వాటితో కారు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరో యువతి నుంచి బంగారు గొలుసు తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు.

ఈ వ్యవహారంపై బాధితుల నుంచి ఫిర్యాదు అందడంతో జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రధాన నిందితుడు అర్జున్ను గతంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు, తప్పించుకుని తిరుగుతున్న అతని సోదరుడు రాజీవ్ను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బెంగళూరులో పట్టుకున్నారు. నిందితుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితులు ఇప్పటివరకు దాదాపు 10 మందికి పైగా యువతులను వీరు ఇదే తరహాలో మోసం చేసినట్లు గుర్తించారు.నిందితుడు అర్జున్పై హైదరాబాద్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఈ వసూలు చేసిన సొమ్మును విలాసాలకు, తదుపరి మోసాలకు పెట్టుబడిగా వాడుతున్నట్లు సమాచారం. కాగా ఈ ముఠాలో సుమారు 10 మంది వరకు ఉండవచ్చని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా, సామాజిక మాధ్యమాల్లో కనిపించే ఆడంబరాలను చూసి మోసపోవద్దని. అపరిచితులతో వ్యక్తిగత ఫోటోలు, సమాచారం పంచుకునే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా ఇటువంటి వేధింపులకు గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu