ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ పెట్టి విజయం సాధించిన నేపథ్యంలో, తనపై వస్తున్న విమర్శలకు ఆయన ధీటుగా బదులిచ్చారు.
పక్క రాష్ట్రంలో ఒకరు పార్టీ పెట్టి గెలవగానే.. పవన్ కూడా అలాగే ఒంటరిగా వెళ్లి ఉండాల్సిందని కొందరు అంటున్నారు. కానీ 2019లో నేను ఒంటరిగా పోటీ చేసినప్పుడు రెండు చోట్లా ఓడించారు. అప్పుడు ఒక్కొక్కరు పార్టీని వదిలి వెళ్లిపోయారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు పూర్తిగా భిన్నమని.. ఒకరిని చూసి మరొకరిని పోల్చడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో పెరుగుతున్న ఇంధన ధరల గురించి వైసీపీ చేస్తున్న విమర్శలను పవన్ తీవ్రంగా ఖండించారు. గ్యాస్, పెట్రోల్ ఏమైనా వైసీపీ నేతల ఇంట్లో నుంచి వస్తాయా? ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల మనకేం సంబంధం అని వారు మాట్లాడుతున్నారు. ప్రపంచ పరిస్థితులపై అవగాహన లేకుండా, అరకొర జ్ఞానంతో వారు చెప్పే మాటలను ఎవరూ వినకండని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తిట్టడం కొందరికి ఒక ఫ్యాషన్‌గా మారిపోయిందని ఆయన ధ్వజమెత్తారు.
కార్యకర్తలే బలం
జనసేన పార్టీ భవిష్యత్తు, నిర్మాణంపై పవన్ కల్యాణ్ తన విజన్‌ను పంచుకున్నారు. తన దృష్టిలో కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, వారు అండగా ఉంటేనే పార్టీ నిలబడుతుందని కొనియాడారు. జనసేన ఎప్పటికీ ఒక కుటుంబ పార్టీగా ఉండకూడదని ఆయన ఖచ్చితంగా చెప్పారు. పార్టీ నిర్మాణం అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుందని వివరించారు.

