ఇక, ఫలితాల ఆధారంగా, మొదటి విడతలో ఎంపికైన విద్యార్థులు జూన్ 7లోగా కళాశాలలో చేరాలని సూచించారు ఆయన. నిర్ణీత గడువులోపు అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, లేకపోతే తదుపరి విడతలో ఇతర అర్హులైన విద్యార్థులకు అవకాశం కల్పించబడుతుందని తెలిపారు.
అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 229 గురుకుల కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ వంటి కోర్సుల్లో ఉండగా, వాటిలో మొత్తంగా 19,740 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఆయన చెప్పకొచ్చారు.
ఈ ఏడాది గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం మొత్తం 45,357 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 39,052 మంది విద్యార్థులు మే 15న నిర్వహించిన జేసీసెట్ పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి గురుకుల విద్యాసంస్థలకు ఉన్న ఆదరణ మరోసారి ఈ గణాంకాల ద్వారా స్పష్టమైందని అధికారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అపారమైన విశ్వాసం ఉందన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా విద్యా ప్రమాణాలు, వసతులు, భద్రతా చర్యలను మరింత మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
గతంలో కొన్ని గురుకులాల్లో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని మంత్రి తెలిపారు. అలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. గతంలో జరిగిన ఘటనలకు బాధ్యులైన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
గురుకుల విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు

