పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో యుద్ధం జరిగితే అది గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఉంటుందని, తాము భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చి మరీ దాడులు చేస్తామని బెదిరించారు.
"భారత్ మరోసారి సాహసం చేయాలని చూస్తే, గతేడాది కంటే ఎక్కువ అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈసారి యుద్ధం కేవలం 200 నుండి 250 కిలోమీటర్ల సరిహద్దులకే పరిమితం కాదు. మేమే వారి భూభాగంలోకి వెళ్లి, వారి ఇంట్లోకి చొరబడి మరీ చంపేస్తాం అని ఖవాజా ఆసిఫ్ కామెంట్స్ చేశారు. పాకిస్థాన్ సైన్యం భారత్ లోపల లోతైన లక్ష్యాలపై దాడులు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు.
అంతకుముందు, భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేరళలో జరిగిన 'సైనిక్ సమ్మాన్ సమ్మేళనం'లో మాట్లాడుతూ పాకిస్థాన్కు గట్టి హెచ్చరిక పంపారు. పాకిస్థాన్ వైపు నుండి ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా, భారత్ తీసుకునే చర్య మునుపెన్నడూ లేని విధంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ ఇంకా ముగియలేదు. పాకిస్థాన్ మళ్ళీ అలాంటి దుశ్చర్యలకు పాల్పడితే, మా సైన్యం వారు ఎప్పటికీ మర్చిపోలేని సమాధానం ఇస్తుందని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
2025 ఏప్రిల్లో ఆపరేషన్ సింధూ
కాగా 2025 ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన తర్వాత, భారత్ 'ఆపరేషన్ సింధూర్'ను చేపట్టింది. కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్థాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను క్షిపణులు, డ్రోన్ల ద్వారా భారత్ ధ్వంసం చేసింది.
పహల్గామ్ దాడికి ప్రతిచర్యగా భారత్ జరిపిన మెరుపు దాడులతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ కూడా తన ఫిరంగి దళాలు, డ్రోన్లతో భారత సైనిక స్థావరాలపై ఎదురుదాడికి దిగింది. చివరకు మే 10, 2025న ఇరు దేశాల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించబడింది. అయితే, ప్రస్తుతం ఇరు దేశాల మంత్రులు పరస్పరం చేసుకుంటున్న హెచ్చరికలతో ఆ కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడేలా కనిపిస్తోంది.

