Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంటర్ BiPC తర్వాత బెస్ట్ కెరీర్ ఆప్షన్.. పారామెడికల్, బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సులతో భారీ ఉద్యోగ అవకాశాలు!

ఇంటర్ BiPC తర్వాత బెస్ట్ కెరీర్ ఆప్షన్.. పారామెడికల్, బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సులతో భారీ ఉద్యోగ అవకాశాలు!

SAKSHI EDUCATION 3 months ago

దేశంలో నాణ్యమైన ఆరోగ్య సేవల అవసరం ఏర్పడటంతో ఈ కోర్సులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఉద్యోగ అవకాశాలు విస్తృతం అవుతున్నాయి. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో.. పారామెడికల్‌ కోర్సుల ప్రత్యేకతలు, ప్రవేశ విధానం, కెరీర్‌ అవకాశాలు తదితర వివరాలు..

ప్రస్తుతం పారా మెడికల్‌ విభాగానికి సంబంధించి.. బ్యాచిలర్‌ స్థాయిలో ఉన్న కోర్సులు.. అనస్థీషియా టెక్నాలజీ, డయాలసిస్‌ థెరపీ టెక్నాలజీ, కార్డియో వాస్కులర్‌ టెక్నాలజీ, ఎమర్జెన్సీ అండ్‌ ట్రామా కేర్‌ టెక్నాలజీ. రేడియోగ్రఫీ అండ్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, మెడికల్‌ లేబొరేటరీ టెక్నాలజీ, న్యూరో టెక్నాలజీ, పెర్‌ఫ్యూషన్‌ టెక్నాలజీ, రేడియేషన్‌ థెరపీ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, ట్రాన్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌.

రోగులకు శస్త్ర చికిత్స నిర్వహించే సమయంలో రోగికి ఆ బాధ తెలియకుండా ఉండేందుకు వైద్యులు అనుసరిస్తున్న విధానం అనస్తీషియా. అనస్థీషియా టెక్నీషియన్స్‌.. మత్తు మందు ఏ స్థాయిలో ఇవ్వాలి, శరీరంలో ఏ భాగంలో ఇవ్వాలి వంటి అంశాలపై అవగాహన కల్పించే కోర్సు అనస్థీషియా టెక్నాలజీ.

కిడ్నీ సమస్యలకు సంబంధించి.. ఔట్‌ పేషంట్‌ డయాలసిస్‌ విభాగాల్లో డయాలసిస్‌ టెక్నీషియన్‌­లు కీలక పాత్ర పోషిస్తారు. డయాలసిస్‌ చేసే సమయంలో ఉపయోగించే పరికరాల నాణ్యత, నిర్వహణ వంటి నైపుణ్యాలను ఈ కోర్సు ద్వారా పొందొచ్చు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఉపాధి అవకాశాలు విస్తృతం అవుతున్నాయి.

745 Bank Jobs: ప్రభుత్వ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా!

గుండె పనితీరుకు సంబంధించి నైపుణ్యాలను అందించే కోర్సు.. కార్డియో వాస్కులరీ టెక్నాలజీ. ఈ కోర్సులో చేరిన విద్యార్థులు గుండె ఆపరేషన్ల పరంగా అవసరమైన బెలూన్‌ యాంజియోప్లాస్టీ, అనస్థీషియా, ప్రెప్పింగ్‌ వంటి విధానాల్లోనూ నైపుణ్యం పొందుతారు.

వైద్య పరిభాషలో 'గోల్డెన్‌ అవర్‌' అనే పదం అందరికీ తెలిసిందే. అంటే.. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు లేదా అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు పూర్తి స్థాయిలో చికిత్స ప్రారంభానికి ముందు.. ఘటనా స్థలంలోనే సదరు క్షతగాత్రులకు ఊపిరిలూదేలా సీపీఆర్, ఇతర చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నైపుణ్యాలను అందించే కోర్సుగా ఎమర్జెన్సీ అండ్‌ ట్రామాకేర్‌ టెక్నాలజీ గుర్తింపు పొందుతోంది.

ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే, సీటీ స్కాన్, అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌.. ప్రస్తుతం ఈ పదాలు తెలియని వారుండరంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. కారణం.. ఆయా వ్యాధులకు సంబంధించి మూల సమస్యను గుర్తించడానికి వైద్యులకు ఇవే ఆధారంగా నిలుస్తున్నా­యి. వీటిని రేడియాలజిస్ట్‌లు నిర్వహిస్తారు. వీరికి అవసరమైన నైపుణ్యాలను అందించే కోర్సు.. రేడియోగ్రఫీ అండ్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ.

వ్యాధిని నిర్ధారించే క్రమంలో.. మెడికల్‌ లేబొరేటరీల్లో పరీక్షలు నిర్వహించి.. వైద్యులకు నివేదికలు అందించే వారే.. మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్లు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధి నివారణ కోసం వైద్యు­లు మందులు సూచించేందుకు ఎంఎల్‌టీలు ఇచ్చే నివేదికలే ఆధారం. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి హాస్పిటల్స్‌కు అనుబంధంగా ఉన్న మెడికల్‌ లేబొరేటరీల్లో, ప్రైవేటు మెడికల్‌ లేబొరేటరీల్లో అవకాశాలు లభిస్తాయి. ప్రారంభంలో నెలకు రూ.20 వేల వరకు వేతనం అందుతుంది.

రోగులకు చికిత్సలో కీలకమైన ఈఈజీ, ఈఎంజీ, ఎసీఎస్, పీఎస్‌జీ, ఈపీ వంటి పరీక్షల నిర్వహణకు సంబంధించిన నైపుణ్యాలను అందించే కోర్సు.. న్యూరో టెక్నాలజీ. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారికి న్యూరో ఫిజియాలజీ టెక్నాలజిస్ట్, న్యూరో డయాగ్నస్టిక్‌ టెక్నాలజిస్ట్, ఈఈజీ టెక్నాలజిస్ట్‌ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.

గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసేందుకు పర్‌ఫ్యూషన్‌ టెక్నాలజీ ద్వారా నైపుణ్యాలు పొందొచ్చు. ముఖ్యంగా హార్ట్‌ సర్జరీల సమయంలో ఆపరేషన్‌ థియేటర్లో డాక్టర్లకు సహకరించడం.. హార్ట్‌ యాక్టివేషన్‌కు సంబంధించి కృత్రిమ పరికరాలు ఎంపిక, అమరికలో.. పర్‌ఫ్యూషన్‌ టెక్నీషియన్‌లు కీలకంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం పర్‌ఫ్యూషన్‌ టెక్నీషియన్స్‌కు కెరీర్‌ పరంగా డిమాండ్‌ నెలకొంది. హాస్పిటల్‌ స్థాయిని బట్టి ప్రారంభంలోనే రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం లభిస్తోంది.

6715 Bank Jobs: డిగ్రీ అర్హతతో ఐబీపీఎస్‌లో పీవో/మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా!

ఇటీవల కాలంలో కేన్సర్‌ బాధితుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. కేన్సర్‌ వ్యాధి నివారణకు వైద్యులు రేడియేషన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. రేడియేషన్‌ ఆవశ్యకత, ఈ రేడియేషన్‌ను ఏ స్థాయిలో ఇవ్వాలి? వంటి విధులు నిర్వహించే వారే రేడియోథెరపీ టెక్నీషియన్లు. వీరిచ్చే రిపోర్ట్‌ ఆధారంగానే వైద్యులు చికిత్సకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు.

ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిర్థారణకు సంబంధించిన నైపుణ్యాలను అందించే కోర్సు.. రెస్పిరేటరీ థెరపీ. ఈ కోర్సు పూర్తి చేసిన వారు.. సంబంధిత వైద్యులకు 'బ్రోంకేస్కోపి' టెస్ట్‌ చేయడంలో సహాయకులుగా ఉంటారు.

బ్లడ్‌ బ్యాంకులు, ఇతర ల్యాబ్‌ టెస్ట్‌ల కోణంలో సదరు పరికరాల సేకరణను పూర్తి భద్రతతో చేపట్టడం, పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రక్త నిల్వలు భద్రపరచడం వంటి నైపుణ్యాలను ఈ కోర్సు ద్వారా నేర్పిస్తారు.

పారామెడికల్‌ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి అవకాశాలు విస్తృతం అవుతున్నాయి. ప్రజల జీవన శైలి, ఆహార అలవాట్లు మారడం వంటి కారణాల­తో పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నా­యి. దీంతో వైద్యులను సంప్రదించే వారు పెరుగుతున్నారు. ఆయా విభాగాలకు సంబంధించి వైద్యులకు సహకరించేందుకు పారామెడికల్‌ కోర్సుల్లో సుశిక్షితులైన వారి అవసరం పెరుగుతోంది. వీరికి ప్రధానంగా హాస్పిటల్స్, లేబొరేటరీస్, డయాగ్నస్టిక్‌ సెంటర్స్‌ ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. స్పెషలైజ్డ్‌ రేడియోగ్రఫీ టెక్నాలజీ, రేడియేషన్‌ టెక్నాలజీ వంటి కోర్సులు పూర్తి చేసుకుంటే.. ప్రారంభంలోనే నెలకు రూ.40 వేల వేతనం సొంతం చేసుకోవచ్చు. ఈ కోర్సులను ఆయా రాష్ట్రాల హెల్త్‌ యూనివర్సిటీలే పర్యవేక్షిస్తాయి. ప్రత్యేక నోటిఫికేషన్‌ ద్వారా కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తాయి.

వైద్య రంగంలో స్థిరపడాలనుకునే వారికి మరో చక్కటి ప్రత్యామ్నాయం.. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ. నాలుగున్నరేళ్ల వ్యవధిలో ఉండే ఈ కోర్సు పూర్తి చేస్తే ఫిజియోథెరపిస్ట్‌లుగా కొలువు ఖాయం. అదే విధంగా స్వయం ఉపాధి అవకాశాలు పొందొచ్చు. ఆర్థోపెడిక్‌ సర్జరీలు చేయించుకున్న వారందరూ ఫిజియో థెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్న తరుణంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ కోర్సు చేసిన వారికి ఉపాధి పరంగా ఢోకా లేదు.

  • నర్సింగ్‌ కెరీర్‌కు అవకాశం కల్పించే కోర్సు బీఎస్‌సీ నర్సింగ్‌. బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతోపాటు ఇంగ్లిష్‌ను ఒక సబ్జెక్ట్‌గా చదివిన వారు బీఎస్‌సీ నర్సింగ్‌కు అర్హులు.
  • రాష్ట్రాల స్థాయిలో స్టేట్‌ హెల్త్‌ యూనివర్సిటీలు ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. ఇంటర్మీడియెట్‌లో పొందిన మార్కులు, ఈఏపీసెట్‌ (బైపీసీ స్ట్రీమ్‌) ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు. బీఎస్‌సీ నర్సింగ్‌ పూర్తి చేసుకున్న వారికి నేరుగా నర్సులుగా కెరీర్‌ ప్రారంభించే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రుల్లో అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయి. ప్రారంభంలోనే నెలకు రూ.25 వేల నుంచి రూ.40 వేలు వేతనం పొందే అవకాశం ఉంది.
  • ఉన్నత విద్యలో.. ఎమ్మెస్సీ నర్సింగ్‌ కోర్సు అందుబాటులో ఉంది. రెండేళ్ల వ్యవధిలోని ఈ కోర్సులో మెడికల్‌ సర్జన్‌ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్, పిడియాట్రిక్స్, సైకియాట్రిక్‌ నర్సింగ్, ఆబ్సె›్టట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ నర్సింగ్, మెంటల్‌ హెల్త్‌ నర్సింగ్‌ తదితర స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీరికి ఆస్పత్రుల్లో, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో సూపర్‌వైజర్‌ స్థాయి ఉద్యోగాలు లభిస్తాయి.
  • పారా మెడికల్‌ కోర్సులు, బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియో థెరపీ కోర్సులకు.. నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)- హైదరాబాద్‌ ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది.
  • టీఎస్‌ ఎప్‌సెట్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • 2026, జూలై 11
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులను ప్రింట్‌ తీసుకుని.. వాటికి నిర్దేశిత సర్టిఫికెట్లు జతపరిచి జూలై 14లోపు నిమ్స్‌ హైదరాబాద్‌లో అందించాలి.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.nims.edu.in



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education