- దూరవిద్య (Distance Education) ద్వారా పొందిన డిగ్రీల చెల్లుబాటు, ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు చెందిన స్టడీ సెంటర్ల గుర్తింపుపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.
- ఈ వివాదంపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను జూలై 29కి వాయిదా వేసింది.
- రాష్ట్రానికి చెందిన ఎ. విజయచంద్రారెడ్డి మరికొందరు అభ్యర్థులు టీజీపీఎస్సీ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ..
- 2014 రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల స్టడీ సెంటర్ల ద్వారా అనేకమంది విద్యార్థులు దూరవిద్యలో డిగ్రీలు పొందారని తెలిపారు.
- 2017లో టీజీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఈ సర్టిఫికెట్లను ఆమోదించారని, కానీ 2022 నోటిఫికేషన్‌లో వాటిని తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు.
- యూజీసీ (UGC) నిబంధనల ప్రకారం ఇవి తెలంగాణ వెలుపల ఉన్న వర్సిటీల పరిధిలోకి వస్తాయనే కారణంతో అభ్యర్థులకు అవకాశం నిరాకరించడం సరికాదని, రాష్ట్ర విభజన నాటి ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
- పిటిషనర్ల వాదనలపై స్పందించిన సుప్రీం ధర్మాసనం కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది.
- భౌగోళిక పరిధి: ఒక రాష్ట్ర చట్టం కింద ఏర్పాటైన విశ్వవిద్యాలయం కేవలం ఆ రాష్ట్ర భౌగోళిక పరిధి లోపల మాత్రమే పనిచేయాలని, సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లు నిర్వహించకూడదని యూజీసీ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని గుర్తుచేసింది.
- గుర్తింపు లేని డిగ్రీలు: దూరవిద్య డిగ్రీలకు యూజీసీ వంటి చట్టబద్ధ సంస్థల గుర్తింపు లేకుంటే వాటిని విద్యాపరమైన అర్హతలుగా పరిగణించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
- విభజన తర్వాత ప్రవేశాలు: రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తోందని, అలాంటప్పుడు 2017-2020 మధ్య కాలంలో తెలంగాణలో ఉంటూ ఇతర రాష్ట్రాల వర్సిటీ స్టడీ సెంటర్లలో విద్యార్థులు ఎలా చేరారని, వాటికి గుర్తింపు ఎలా ఉంటుందని కోర్టు ప్రశ్నించింది.
- ప్రస్తుతానికి నియామక ప్రక్రియను నిలిపివేయడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు, జరిగే నియామకాలన్నీ కోర్టు తీర్పునకు లోబడే ఉంటాయని స్పష్టం చేసింది. దీనివల్ల తుది తీర్పులో డిగ్రీలు చెల్లవని కోర్టు తేల్చిచెబితే, అప్పటికే నియామకమైన అభ్యర్థులపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

