Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
KTR FIRE ON CONGRESS : అడ్డ దారిలో గద్దెనెక్కిన అడ్డగాడిద కాంగ్రెస్...కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR FIRE ON CONGRESS : అడ్డ దారిలో గద్దెనెక్కిన అడ్డగాడిద కాంగ్రెస్...కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

RTV News 1 week ago

KTR FIRE ON CONGRESS : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి నేటితో పుష్కర కాలం (12 ఏళ్లు) పూర్తయిందని కేటీఆర్ గుర్తుచేశారు. దశాబ్ద కాలం పాటు ఎంతో వైభవంగా వర్ధిల్లిన పుష్కర తెలంగాణ.. దురదృష్టవశాత్తూ నేడు ముష్కరుల పాలైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి సంపద, మహోజ్వల చరిత్ర కలిగిన ఈ పవిత్ర నేలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

దేశ ప్రజలంతా కాంగ్రెస్ అనే దరిద్రాన్ని ఎప్పుడో వదిలించుకున్నారని, కానీ తెలంగాణలో మాత్రం ప్రజలు అమాయకంగా నమ్మి ఆ పార్టీని గెలిపించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అడ్డదారిలో గద్దెనెక్కిన ఈ అడ్డగాడిద కాంగ్రెస్ను గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తీవ్రంగా బాధపడుతున్నారన్నారు. ఆరు నెలల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వ పని 50 శాతం ముగిసిపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడని ఏకైక లివింగ్ లెజెండ్ కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. పోరాట నాయకుడే పాలకుడైతే బాగుంటుందని గతంలో ప్రజలు భావించారని, రాబోయే 2028 డిసెంబర్ ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ఇప్పుడు బీఆర్ఎస్ కంటే ఎక్కువగా ప్రజలే స్వయంగా చెబుతున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నిరంతరాయంగా సాగిన ‘రైతు బంధు’ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి నాలుగు సార్లు ఎగ్గొట్టారని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతు బంధు బంద్ అయిందని, దానికి బదులుగా ‘రాహుల్ బంధు’ స్టార్ట్ అయి తెలంగాణ సొమ్ము ఢిల్లీకి తరలిపోతోందని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు అశోక్నగర్కు వచ్చి రాహుల్ గాంధీ నిరుద్యోగులకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. అలాగే ఆరు నెలల్లో పిఆర్సి (PRC) ఇస్తామని చెప్పి, ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో లక్షా 65 వేల ఉద్యోగాలు ఇస్తే.. నేడు కాంగ్రెస్ హయాంలో రైతులు తమ హక్కుల కోసం అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితి వచ్చిందని వాపోయారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి ప్రభుత్వం భయపడుతోందని కేటీఆర్ అన్నారు. సెక్యూరిటీ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి గానీ, ఆయన మంత్రులు గానీ కనీసం బయటకు కూడా రాలేని విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఎద్దేవా చేశారు. తెలంగాణ వనరులైన కృష్ణా, గోదావరి నదీ జలాలను రేవంత్ రెడ్డి తన గురువులకు గురుదక్షిణగా సమర్పిస్తున్నారని ఆరోపించారు. ‘కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో, చావు నోట్లోకి వెళ్లి రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత కేసీఆర్ది అని కేటీఆర్ స్పష్టం చేశారు. నెత్తురు పారిన నేలలో సాగునీరు పారించిన అపర భగీరథుడు కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి గొప్ప నాయకుడిని చూసి నేడు కొందరు అల్పులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, తెలంగాణ తల్లి నెత్తిన ఉన్న కిరీటాన్ని ఎత్తుకెళ్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు మరో ప్రజా పోరాటానికి సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లోని నేతలు, కార్యకర్తలతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. బాబాసాహెబ్ అంబేద్కర్, అమరవీరుల సాక్షిగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను ఛేదించి, రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు మనసా, వాచా, కర్మణా పునరంకితమవుతున్నట్లు అందరితో శపథం చేయించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu