వేల కోట్ల కాంట్రాక్టులు చుట్టాలకు కట్టబెట్టాడు ఆ ముఖ్యమంత్రి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి సుప్రీం కోర్టు రంగంలోకి దిగింది.
నిబంధనలకు విరుద్ధంగా తన కుటుంబ సభ్యులు, బంధువులకు చెందిన సంస్థలకు భారీగా ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పునిచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖాండూ చుట్టూ అవినీతి ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంపై తక్షణమే ప్రాథమిక విచారణ చేపట్టాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)ను ధర్మాసనం ఆదేశించింది.
ముఖ్యమంత్రి పెమా ఖాండూ తన భార్య, తల్లి, మేనల్లుడు, ఇతర బంధువులకు చెందిన కంపెనీలకు సుమారు రూ.1,270 కోట్ల విలువైన 91కి పైగా ప్రభుత్వ పనులను అప్పనంగా అప్పగించారని పిటిషనర్లు ఆరోపించారు. 'సేవ్ మాన్ రీజియన్ ఫెడరేషన్', 'వలంటరీ అరుణాచల్ సేన' వంటి స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ సంచలన ఆదేశాలు జారీ చేసింది.
పిటిషనర్ల తరపున హాజరైన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టులో వాదిస్తూ.. గత 11 ఏళ్లుగా రాష్ట్రంలో కాంట్రాక్టుల కేటాయింపులో భారీ అక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి భార్యకు చెందిన 'బ్రాండ్ ఈగల్స్' అనే సంస్థకు ఏకంగా 31 కాంట్రాక్టులు దక్కాయని పేర్కొన్నారు. మరో సంస్థ 'ఫ్రాంటియర్ అసోసియేట్స్' కూడా సీఎం కుటుంబానిదేనని వెల్లడించారు. మొత్తం 121 పనులను టెండర్ల ద్వారా కేటాయించగా, మరో 322 పనులను ఎలాంటి టెండర్లు లేకుండానే నేరుగా కట్టబెట్టారని అఫిడవిట్లో వివరించారు. రాష్ట్రంలోని మొత్తం కాంట్రాక్టుల్లో 3 శాతం కేవలం ఈ కుటుంబ సభ్యులకే దక్కడం విశేషం.
2015 నుంచి 2025 మధ్య కాలంలో జరిగిన కాంట్రాక్టులన్నింటినీ సీబీఐ క్షుణ్ణంగా పరిశీలించాలి. పనులు ఎవరికి ఇచ్చారు? నిధుల చెల్లింపు ఎలా జరిగింది? అన్న అంశాలపై 16 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల్లోగా ఈ ఉత్తర్వులను అమలు చేయాలి. దర్యాప్తునకు అవసరమైన అన్ని రికార్డులను సీబీఐకి అందజేయాలి. ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు అవసరమా లేదా అన్నది సీబీఐ నివేదిక ఆధారంగా కోర్టు తదుపరి నిర్ణయం తీసుకోనుంది.
టెండర్ల ప్రక్రియలో కేవలం 0.01% తేడాతో కాంట్రాక్టులు దక్కించుకోవడం వంటి అంశాలు 'కార్టెలైజేషన్' (సిండికేట్)ను సూచిస్తున్నాయని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ దర్యాప్తు అరుణాచల్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారే అవకాశం ఉంది.

