అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS), కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) సంస్థలు తాజాగా ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం.. H-1B, L-1 వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల స్టే పొడిగింపు దరఖాస్తులపైనా అదనపు ఫీజు విధించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ రుసుము కొత్త H-1B, L-1 వీసా దరఖాస్తులు లేదంటే ఉద్యోగ మార్పు సమయంలో మాత్రమే వర్తిస్తోంది.
అయితే కొత్త ప్రతిపాదన ఆమోదం పొందితే.. అదే కంపెనీలో కొనసాగుతున్న ఉద్యోగుల వీసా పునరుద్ధరణ సమయంలో కూడా సంస్థలు ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు ప్రధానంగా అమెరికాలో 50 మందికి పైగా ఉద్యోగులు కలిగి ఉండి.. వారిలో కనీసం సగం మంది H-1B లేదా L-1 వీసాలపై పనిచేస్తున్న సంస్థలకు వర్తించే అవకాశం ఉంది.
H-1B వీసా వ్యవస్థలో భారతీయ నిపుణుల వాటా అత్యధికంగా ఉంది. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్‌వేర్, ఇంజినీరింగ్ రంగాల్లో వేలాది మంది భారతీయులు ఈ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నారు. అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆమోదమైన H-1B పిటిషన్లలో కొనసాగుతున్న ఉద్యోగాలకు సంబంధించినవి 2.91 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిలో భారతీయుల వాటా సుమారు 77 శాతానికి పైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ కొత్త ఫీజు విధానం అమల్లోకి వస్తే.. భారతీయ ఉద్యోగులను కొనసాగించే ఐటీ కంపెనీల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
అమెరికాలో భారీ సంఖ్యలో H-1B ఉద్యోగులను కలిగి ఉన్న టెక్నాలజీ సంస్థలు ఈ మార్పుతో ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అమెజాన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, గూగుల్ వంటి సంస్థలు H-1B ఉద్యోగుల విషయంలో ముందంజలో ఉన్నాయి. వీసా పొడిగింపుల సమయంలో అదనపు రుసుము చెల్లించాల్సి వస్తే.. విదేశీ నిపుణులను కొనసాగించడం కంపెనీలకు మరింత ఖరీదైన వ్యవహారంగా మారవచ్చు.
ప్రస్తుతం అర్హత కలిగిన కొన్ని సంస్థలు కొత్త H-1B దరఖాస్తుల సమయంలో సుమారు 4,000 డాలర్లు, L-1 వీసాల కోసం సుమారు 4,500 డాలర్లు వరకు అదనపు రుసుము చెల్లిస్తున్నాయి. ప్రతిపాదిత మార్పు అమల్లోకి వస్తే.. ఇదే భారం వీసా పొడిగింపు దరఖాస్తులకూ వర్తించే అవకాశం ఉంది.
అమెరికా అధికారులు చెబుతున్న ప్రకారం.. ఈ అదనపు రుసుమును 9/11 భద్రతా చర్యల్లో భాగమైన బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ వ్యవస్థ నిర్వహణకు ఉపయోగించనున్నారు. ముఖ గుర్తింపు వంటి సాంకేతికతలతో ప్రయాణికుల ప్రవేశ, నిష్క్రమణలను పర్యవేక్షించే వ్యవస్థకు నిధులు సమకూర్చడమే లక్ష్యమని తెలిపారు. ఈ ప్రతిపాదన ద్వారా ఏడాదికి సుమారు 157 మిలియన్ డాలర్ల అదనపు ఆదాయం వస్తుందని అమెరికా అంచనా వేస్తోంది.
అయితే ఈ ప్రతిపాదన ఇంకా తుది నిబంధనగా మారలేదు. అమెరికా పరిపాలన తుది నిబంధనలను విడుదల చేసిన తర్వాతే అమలు తేదీ, పూర్తి వివరాలు స్పష్టమవుతాయి. ఇప్పటికే H-1B వీసా విధానంపై కఠిన వైఖరి అవలంబిస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. తాజా ప్రతిపాదనతో విదేశీ నిపుణులను నియమించుకునే కంపెనీలపై మరింత నియంత్రణ తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది.
☛
☛

