పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసు విచారణ నిష్పాక్షికంగా సాగాలంటే బండి సంజయ్ను కేబినెట్ నుంచి తక్షణమే తప్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
బాధిత మైనర్ బాలికకు న్యాయం జరగాలన్నా, ఈ తీవ్రమైన పోక్సో కేసు విచారణ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా స్వతంత్రంగా, పారదర్శకంగా సాగాలన్నా బండి సంజయ్ తన పదవిలో కొనసాగకూడదని కవిత స్పష్టం చేశారు. బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన పదవిలో ఉన్నారని.. ఆయన ఆ పదవిలో ఉంటే విచారణాధికారులపై పరోక్షంగా ఒత్తిడి పడే అవకాశం ఉందని ఆమె లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను, నైతికతను కాపాడేందుకు ప్రధాని మోదీ ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని సంజయ్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి
మరోవైపు పరారీలో ఉన్న బండి భగీరథ్ను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు తమ వెతుకులాటను మరింత తీవ్రం చేశారు. మొత్తం నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి హైదరాబాద్, కరీంనగర్తో పాటు ఢిల్లీలోనూ విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. కరీంనగర్లోని బండి సంజయ్ నివాసం, భగీరథ్ మేనమామ వంశీకృష్ణ ఇల్లు సహా ఇతర బంధువుల ఇళ్లలో పోలీసులు ఇప్పటికే సోదాలు నిర్వహించారు. భగీరథ్ ఢిల్లీలో కొందరు బీజేపీ నేతల రక్షణలో ఉన్నారనే సమాచారంతో పోలీసుల బృందం అక్కడికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.
భగీరథ్ ఇప్పటికే పోలీసుల అదుపులోకి వచ్చాడనే ప్రచారం జరిగినప్పటికీ, అతను ఇంకా పరారీలోనే ఉన్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, భగీరథ్ వెంటనే పోలీసులకు లొంగిపోవాలని సీఎం సూచించారు. మరోవైపు బాధిత మైనర్ బాలిక వివరాలు, ఫోటోలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసే వారిపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కఠినమైన కేసులు నమోదు చేస్తామని సైబరాబాద్ పోలీసులు గట్టిగా హెచ్చరించారు.

