Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Pinarayi Vijayan :  హ్యాట్సాఫ్ సార్ ..  అప్పుడు నవీన్ పట్నాయక్..ఇప్పుడు పినరయి విజయన్!

Pinarayi Vijayan : హ్యాట్సాఫ్ సార్ .. అప్పుడు నవీన్ పట్నాయక్..ఇప్పుడు పినరయి విజయన్!

RTV News 6 days ago

కేరళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కేరళ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీడీ సతీసన్ ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో..

కేరళ గవర్నర్ ఆర్.వి. అర్లేకర్ ఆయనతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో పాటు ఏఐసీసీ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సరికొత్త కేరళ నిర్మాణానికి సతీసన్ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి. సతీసన్‌తో పాటు పలువురు మంత్రులు కూడా ఈ వేడుకలోనే ప్రమాణస్వీకారం చేశారు.

ఈ ప్రమాణస్వీకార మహోత్సవంలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం.. కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత పినరయి విజయన్ ఈ కార్యక్రమానికి హాజరుకావడం. ఎన్నికల్లో తీవ్రస్థాయిలో తలపడినప్పటికీ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవిస్తూ నూతన ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి పినరయి విజయన్ రావడం పట్ల నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఒడిశాలో సైతం ఇలాంటి అరుదైన దృశ్యమే కనిపించింది. దశాబ్దాల పాటు ఒడిశాను పాలించిన నవీన్ పట్నాయక్.. తన ఓటమి తర్వాత బీజేపీ సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి స్వయంగా హాజరై అందరి మనసు గెలుచుకున్నారు. ఇప్పుడు పినరయి విజయన్ కూడా అదే బాటలో నడిచారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా

కేరళ ప్రమాణస్వీకార వేదికపై కనిపించిన ఈ హెల్తీ పాలిటిక్స్ పై తెలుగు సోషల్ మీడియా సర్కిల్స్‌లో సైతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఉన్నతమైన రాజకీయ సంస్కృతి, కక్షసాధింపులు లేని పరిపాలన రావాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

కాగా కేరళ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీడీ సతీసన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu