Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TG EAPCET Counselling: ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు అడ్డంకులు.. అసలు కారణం ఇదే!

TG EAPCET Counselling: ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు అడ్డంకులు.. అసలు కారణం ఇదే!

SAKSHI EDUCATION 4 days ago

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కొనసాగుతున్న వివాదమే ఇందుకు ప్రధాన కారణంగా మారిందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష అయిన ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలైన వెంటనే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ప్రకటిస్తారు.

అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది.

కరోనా కాలాన్ని మినహాయిస్తే గత పదేళ్లుగా జూన్‌, జూలై నెలల్లోనే కౌన్సెలింగ్‌ పూర్తి చేసి సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగించేవారు. విద్యార్థులకు ముందస్తు అవగాహన కల్పించేందుకు దాదాపు నెల రోజుల ముందుగానే షెడ్యూల్‌ను విడుదల చేయడం ఆనవాయితీగా కొనసాగింది. కానీ ఈసారి ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలైనప్పటికీ కౌన్సెలింగ్‌పై స్పష్టత రాకపోవడం విద్యార్థుల్లో ఆందోళన పెంచుతోంది.

ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌ పరీక్ష పూర్తయ్యగానే విద్యార్థులకు మార్కులు స్క్రీన్‌పైనే చూపించే విధానాన్ని అమలు చేశారు. దీంతో విద్యార్థులు తమ ర్యాంకులు, ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశాలపై ముందుగానే అంచనాలు వేసుకున్నారు. అయినప్పటికీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాకపోవడం వారికి అనిశ్చితిని కలిగిస్తోంది.

NALCO Jobs: 268 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ అభ్యర్థులకు అవకాశం!

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశం గత ఏడాది నుంచి కోర్టులో వివాదాస్పదంగా మారింది. పెండింగ్‌ బకాయిలతో పాటు ప్రతి సంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సకాలంలో చెల్లించాలని ప్రైవేట్‌ కాలేజీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ విషయంలో న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాయి. ప్రభుత్వం కోర్టుకు చెల్లింపులు తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఎప్పటిలోగా చెల్లిస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.

ఇక ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించడం మరో వివాదానికి దారితీసింది. దీనిపై ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులు ఫీజులను కాలేజీలకు సకాలంలో చెల్లించకపోతే సంస్థల నిర్వహణ కష్టమవుతుందని వాదిస్తున్నాయి. ఒకవేళ ఆ డబ్బును ఇతర అవసరాలకు వినియోగిస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.

ఇదే సమయంలో విద్యార్థి సంఘాలు కూడా తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదలలో ఆలస్యం జరిగితే కాలేజీలు విద్యార్థులపై ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తాయని పేర్కొంటున్నాయి.

ఈ వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం, ప్రైవేట్‌ కాలేజీలు, విద్యార్థి సంఘాలతో చర్చలు పూర్తయ్యాకే ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. షెడ్యూల్‌ విడుదల మరింత ఆలస్యమైతే కౌన్సెలింగ్‌ ప్రక్రియ కూడా వాయిదా పడే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education