Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Khamenei Funeral : మూడు నెలల తర్వాత..ఇరాన్ సుప్రీం నేత ఆయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు?

Khamenei Funeral : మూడు నెలల తర్వాత..ఇరాన్ సుప్రీం నేత ఆయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు?

RTV News 1 week ago

Ayatollah Ali Khamenei Funeral : పశ్చిమాసియాను కుదిపేసిన భీకర యుద్ధ వాతావరణం కారణంగా నెలల తరబడి వాయిదా పడుతూ వచ్చిన ఇరాన్ సర్వోన్నత నేత ఆయతొల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియలకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది.

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ఉధృతి తగ్గిన నేపథ్యంలో.. తమ దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎత్తున, వైభవంగా ఈ అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఇరాన్ ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు అధికారిక ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించే ఖచ్చితమైన తేదీపై ఇరాన్ ప్రభుత్వం ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వనప్పటికీ.. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ఒక ‘ప్రత్యేక ప్రధాన కార్యాలయాన్ని’ (Special Headquarters) ఏర్పాటు చేసినట్లు ఇరాన్ స్టేట్ టీవీ ప్రకటించింది. ఇస్లామిక్ ప్రచారానికి సంబంధించిన ‘టెహ్రాన్ కోఆర్డినేషన్ కౌన్సిల్’ అధినేత మొహసిన్ మహ్మూదీ ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ సంస్థలు, భద్రతా విభాగాలు సమన్వయంతో ఈ అంతిమ యాత్రకు సంబంధించిన తుది ప్రణాళికలు రూపొందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

మూడు దశాబ్దాలకు పైగా ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ను ఏకఛత్రాధిపత్యంగా నడిపించిన సర్వోన్నత నాయకుడు ఆయతొల్లా అలీ ఖమేనీ, ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మొదటి విడత వైమానిక దాడుల్లో మరణించారు. ఆ దాడుల అనంతరం ఇరుపక్షాల మధ్య భీకర యుద్ధం రాజుకుంది. గత ఏప్రిల్ నెలలో ఖమేనీకి నివాళులు అర్పిస్తూ ఒక చిన్న స్మారక కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ, అప్పట్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అధికారిక ప్రభుత్వ అంత్యక్రియలను నిర్వహించడం సాధ్యపడలేదు.
ఇరాన్ అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఈ మహా అంతిమ యాత్రను ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు మొహసిన్ మహ్మూదీ తెలిపారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ఇరాన్ దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలతో పాటు, వివిధ ప్రపంచ దేశాల ప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టెహ్రాన్ నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

గత ఏప్రిల్ నెల నుంచి ఇరు దేశాల మధ్య తాత్కాలికంగా కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ, యుద్ధాన్ని పూర్తిగా ముగించే శాంతి ఒప్పందం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. ఇలాంటి అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అస్థిరమైన పరిస్థితుల నడుమ ఇరాన్ ప్రభుత్వం తమ సర్వోన్నత నాయకుడికి అధికారికంగా తుది వీడ్కోలు పలకడానికి సిద్ధమవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఆనాటి దాడుల్లో ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వచ్చాయి. అయినప్పటికీ, తండ్రి మరణానంతరం ఆయన్నే ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా ఇరాన్ యంత్రాంగం ఎన్నుకుంది. అయితే, నూతన సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించినప్పటికీ, ఆయన ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజల ముందుకు రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జరగబోయే ఈ అంతిమ సంస్కారాల కార్యక్రమం ఇరాన్ రాజకీయ భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారనుంది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu