Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana Cabinet : విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌...తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం

Telangana Cabinet : విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌...తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం

RTV News 1 day ago

Telangana Cabinet : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ (కేబినెట్) సమావేశం నిర్వహించారు.

ఈ భేటీలో విద్యా రంగం పటిష్ఠత, విద్యార్థుల సంక్షేమం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, అలాగే రాబోయే ఆధ్యాత్మిక వేడుకల సన్నద్ధతకు సంబంధించి పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ (ఇంటర్మీడియట్ విద్యార్థులకు) అమలు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం మరో అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లోనూ చదివే విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం వేళల్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ (అల్పాహారం), అలాగే పాలను పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేకూర్చనుంది. మధ్యాహ్న భోజనం, ఉదయం అల్పాహారం, పాల పంపిణీ వల్ల డ్రాపౌట్స్ (మధ్యలోనే చదువు ఆపేయడం) తగ్గి, విద్యాసంస్థల్లో హాజరు శాతం మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

రాబోయే ప్రతిష్టాత్మక 2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు, ఘాట్ల నిర్మాణానికి, భక్తులకు మౌలిక వసతుల కల్పన పనులకు తెలంగాణ కేబినెట్ భారీ నిధులను కేటాయించింది.పుష్కరాల పనుల కోసం మొత్తం రూ. 1,000 కోట్లు కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పనులను వేగవంతం చేసేందుకు తొలి విడతగా రూ. 300 కోట్ల నిధుల మంజూరుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఊరటనిస్తూ విద్యాసంస్థలు, అత్యవసర విభాగాల్లో కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.కరీంనగర్ జిల్లా గంగాధరలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నియామకాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. మొత్తం 29 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. వీటిలో 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు (ఉపాధ్యాయ ఖాళీలు),06 నాన్-టీచింగ్ పోస్టులు,03 అవుట్సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేసే పోస్టులు ఉన్నాయి. అలాగే
మహబూబాబాద్ జిల్లా కె.సముద్రం అగ్నిమాపక కేంద్రానికి (ఫైర్ స్టేషన్) సంబంధించి 18 కొత్త పోస్టుల భర్తీకి మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కేబినెట్ భేటీ.. అటు విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూనే, ఇటు నిరుద్యోగ భర్తీ, రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu