Dailyhunt
Jeevan Reddy : రేవంత్ పోవాలి.. మార్పు రావాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jeevan Reddy : రేవంత్ పోవాలి.. మార్పు రావాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

RTV News 2 weeks ago

Jeevan Reddy : మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పోవాలి..మార్పు రావాలి అని ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని, కానీ, నేడు అదే ప్రజలు రెండేళ్ల పాలనలోనే సీఎం రేవంత్ రెడ్డి( cm-revanthreddy) పోవాలి..

మార్పు రావాలి' అనే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి(jeevan-reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన రెండేళ్ల కాలంలోనే రేవంత్ రెడ్డి పై ప్రజలకు తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని ఆయన తేల్చి చెప్పారు. నాలుగు దశాబ్ధాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాగా ఇంతకాలం పార్టీలో తన అడ్డు తొలగించుకునేందుకే నామినేటెడ్ పదవుల నియామకంలో జాప్యం చేశారని జీవన్ రెడ్డి ఆరోపించారు.

కాళేశ్వరం పునరుద్ధరణలో నిర్లక్ష్యం

తెలంగాణ వ్యవసాయ రంగానికి ఉపయోగకరమైన కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న విమర్శలు రాజకీయ కోణంలో మాత్రమే ఉన్నాయని.. కానీ పునరుద్ధరణ పై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాళేశ్వరంపై కేంద్ర మంత్రి సీ.ఆర్. పాటిల్ చేసిన వ్యాఖ్యలను జీవన్ రెడ్డి తప్పు పట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు మొత్తం ప్రాజెక్ట్లో చిన్న భాగమేనని గుర్తు చేశారు. ఈ మూడు బ్యారేజీలను పునరుద్ధరించడానికి కేవలం రూ.500 కోట్లలోపే ఖర్చవుతుందని, అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోషనీయమని విమర్శించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక వచ్చినప్పటికీ దాన్ని ప్రభుత్వం అమలు చేయలేదని ఆక్షేపించారు.ప్రాణహిత నది జలాలను వినియోగించుకునే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కనీసం సరైన డిజైన్ కూడా రూపొందించలేదని విమర్శించారు. దీనికి సంబంధించి బడ్జెట్లో కేవలం రూ.152 కోట్లు మాత్రమే కేటాయించడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కడెం, ఎస్ఆర్ఎస్పీ ద్వారా 100 టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టకపోవడం పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు జీవనాధారమని, హైదరాబాద్ తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, మూసి ప్రక్షాళన అన్నీ దీనిపైనే ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని విస్మరించరాదని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టకపోతే దాదాపు 18 లక్షల ఎకరాల సాగు భూమి, హైదరాబాద్ అవసరాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని ఆయన హెచ్చరించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల పునరుద్ధరణను తక్షణమే చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని, లేకపోతే ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని తెలంగాణ సమాజం క్షమించదని జీవన్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు.

త్వరలోనే నిర్ణయం

తను ప్రజాసేవ చేసే విషయంలో తప్పకుండా ఏదో ఒక పార్టీలో చేరాల్సిన అవసరం ఉందని, అయితే ఏ పార్టీలో చేరాలనే విషయంలో ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదన్నారు. తన రాజకీయ భవిష్యత్తును అభిమానులు, అనుచరులే నిర్ణయిస్తారని తెలిపారు. వారి సూచన అభ్యర్థన మేరకు తను నిర్ణయం తీసుకుంటానన్నారు. మరో రెండు వారాల్లో తాను ఏ పార్టీలో చేరుతాననేది మీడియా ద్వారానే ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శిస్తూ మాట్లాడిన జీవన్ రెడ్డి కేంద్రమంత్రి సీ.ఆర్. పాటిల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని విమర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్ లో చేరడం ఖాయమని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu