Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్(01.09.2026) తెలుగులో..

అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్(01.09.2026) తెలుగులో..

SAKSHI EDUCATION 2 weeks ago

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితిని అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరును కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 తొలి త్రైమాసికంలో (Q1 FY27) దేశ వాస్తవ జీడీపీ 7.8 శాతంగా నమోదై ఆర్థిక నిపుణుల, ఆర్బీఐ అంచనాలను అధిగమించింది.

నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) ఆగస్టు 31న విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, భారత జీడీపీ విలువ గతేడాది ఇదే త్రైమాసికంలోని ₹75.46 లక్షల కోట్ల నుంచి ₹81.36 లక్షల కోట్లకు పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 7.0 శాతం, రాయిటర్స్ అంచనా 7.1 శాతం, మనీకంట్రోల్ పోల్ అంచనా 7.3 శాతం కంటే ఇది చాలా మెరుగైన వృద్ధిని కనబరిచింది.

నామినల్ జీడీపీ, జీవీఏ గణాంకాలు...
నామినల్ జీడీపీ : ద్రవ్యోల్బణం, ధరల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకునే నామినల్ జీడీపీ 10.3 శాతం వృద్ధి చెంది ₹88.27 లక్షల కోట్లకు చేరింది (గతేడాది Q1లో ఇది ₹80 లక్షల కోట్లు).
స్థూల విలువ ఆధారిత వృద్ధి (GVA): నికర పన్నులను మినహాయించి లెక్కించే జీవీఏ 8.2 శాతానికి చేరింది. గతేడాది ఇదే సమయంలో ఇది 7 శాతంగా ఉంది. వాస్తవ జీవీఏ ₹68.21 లక్షల కోట్ల నుంచి ₹73.82 లక్షల కోట్లకు పెరగగా, నామినల్ జీవీఏ ₹80.53 లక్షల కోట్లకు చేరింది.

రంగాల వారీగా వృద్ధి రేటు...
ఆర్థిక, రియల్ ఎస్టేట్ & ప్రొఫెషనల్ సర్వీసెస్ - 12.1%
మొత్తం సేవా రంగం - 10.0% (గతేడాది 8%)
తయారీ రంగం - 9.2%
వాణిజ్యం, హోటళ్లు, రవాణా & సమాచార రంగం - 8.5%
నిర్మాణ రంగం - 7.7%
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ & ఇతర సేవలు - 7.5%
వ్యవసాయం, అటవీ & మత్స్య రంగం - 3.6%

వృద్ధికి ఊతమిచ్చిన దేశీయ వినియోగం, భారీ పెట్టుబడులు...
దేశీయంగా పెరిగిన వినియోగం, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల వ్యయాలు ఈ ఆర్థిక పురోగతికి ప్రధాన చోదకాలుగా నిలిచాయి.,
ప్రైవేట్ తుది వినియోగ వ్యయం : వార్షిక ప్రాతిపదికన 9.9 శాతానికి పైగా పెరిగింది.
ప్రభుత్వ తుది వినియోగ వ్యయం : 9.5 శాతం వృద్ధిని నమోదు చేసింది.
పెట్టుబడులు : దేశంలో స్థిర పెట్టుబడులను సూచించే గ్రాస్ ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఏకంగా 20.4 శాతం పెరిగి ఆర్థిక వ్యవస్థలోని పటిష్టమైన పెట్టుబడి వాతావరణాన్ని చాటిచెప్పింది.

ఆసియా ఖండంలో విశేష కృషి చేసిన వారికి అందించే ప్రతిష్టాత్మక 'రామన్ మెగసెసే అవార్డు-2026' విజేతలను ఆగస్టు 31న ప్రకటించారు. దౌత్యం, మానవ హక్కుల పరిరక్షణ, పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పుల వంటి రంగాల్లో విశేష సేవలు అందించిన ముగ్గురు ప్రముఖులు ఈ ఏడాది అవార్డుకు ఎంపికయ్యారు. సింగపూర్‌కు చెందిన దౌత్యవేత్త టామీ కో, మయన్మార్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త బో కీ, బంగ్లాదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త రూనా ఖాన్‌లకు ఈ పురస్కారం దక్కింది.

2026 రామన్ మెగసెసే అవార్డు విజేతలు - వారి సేవలు...
1. టామీ కో (సింగపూర్) - దౌత్యం, అంతర్జాతీయ చట్టాల రూపకర్త:
88 ఏళ్ల సీనియర్ దౌత్యవేత్త, న్యాయవాది అయిన టామీ కో.. అంతర్జాతీయ సహకారం, శాంతియుత చర్చల ద్వారా వివాదాల పరిష్కారం కోసం దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం (UNCLOS) ఒప్పంద చర్చల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. దీని ద్వారా సముద్ర వనరుల శాంతియుత, న్యాయబద్ధ వినియోగానికి ఒక చట్టబద్ధమైన ముసాయిదా ఏర్పడింది.
దేశాల మధ్య అధికార, బలగాల వ్యత్యాసం ఉన్నప్పటికీ అంతర్జాతీయ దౌత్యంలో శాంతియుత చర్చలు, చట్టబద్ధమైన పాలనకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతకు గాను ఈ అవార్డు వరించింది.

2. రూనా ఖాన్ (బంగ్లాదేశ్) - మారుమూల ప్రాంతాలకు మౌలిక సేవలు:
67 ఏళ్ల సామాజిక కార్యకర్త రూనా ఖాన్.. బంగ్లాదేశ్‌లోని మారుమూల దీవుల్లోని ప్రజల దయనీయ పరిస్థితులను చూసి చలించిపోయి 'ఫ్రెండ్‌షిప్' అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు.
ఒక సాధారణ హాస్పిటల్ బోటుతో మొదలైన ఆమె సేవలు.. నేడు నదీ తీర ప్రాంతాలు, మారుమూల పల్లెలు, శరణార్థులకు వైద్యం, విద్య, ఉపాధి, వాతావరణ మార్పుల తట్టుకునే విధానాలు వంటి అనేక రంగాలకు విస్తరించాయి.
కష్టతరమైన భౌగోళిక, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న బంగ్లాదేశ్ పేద ప్రజలకు సేవలు అందించడంలో ఆమె చూపిన దార్శనికత, ధైర్యానికి ఈ పురస్కారం దక్కింది.

3. బో కీ (మయన్మార్) - ప్రజాస్వామ్యం, న్యాయం కోసం పోరాటం:
61 ఏళ్ల బో కీ.. 1988లో మయన్మార్‌లో జరిగిన ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనల్లో పాల్గొని అరెస్టయ్యారు. రెండు సార్లు ఏడేళ్ల పాటు జైలు జీవితం గడిపారు.
2000 సంవత్సరంలో అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ అనే సంస్థను సహ వ్యవస్థాపకుడిగా ప్రారంభించారు.
సైనిక పాలనలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను డాక్యుమెంట్ చేసి, రాజకీయ ఖైదీల సమస్యలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన చేసిన సాహసోపేత పోరాటానికి ఈ అవార్డు లభించింది.

రామన్ మెగసెసే అవార్డు ప్రాముఖ్యత, ఎంపిక విధానం...
నేపథ్యం: కుల, మత, లింగ భేదాల్లేకుండా ఆసియా ప్రజలకు నిస్వార్థ సేవ చేసిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే జ్ఞాపకార్థం 1958 నుంచి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఇప్పటివరకు ఆరు దశాబ్దాల్లో 353 మంది వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డు వరించింది.
ఎంపిక: అంతర్జాతీయ రహస్య నామినేటర్ల నెట్‌వర్క్ ద్వారా ఫౌండేషన్ నామినేషన్లు స్వీకరిస్తుంది. (సాధారణ ప్రజలు నామినేట్ చేయడానికి అవకాశం లేదు). తీవ్రమైన పరిశీలన అనంతరం బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు విజేతలను ఎంపిక చేస్తారు.
ప్రధానోత్సవం: ప్రతి ఏడాది రామన్ మెగసెసే జయంతి అయిన ఆగస్టు 31న విజేతలను ప్రకటిస్తారు. ఈ ఏడాది విజేతలకు నవంబర్ 15, 2026న ఫిలిప్పీన్స్‌లోని మనీలా మెట్రోపాలిటన్ థియేటర్‌లో జరిగే అధికారిక కార్యక్రమంలో సర్టిఫికెట్, మెగసెసే ప్రొఫైల్‌తో కూడిన పతకాన్ని ప్రదానం చేయనున్నారు.

ఫుట్‌బాల్ ప్రపంచంలో తిరుగులేని లెజెండ్‌గా గుర్తింపు పొందిన అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున 207 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించి, 125 గోల్స్ సాధించిన ఆయన తన 20 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని ముగిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఎన్నో వైఫల్యాలు, అంతకుమించిన చిరస్మరణీయ విజయాలతో సాగిన తన ప్రయాణానికి స్వస్తి పలకడం చాలా కష్టమైన నిర్ణయమే అయినప్పటికీ, సరైన సమయంలో తప్పుకుంటున్నానని మెస్సీ పేర్కొన్నారు. అర్జెంటీనా జెర్సీ కోసం తన కెరీర్‌లో సర్వస్వం ధారపోశానని ఆయన ఉద్వేగంగా వెల్లడించారు.

తీవ్ర నిరాశల నుంచి విశ్వవిజేతగా ఎదిగిన తీరు...
మెస్సీ కెరీర్ తొలినాళ్లలో అర్జెంటీనా జట్టు తరఫున ఎన్నో తీవ్రమైన ఎదురుదెబ్బలు తగిలాయి.,
2014 ప్రపంచకప్ ఫైనల్: జర్మనీ చేతిలో అదనపు సమయంలో ఎదురైన పరాజయం దేశాన్ని, మెస్సీని తీవ్ర నిరాశకు గురిచేసింది.
2015, 2016 కోపా అమెరికా: వరుసగా రెండు ఫైనల్స్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ముఖ్యంగా 2016 ఫైనల్‌లో చిలీ చేతిలో పెనాల్టీల్లో ఓడిపోయిన తర్వాత మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు తొలిసారి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, కొన్ని నెలలకే మళ్లీ జట్టులోకి పునరాగమనం చేశారు.

అర్జెంటీనా స్వర్ణయుగం: ట్రోఫీల పంట...
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా సరికొత్త చరిత్ర లిఖించింది:
కోపా అమెరికా 2021: మారకానా స్టేడియంలో బ్రెజిల్‌ను ఓడించి అర్జెంటీనా సీనియర్ జట్టుతో మెస్సీ తన తొలి అంతర్జాతీయ ట్రోఫీని ముద్దాడారు.
ఫిఫా వరల్డ్ కప్ 2022 (ఖతార్): కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించి ఏడు గోల్స్ సాధించడమే కాకుండా, ఫ్రాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో జట్టును గెలిపించి దశాబ్దాల ప్రపంచకప్ కలను నిజం చేశారు.
కోపా అమెరికా 2024 & వరల్డ్ కప్ 2026: 2024లో మరోసారి కోపా అమెరికా ట్రోఫీని గెలిపించిన మెస్సీ, 2026 ప్రపంచకప్‌లోనూ అర్జెంటీనాను ఫైనల్ వరకు నడిపించారు (ఫైనల్లో స్పెయిన్ చేతిలో జట్టు ఓటమి పాలైంది).
మెస్సీ నెలకొల్పిన రికార్డులు, సాధించిన ఘనతలు
అర్జెంటీనా తరఫున అత్యధిక మ్యాచ్‌లు (207 మ్యాచ్‌లు)
అర్జెంటీనా ఆల్‌టైమ్ టాప్ స్కోరర్ (125 అంతర్జాతీయ గోల్స్)
పురుషుల అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన రెండో ఆటగాడు (క్రిస్టియానో రొనాల్డో 146 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా, అలీ దాయీ 108, భారత్‌కు చెందిన సునీల్ ఛెత్రీ 95, రొమేలు లుకాకు 93 గోల్స్‌తో తరువాతి స్థానాల్లో ఉన్నారు)
2022 ఫిఫా వరల్డ్ కప్ ఛాంపియన్
2021, 2024 కోపా అమెరికా ఛాంపియన్
2022 ఫైనలిసిమా విజేత
2008 బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత

బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల మధ్య దాదాపు పాతికేళ్లుగా కొనసాగుతున్న సోన్ నదీ జలాల వివాదానికి శాశ్వత పరిష్కారం లభించింది. కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ చారిత్రాత్మక అవగాహన ఒప్పందంపై (MoU) సంతకాలు చేశారు.

ఒప్పందంలోని ముఖ్యాంశాలు...
అనేక సంవత్సరాలుగా ఉన్న జల వివాదాన్ని పరిష్కరించడంలో ఇదొక పెద్ద ముందడుగు.
ఈ ఒప్పందం ద్వారా బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని విస్తారమైన ప్రాంతాల్లో రైతులకు సాగునీటితో పాటు ప్రజలకు తాగునీరు సులభంగా అందుబాటులోకి రానుంది.
లబ్ధి పొందే ప్రాంతాలు: బీహార్‌లోని భోజ్‌పూర్, బక్సర్, రోహ్తాస్, కైమూర్, ఔరంగాబాద్, అర్వాల్, గయా, పాట్నా జిల్లాల్లో నీటి లభ్యత గణనీయంగా పెరుగుతుంది. జార్ఖండ్‌లోని పాలము, గర్వా ప్రాంతాలకు సాగు, తాగునీరు అందుతుంది.
ఈ చారిత్రక ఘట్టంపై ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాయి.

సహకార సమాఖ్య స్ఫూర్తి...
ఈ ఒప్పందం సహకార సమాఖ్య విధానానికి, ప్రధాని మోదీ అనుసరిస్తున్న 'టీమ్ భారత్' దృక్పథానికి నిదర్శనమని అమిత్ షా అభివర్ణించారు.
రాష్ట్రాలు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే, జాతీయ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయవచ్చని ఇది రుజువు చేసింది.
రైతులు, గ్రామీణ ప్రజల సాగు, తాగునీటి అవసరాలను పరస్పర చర్చల ద్వారా ఎలా సజావుగా పరిష్కరించుకోవచ్చో ఈ ఒప్పందం స్పష్టం చేస్తోంది.

2026లో కుదిరిన నాలుగు ప్రధాన అంతర్రాష్ట్ర ఒప్పందాలు...
అంతర్రాష్ట్ర మండలి కృషితో ఈ ఏడాది కుదిరిన నాలుగు ప్రధాన ఒప్పందాల్లో సోన్ నదీ ఒప్పందం ఒకటి కాగా.. మిగతా మూడు ఒప్పందాల వివరాలు ఇలా ఉన్నాయి.,
జులై 7, 2026: నర్మదా అవార్డు, సర్దార్ సరోవర్ ప్రాజెక్టు బకాయిల చెల్లింపుల పరిష్కారం కోసం మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది.
జూన్ 29, 2026: యమునా జలాల ప్రాజెక్టు కోసం రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. దీని ద్వారా 3 భూగర్భ పైప్‌లైన్ల గుండా సుమారు 580 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని రాజస్థాన్‌కు తరలిస్తారు.
జూన్ 16, 2026: కిషౌ బహుళార్థ సాధక డ్యామ్ ప్రాజెక్టుపై హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ ప్రాజెక్టులోని నీటి విభాగానికి అయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 90% భరించనుండగా, మిగిలిన భాగాన్ని ఈ ఆరు రాష్ట్రాలు పంచుకోనున్నాయి.

For ONLINE CLASSES :sakshi education app(click here)

సముద్ర గర్భంలో సహాయక చర్యలు, జలాంతర్గాముల రక్షణలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ 'ఐఎన్ఎస్ నిపుణ్' (INS Nipun) సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిస్తార్-క్లాస్ డైవింగ్ సపోర్ట్ వెస్సెల్ (DSV) సిరీస్‌లో రెండవదైన ఈ నౌకను 2026 ఆగస్టు 31న ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో జాతీయ నౌకాదళంలోకి అధికారికంగా ప్రవేశపెట్టారు. సముద్ర భద్రత, అత్యవసర ప్రతిస్పందన సామర్థ్యాలు అత్యంత కీలకమైన ప్రస్తుత తరుణంలో నౌకాదళంలో ఈ నౌక చేరిక వ్యూహాత్మకంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
నౌకాదళ ప్రధానాధికారి (CNS) అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, వెస్టర్న్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్ సమక్షంలో ఈ కమిషనింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఐఎన్ఎస్ నిపుణ్ ప్రత్యేకతలు...
సముద్ర గర్భంలో కష్టతరమైన మిషన్ల కోసం ఈ నౌకను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
సాచురేషన్, ఎయిర్, మరియు హీలియాక్స్ డైవింగ్ ఆపరేషన్స్ చేయగల సామర్థ్యం దీని సొంతం. నిపుణులైన సిబ్బంది సముద్రంలో వివిధ లోతుల్లో ఎక్కువ సమయం గడిపేందుకు ఇది అనుకూలంగా ఉంటుంది.
రిమోట్ కంట్రోల్డ్ అండర్ వాటర్ సిస్టమ్స్, డైనమిక్ పొజిషనింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
అత్యాధునిక డైవింగ్ కాంప్లెక్స్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, మెడికల్ సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

జలాంతర్గాముల రక్షణలో కీలక పాత్ర...
ఆపదలో లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న జలాంతర్గాములను రక్షించడంలో ఈ నౌక కీలక పాత్ర పోషిస్తుంది. ఐఎన్ఎస్ నిస్తార్‌తో పాటు ఇప్పుడు ఐఎన్ఎస్ నిపుణ్ చేరికతో డీప్ వాటర్ డైవింగ్, అండర్ వాటర్ రెస్క్యూలో భారత్ సామర్థ్యం రెట్టింపవుతుంది. ఇలాంటి ప్రత్యేక సామర్థ్యాలు ప్రపంచవ్యాప్తంగా కేవలం కొన్ని దేశాల నౌకాదళాలకు మాత్రమే ఉన్నాయి. మిత్ర దేశాల జలాంతర్గాములకు అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడం ద్వారా, ఈ ప్రాంతంలో భారత్‌ను "ప్రిఫర్డ్ సబ్‌మెరైన్ రెస్క్యూ పార్టనర్"గా ఇది నిలబెడుతుంది.

స్వదేశీ పరిజ్ఞానం - ఆత్మనిర్భరతకు ప్రతీక...
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఈ నౌకను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. రక్షణ రంగ నౌకా నిర్మాణంలో 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్య సాధనకు ఇది మరో ముందడుగు.

వ్యూహాత్మక ప్రాముఖ్యత...
వెస్టర్న్ నావల్ కమాండ్ ఆధ్వర్యంలో పశ్చిమ తీరంలో పనిచేసే ఐఎన్ఎస్ నిపుణ్.. నౌకాదళ మల్టీ-డొమైన్ ఆపరేషన్లలో తన సేవలను అందిస్తుంది. యుద్ధ సంబంధిత ఆపరేషన్లలోనే కాకుండా, ప్రకృతి విపత్తుల సమయంలో మానవతా సహాయం, విపత్తు నిర్వహణ మిషన్లలోనూ ఇది ఉపయోగపడుతుంది. ఈ నౌక 'ఫార్ బినీత్, ఫ్యూ బియాండ్' అనే నినాదంతో పనిచేస్తుంది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అత్యంత అధునాతన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 'ఈఓఎస్-05' ను సెప్టెంబర్ 4, 2026న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి వేకువజామున 2:55 గంటలకు ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం జరగనుంది.

ఈఓఎస్-05 ప్రత్యేకతలు, ఉపయోగాలు...
జియోసింక్రోనస్ కక్ష్య నుంచి పనిచేసే భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహంగా ఈఓఎస్-05 చరిత్ర సృష్టించనుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయంతో సమానంగా తిరిగే ఈ కక్ష్యలో ఉపగ్రహం ఉండటం వల్ల, భూమిపై ఉన్న నిర్దేశిత ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచడానికి వీలవుతుంది. సాధారణ ఇమేజింగ్ ఉపగ్రహాల మాదిరిగా తక్కువ ఎత్తులో కాకుండా, అత్యంత ఎత్తు నుంచి భూ ఉపరితలాన్ని మరింత విశాలంగా వీక్షించే సామర్థ్యం దీని సొంతం. ఈ ఉపగ్రహం ద్వారా ప్రధానంగా కింది ప్రయోజనాలు కలుగుతాయి.,
భూమి, సహజ వనరుల పర్యవేక్షణ
భూ ఉపరితలంలో వస్తున్న మార్పుల పరిశీలన
పర్యావరణ పరిశోధనలు
శాస్త్రీయ అనువర్తనాలు
ప్రణాళిక, వనరుల నిర్వహణ

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం...
ఇది ఇస్రోకు చెందిన జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) శ్రేణిలో 19వ ప్రయోగం. అత్యంత బరువైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఉపగ్రహాలను ఎత్తైన కక్ష్యల్లోకి చేర్చడంలో ఈ వాహకనౌక కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మిషన్‌లో భాగంగా ముందుగా రాకెట్ ఈ ఉపగ్రహాన్ని సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ లోకి ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత ఉపగ్రహం అవసరమైన విన్యాసాలు చేయడం ద్వారా తనంతట తానుగా లక్షిత జియోసింక్రోనస్ కక్ష్యలోకి చేరుకుంటుంది.

ప్రయోగ ముఖ్య వివరాలు...
ప్రయోగ వాహకనౌక - జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 (GSLV-F17)
ఉపగ్రహం పేరు - ఈఓఎస్-05 (EOS-05)
ప్రయోగ తేదీ - సెప్టెంబర్ 4, 2026
సమయం - వేకువజామున 2:55 గంటలకు (IST)
వేదిక - సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట (రెండవ లాంచ్ ప్యాడ్)
లక్షిత కక్ష్య - సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్
సంస్థ - ఇస్రో
ప్రధాన ఉద్దేశం - జియోసింక్రోనస్ కక్ష్య నుంచి పనిచేసే తొలి భారతీయ ఇమేజింగ్ శాటిలైట్ ప్రయోగం.

భారత స్థూల వస్తు, సేవల పన్ను వసూళ్లు ఆగస్టు 2026లో 14.8 శాతం వృద్ధితో దాదాపు ₹2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 1న విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జులై (₹2.11 లక్షల కోట్లు) తో పోలిస్తే వసూళ్లలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, వార్షిక ప్రాతిపదికన బలమైన వృద్ధి నమోదైంది. ముఖ్యంగా దిగుమతులపై జీఎస్టీ వసూళ్లు అత్యుత్తమంగా 29 శాతం వృద్ధిని కనబరచగా, దేశీయ జీఎస్టీ 9 శాతం పెరిగింది.

ఆగస్టు 2026 జీఎస్టీ ముఖ్య గణాంకాలు...
స్థూల జీఎస్టీ వసూళ్లు: దాదాపు ₹2 లక్షల కోట్లు (14.8% వార్షిక వృద్ధి)
దేశీయ జీఎస్టీ: ₹1.37 లక్షల కోట్లు (9% వృద్ధి)
దిగుమతులపై జీఎస్టీ: ₹62,604 కోట్లు (29% వృద్ధి)
నికర జీఎస్టీ వసూళ్లు: ₹1.68 లక్షల కోట్లు (8.3% వృద్ధి)
మొత్తం జీఎస్టీ రీఫండ్‌లు: ₹31,795 కోట్లు

దేశీయ వసూళ్లను మించిన దిగుమతుల వృద్ధి...
ఆగస్టు నెలలో దిగుమతులపై జీఎస్టీ వసూళ్లు అసాధారణ వృద్ధిని నమోదు చేశాయి. దేశీయ వసూళ్ల వృద్ధి 9 శాతంగా (₹1.37 లక్షల కోట్లు) ఉండగా, దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం 29 శాతం పెరిగి ₹62,604 కోట్లకు చేరుకుంది. కొన్ని రంగాల్లో విదేశీ ముడిసరుకు లేదా వస్తువులపై భారతదేశ ఆధారపడటాన్ని ఈ అసాధారణ వృద్ధి సూచిస్తుందని ఈవై ఇండియా ట్యాక్స్ పార్టనర్ సౌరభ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.

8.3 శాతానికి పెరిగిన నికర జీఎస్టీ వసూళ్లు...
రీఫండ్‌లను మినహాయించిన తర్వాత, నికర జీఎస్టీ వసూళ్లు ఆగస్టులో 8.3 శాతం వార్షిక వృద్ధితో ₹1.68 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అయితే, రీఫండ్‌లలో భారీ వృద్ధి కారణంగా గత నెలతో పోలిస్తే నికర వసూళ్లు 7 శాతం మేర తగ్గాయి. మొత్తం రీఫండ్‌లు వార్షికంగా 68 శాతం పెరిగి ₹31,795 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో దేశీయ జీఎస్టీ రీఫండ్‌లు 73 శాతం పెరిగి ₹18,490 కోట్లకు, దిగుమతులపై రీఫండ్‌లు 62 శాతం పెరిగి ₹13,305 కోట్లకు చేరాయి.

ఆర్థిక సంవత్సరం 2026-27 ట్రెండ్స్...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల (ఏప్రిల్-ఆగస్టు 2026) గణాంకాలు కూడా సానుకూల ధోరణిని చూపుతున్నాయి.
స్థూల జీఎస్టీ వసూళ్లు (ఏప్రిల్-ఆగస్టు): 11% వార్షిక వృద్ధితో ₹10.43 లక్షల కోట్లు.
నికర జీఎస్టీ వసూళ్లు (ఏప్రిల్-ఆగస్టు): 9% వృద్ధితో ₹8.89 లక్షల కోట్లు.

టెక్ దిగ్గజం యాపిల్ నూతన సీఈఓగా సెప్టెంబర్ 1, 2026న జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టారు. దీంతో సంస్థలో 15 ఏళ్ల సుదీర్ఘ టిమ్ కుక్ నాయకత్వ శకానికి తెరపడటమే కాకుండా, కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థలపై దృష్టి సారించిన నాయకత్వం నుంచి హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న నాయకత్వంలోకి సంస్థ అడుగుపెట్టింది.

యాపిల్ నూతన సీఈఓ జాన్ టెర్నస్ నేపథ్యం...
51 ఏళ్ల జాన్ టెర్నస్ వర్చువల్ రీసెర్చ్ సిస్టమ్స్‌లో ఇంజనీర్‌గా పనిచేసిన అనంతరం 2001లో యాపిల్‌లో చేరారు.
ఆయన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు.
రెండు దశాబ్దాలకు పైగా సంస్థలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన, ఐఫోన్ సహా పలు యాపిల్ ఉత్పత్తుల హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు.
పర్యావరణానికి హాని కలగకుండా తక్కువ కార్బన్ ఉద్గారాలతో, మరింత మన్నికైన ఉత్పత్తులను తయారు చేయడంలో టెర్నస్ కీలక పాత్ర పోషించారు.

టెర్నస్ ముందున్న సవాళ్లు, లక్ష్యాలు...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ : యాపిల్‌లో ఏఐ సాంకేతికతను మరింత బలోపేతం చేయడం టెర్నస్ ముందున్న ప్రధాన సవాలు. టిమ్ కుక్ హయాంలో అభివృద్ధి చేసిన వ్యవస్థలకు ఎలాంటి ఆటంకం కలగకుండానే, వినూత్న హార్డ్‌వేర్ ద్వారా కస్టమర్లకు కొత్త ఏఐ అనుభవాలను అందించాల్సి ఉంది.
చైనా సవాలు: టిమ్ కుక్ హయాంలో యాపిల్ తయారీ, సప్లయ్ చైన్ విభాగాల్లో చైనాపై తీవ్రంగా ఆధారపడింది. ప్రస్తుతం తయారీ కార్యకలాపాలను భారత్, వియత్నాం వంటి దేశాలకు విస్తరిస్తున్నప్పటికీ, అటు తయారీ కేంద్రంగా, ఇటు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాతో వ్యవహరించడం కొత్త సీఈఓకు పెద్ద సవాలు.
రాబోయే ఐఫోన్ ఈవెంట్: సెప్టెంబర్ 9న జరగనున్న వార్షిక ఐఫోన్ ఈవెంట్‌లో సంస్థ చరిత్రలోనే తొలి 'ఫోల్డబుల్ ఐఫోన్'ను ఆవిష్కరించనుంది. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ఈవెంట్‌ను విజయవంతం చేయడం టెర్నస్‌కు తొలి పరీక్ష.

కొత్త పాత్రలో టిమ్ కుక్...
సీఈఓ పదవి నుంచి వైదొలిగినప్పటికీ టిమ్ కుక్ యాపిల్‌ను వీడటం లేదు. సెప్టెంబర్ 1 నుంచి ఆయన యాపిల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొత్త బాధ్యతలు చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విధానకర్తలతో సంస్థ సంబంధాలను ఆయన పర్యవేక్షించనున్నారు. దీనివల్ల జాన్ టెర్నస్ పూర్తిస్థాయిలో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ఇంజనీరింగ్, టెక్నాలజీ ఆవిష్కరణలపై దృష్టి సారించే అవకాశం లభిస్తుంది.

భారతీయ పర్యాటకులకు శుభవార్త.. ఇకపై ఉజ్బెకిస్థాన్‌లోనూ మీ స్మార్ట్‌ఫోన్‌లోని యూపీఐ యాప్‌ల ద్వారా సులభంగా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, ఉజ్బెకిస్థాన్ జాతీయ చెల్లింపుల వ్యవస్థ 'హుమో' ఆపరేటర్ అయిన ఎన్ఐపీసీ మధ్య ఆగస్టు 30, 2026న కుదిరిన వాణిజ్య ఒప్పందం ద్వారా ఇది సాధ్యమైంది.

ఉజ్బెకిస్థాన్‌లో యూపీఐ ఎలా పనిచేస్తుంది..?
భారతీయ యూజర్లు తాము రెగ్యులర్‌గా వాడే యూపీఐ యాప్‌ల ద్వారానే ఉజ్బెకిస్థాన్ జాతీయ క్యూఆర్ కోడ్ (UZQR) ను స్కాన్ చేసి పేమెంట్లు చేయవచ్చు.
ఈ లావాదేవీలు నేరుగా వారి భారతీయ బ్యాంక్ ఖాతాల నుంచి పర్సన్-టు-మర్చంట్ (P2M) విధానంలో పూర్తవుతాయి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఉజ్బెకిస్థాన్ ఆధ్వర్యంలోని ఈ క్యూఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా రిటైల్ దుకాణాలు, హోటళ్లు, ఇతర సేవా కేంద్రాల్లో చెల్లింపులు చేయవచ్చు.

భారతీయులకు చేకూరే ప్రయోజనాలు...
పర్యాటకం, ఉన్నత విద్య, వ్యాపార నిమిత్తం ఉజ్బెకిస్థాన్ వెళ్లే భారతీయులకు నగదు వెంట తీసుకెళ్లాల్సిన ఇబ్బంది తప్పుతుంది.
అంతర్జాతీయ కార్డులపై ఆధారపడాల్సిన అవసరం లేకపోవడం వల్ల ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కప్ ఛార్జీల భారం తగ్గుతుంది.
స్థానిక వ్యాపారులు సైతం ఎలాంటి అదనపు ఏర్పాట్లు చేసుకోకుండానే, నేరుగా భారతీయుల నుంచి డిజిటల్ చెల్లింపులు స్వీకరించవచ్చు.

ఈ ఒప్పందం ప్రాముఖ్యత...
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటన సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక ఒప్పందం కుదిరింది.
ఇరు దేశాల కేంద్ర బ్యాంకులు ఈ క్రాస్-బోర్డర్ డిజిటల్ చెల్లింపులకు అధికారిక అనుమతినిచ్చాయి.
భారతదేశ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అంతర్జాతీయ స్థాయికి విస్తరించడంలో, ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంలో ఇదొక కీలక ముందడుగు.

అంతర్జాతీయ స్థాయిలో యూపీఐ విస్తరణ...
ఉజ్బెకిస్థాన్‌తో కలిపి యూపీఐ సేవలు అందుబాటులో ఉన్న దేశాల జాబితా మరింత పెరిగింది. ఇప్పటికే సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, భూటాన్, ఖతార్, శ్రీలంక, కంబోడియా, గ్రీస్ దేశాల్లో యూపీఐ చెల్లింపులు విజయవంతంగా కొనసాగుతున్నాయి.

For TGPSC,APPSC ONLINE CLASSES :sakshi education app(click here)

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education