Dailyhunt
Super El Nino: నిప్పుల కొలిమిలా మారనున్న భూమి.. వందేళ్లుగా ఎన్నడూ లేని ఎండ తీవ్రత!

Super El Nino: నిప్పుల కొలిమిలా మారనున్న భూమి.. వందేళ్లుగా ఎన్నడూ లేని ఎండ తీవ్రత!

RTV News 1 week ago

Super El Nino:ఇన్ని రోజులు పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచం సంక్షోభంలో పడిపోయింది. ఇప్పుడు మరో ప్రమాదం ప్రపంచ దేశాల ముందు ఉంది. వాతావరణ పరిస్థితులు తలకిందులు కానున్నాయా?

రాబోయే రోజుల్లో ఎండలు సెగలు పుట్టించడమే కాకుండా, రుతుపవనాల గమనాన్ని మార్చేయనున్నాయా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. వారు చెప్పిన విషయాలు మానవాళిని కలవరపెడుతున్నాయి. ఈ ఏడాది (2026) భూమిపై అత్యంత శక్తిమంతమైన ‘సూపర్ ఎల్నినో’ ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వందేళ్ల రికార్డులను తిరగరాస్తూ, ప్రకృతి వైపరీత్యాలకు దారితీసే ప్రమాదం ఉందని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ స్పష్టం చేసింది. ఇది జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ మారి వాతావరణంలో ఊహించని మార్పులొస్తాయి.

అసలేమిటి ఈ సూపర్ ఎల్నినో?

పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలోని నీరు బాగా వేడెక్కడాన్ని ‘ఎల్నినో’ అంటారు. సాధారణంగా సముద్రపు నీటి ఉష్ణోగ్రత సగటు కంటే 2.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైతే, దానిని ‘సూపర్ ఎల్నినో’గా పరిగణిస్తారు. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఆ ప్రమాదకర స్థాయిని దాటే అవకాశం ఉందని ఐరోపా, అమెరికా వాతావరణ హెచ్చరికలు జారీ చేశాయి. ఈ ఏడాది మే నెల నుంచే ఎల్నినో ప్రభావం మొదలై, ఆగస్టు నాటికి ఇది తీవ్రరూపం దాల్చనుంది. ఆగస్టులో సూపర్ ఎల్నినో ఏర్పడటానికి 22 శాతం, స్ట్రాంగ్ ఎల్నినో ఏర్పడేందుకు 80 శాతం అవకాశాలు ఉన్నాయి. ఒక మోస్తరు ప్రభావానికి 98 శాతం అవకాశాలు ఉన్నాయని ఈసీఎండబ్ల్యూఎఫ్ అంచనా వేసింది. ఇది జూన్-ఆగస్టు మధ్య ప్రారంభమై ఏడాది చివరి వరకు కొనసాగే ప్రమాదముంది. దీంతో ప్రపంచ వపనాల్లో మార్పులు వచ్చి

దీనివల్ల కలిగే ప్రధాన నష్టాలు:

భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు: ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీనివల్ల వడగాల్పుల తీవ్రత పెరుగుతుంది.
అస్తవ్యస్తం కానున్న రుతుపవనాలు: వర్షపాతంలో భారీ మార్పులు సంభవిస్తాయి. కొన్ని దేశాల్లో కుండపోత వర్షాలు, వరదలు వస్తే.. మరికొన్ని దేశాలు తీవ్ర కరవు కోరల్లో చిక్కుకుంటాయి.
భారత్పై ప్రభావం: వర్షపాతం గణనీయంగా తగ్గిపోవడం వల్ల మధ్య, ఉత్తర భారతదేశంలో కరవు సంభవించే ముప్పు ఉంది. వ్యవసాయ రంగంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.
ప్రపంచవ్యాప్త కరవు: ఆస్ట్రేలియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, మధ్య ఆఫ్రికా, ఉత్తర బ్రెజిల్ వంటి ప్రాంతాల్లో వర్షాలు లేక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది.
సముద్ర తుపాన్లు: అట్లాంటిక్ సముద్రంలో తుపాన్ల ఉద్ధృతి తగ్గినప్పటికీ.. పసిఫిక్, హవాయ్, పశ్చిమాసియా తీరాల్లో తుపాన్లు బీభత్సం సృష్టించవచ్చు. - El Nino Risk

ముందస్తు జాగ్రత్తలు అవసరం!

గతంలో 1982-83, 1997-98, 2015-16 సంవత్సరాల్లో ఎల్నినో వల్ల భారీ నష్టాలు వాటిల్లాయి. అయితే ఈసారి రాబోయేది వాటన్నింటికంటే శక్తిమంతమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ నమూనాలన్నీ ఒకే దిశగా సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వాలు, ప్రజలు ముందస్తుగా అప్రమత్తం కావడం, నీటి నిల్వలను పొదుపుగా వాడుకోవడం, వ్యవసాయ ప్రణాళికలు మార్చుకోవడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu