Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
MMTS stations : నగరంలో మరో మూడు  కొత్త ఎంఎంటీఎస్‌ స్టేషన్లు..ఎక్కడెక్కడో తెలుసా?

MMTS stations : నగరంలో మరో మూడు కొత్త ఎంఎంటీఎస్‌ స్టేషన్లు..ఎక్కడెక్కడో తెలుసా?

RTV News 3 weeks ago

MMTS stations : హైదరాబాద్ మహానగరంలో ఎంఎంటీఎస్ (MMTS) రెండో దశ విస్తరణ పనులు వేగవంతం అవుతున్న తరుణంలో, ప్రయాణికుల సౌకర్యార్థం మరో మూడు కొత్త స్టేషన్ల ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే రంగం సిద్ధం చేసింది.

నగరంలోని ట్రాఫిక్ కష్టాలను తగ్గించి, మధ్యతరగతి ప్రజలకు చౌకైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా అల్వాల్ లయోలా కళాశాల, ఆనంద్బాగ్, మౌలాలీ ప్రాంతాల్లో ఈ కొత్త స్టేషన్లను నిర్మించనున్నారు. స్థానికుల నుంచి వస్తున్న విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న రైల్వే అధికారులు, దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపారు.

ముఖ్యంగా ఘట్కేసర్-సనత్నగర్ మధ్య ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకల నేపథ్యంలో కొత్త స్టేషన్ల అవసరం ఎంతైనా ఉంది. అల్వాల్లోని లయోలా కళాశాల సమీపంలో స్టేషన్ నిర్మించడం వల్ల వేల సంఖ్యలో విద్యార్థులతో పాటు, స్థానిక నివాసితులకు పెద్ద ఉపశమనం కలగనుంది. పదేళ్ల క్రితమే ఈ మార్గంలో ఆరు స్టేషన్ల ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, ఇప్పుడు రైల్వే అధికారులు లెవెల్ క్రాసింగ్ వద్ద క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి, నిర్మాణం సాధ్యమేనని తేల్చారు. త్వరలోనే దీనిపై రైల్వే బోర్డు నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఆనంద్బాగ్ ప్రాంతంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు స్థానిక ప్రజల దశాబ్దాల కల. నిబంధనల ప్రకారం సబర్బన్ ప్రాంతాల్లో ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక స్టేషన్ ఉండాలి. కానీ, చర్లపల్లి నుండి నేరేడ్మెట్ వరకు ప్రస్తుతం ఒక్క స్టేషన్ కూడా అందుబాటులో లేదు. దీనివల్ల మల్కాజిగిరి చుట్టుపక్కల ప్రజలు రైలు ఎక్కాలంటే కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇతర స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోంది. ఆనంద్బాగ్లో స్టేషన్ అందుబాటులోకి వస్తే చర్లపల్లి, నిజామాబాద్ మార్గాల్లో నడిచే రైళ్లకు కనెక్టివిటీ పెరిగి, ప్రయాణ సమయం ఆదా అవుతుంది.

ఇక మౌలాలీ రైల్వే క్వార్టర్స్ సమీపంలో ప్రతిపాదించిన స్టేషన్ సుమారు రెండు వేల కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూర్చనుంది. రైల్వే ఉద్యోగుల నివాస ప్రాంతాలే కాకుండా, సమీపంలోని కాలనీల ప్రజలకు కూడా ఎంఎంటీఎస్ సేవలు చేరువవుతాయి. చర్లపల్లి టెర్మినల్ను భవిష్యత్తులో ప్రధాన రైల్వే హబ్గా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో, ఈ చిన్న స్టేషన్లు ఎంఎంటీఎస్ ఫీడర్ సేవలుగా కీలక పాత్ర పోషించనున్నాయి. నిధుల విడుదల,బోర్డు గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ మూడు స్టేషన్ల పనులు పట్టాలెక్కనున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu