Dailyhunt
Liquor prices  : మద్యం ప్రియులకు షాక్‌..లిక్కర్ ధరల పెంపునకు కసరత్తు

Liquor prices : మద్యం ప్రియులకు షాక్‌..లిక్కర్ ధరల పెంపునకు కసరత్తు

RTV News 1 week ago

Liquor prices : తెలంగాణలో మద్యం ప్రియులకు రేవంత్ సర్కార్ షాక్ ఇవ్వనున్నట్టు సంకేతాలు ఇస్తోంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం, డిస్టలరీల ఒత్తిడి నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ధరలను పెంచేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది.

సాధారణ బ్రాండ్లపై రూ. 60 నుండి ప్రీమియం బ్రాండ్లపై రూ. 120 వరకు భారం పడే అవకాశం ఉండటంతో, సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తెలంగాణ మద్యం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయంగా గ్యాస్, ముడి సరుకుల ధరలు పెరగడంతో గ్లాస్ బాటిల్స్, ప్యాకేజింగ్ ఖర్చులు భారమయ్యాయని డిస్టలరీలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత ధరల సవరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. ఒక వైపు ఎండల తీవ్రతతో బీర్ల అమ్మకాలు రికార్డులు సృష్టిస్తుంటే మరో వైపు మద్యం ధరల పెంపు ప్రతిపాదన మందు బాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇప్పటికే ఎండ వేడికి తట్టుకోలేక బీర్ల వైపు మొగ్గు చూపుతున్న వినియోగదారులకు ప్రతి సీసాపై రూ. 10 నుండి రూ. 20 వరకు పెరగనున్న ధరలు అదనపు భారమే.ఈ నెలలోనే కొత్త ధరల గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ధరల పెంపు అమల్లోకి వస్తే ప్రీమియం బాండ్ల మద్యం ఫుల్ బాటిల్కు రూ. 100 వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

గత ఏడాది కాలంగా మద్యం తయారీ కంపెనీలు ధరలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయి. కానీ, ప్రభుత్వం ధరల పెంపుపై నిర్ణయం తీసుకోలేదు. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం, ముడిసరుకుల రవాణా ఖర్చులు, బాటిళ్ల తయారీకి వినియోగించే గ్యాస్ ధరలు పెరిగాయి. దీంతో ధరల పెంపు ప్రతిపాదన మరోసారి తెరమీదికి వచ్చింది. దీనికితోడు ప్రభుత్వం ఆర్ధిక ఒత్తిళ్లను పరిగణనలోకి తీసుకని ధరల పెంపునకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.ధరల పెంపు విషయంలో ఎక్సైజ్ శాఖ ముగ్గురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ బ్రాండ్ల ధరల పెంపుపై కంపెనీలు సమర్పించిన ప్రతిపాదనలను ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించనుంది. సాధారణ బ్రాండ్ల ఫుల్ బాటిల్పై రూ.60, ప్రీమియం బ్రాండ్లపై రూ.100, ఖరీదైన బ్రాండ్లపై దాదాపు రూ.120 వరకు పెరిగే అవకాశం ఉంది.

ఒకవేళ ధరలు పెంచితే ప్రభుత్వ ఖజానాకు నెలకు అదనంగా రూ.250 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఏటా దాదాపు రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ధరల పెంపుతో మద్యం ప్రియుల జేబులకు చిల్లులు తప్పవు. అంతేకాదు అధికంగా ధరలు పెరిగితే కిక్కు కోసం గుడుంబా వైపు మళ్లే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ధరలు పెంచనున్నారు. 2023 మే నెలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరలు పెంచింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ మద్యం ధరలు పెంచలేదు.

తెలంగాణలో ప్రతిరోజూ సగటున రూ. 100 కోట్ల నుండి రూ. 110 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ అబ్కారీ శాఖ రికార్డు స్థాయిలో రూ. 40,209 కోట్ల ఆదాయాన్ని గడించింది. న్యూ ఇయర్ లేదా పండుగ సమయాల్లో ఈ అమ్మకాలు భారీగా పెరుగుతాయి. 2026 జనవరి 1వ తేదీకి ముందు ఉన్న మూడు రోజుల్లోనే దాదాపు రూ. 1,000 కోట్ల విక్రయాలు జరిగాయి. మార్చి 31, 2026 ఒక్కరోజే ఏకంగా రూ. 410.87 కోట్ల మద్యం అమ్ముడైంది. వేసవి రావడంతో రాష్ట్రంలో బీర్ల సేల్స్ ఎక్కువగా ఉన్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్లో రాష్ట్రంలో ప్రతిరోజూ సగటున 22.75 లక్షల బీర్లు అమ్ముడయ్యాయి. బీర్ కేసుల గురించి ప్రస్తావిస్తే ప్రస్తుతం రోజుకు సగటున 1.7 లక్షల నుండి 1.9 లక్షల బీర్ కేసుల విక్రయాలు జరుగుతున్నాయి. ఎండలు తీవ్రంగా ఉన్న రోజుల్లో ఇది 2 లక్షల కేసుల మార్కును కూడా దాటుతోంది. ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 50.78 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది మార్చిలో ఇది కేవలం 30 లక్షల కేసులు మాత్రమే. అంటే దాదాపు 70 శాతం వృద్ధి నమోదైంది.ప్రస్తుతం వేసవి ప్రభావంతో 50 శాతం పైగా ఆదాయం బీర్ల నుంచే వస్తోంది.

సామాన్యులు ఎక్కువగా రూ. 99 (180 ఎం.ఎల్) ధర గల 'బడ్జెట్ లిక్కర్' బాటిళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు.మద్యం దుకాణాల అద్దె రూపంలో రూ.1,771 కోట్లు, లైసెన్స్ దరఖాస్తుల ద్వారా రూ.2,869 కోట్లు అదనంగా సమకూరాయి. ఉత్పత్తి వ్యయం పెరిగిందన్న డిస్టలరీల విన్నపాన్ని మన్నిస్తూ ధరలు పెంచడం ద్వారా అటు కంపెనీలకు, ఇటు ప్రభుత్వానికి ఆదాయం పెరగనుంది.మొత్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో మద్యం ద్వారా వచ్చే ఆదాయం అత్యంత కీలక వనరుగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu