Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Women entrepreneur Story : ఒత్తిడికి రాజీనామా.. మానసిక ప్రశాంతత వృత్తిలోకి.. సోషల్ మీడియో "మహిళా ఎంట్రప్రెన్యూర్" పోస్ట్ వైరల్‌..

Women entrepreneur Story : ఒత్తిడికి రాజీనామా.. మానసిక ప్రశాంతత వృత్తిలోకి.. సోషల్ మీడియో "మహిళా ఎంట్రప్రెన్యూర్" పోస్ట్ వైరల్‌..

SAKSHI EDUCATION 1 week ago

టీ ఉద్యోగాలు, ఆ ఉద్యోగుల జీతం జీవితం చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వారికి వచ్చే వేతనం ఎంతో ఒత్తిడీ అంతే ఉంటుంది.. లేదా అంతకంటే ఎక్కువే ఉంటుంది.

ఇవ్వన్నీ సాధారణంగా ప్రతీ ఉద్యోగి చెప్తూ ఉంటారు. అయితే, వేరే దారి దొరక్క చాలా మంది ఇదే దారిలో కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఒకప్పుడు ఐటీ రంగంలో పనిచేసిన మహిళ తాను పడిన ఒత్తిడిని ఓర్వలేక తీసుకున్న విలక్షణ నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది. కార్యాలయ ఉద్యోగంలోని తీవ్రమైన ఒత్తిడి, సుదీర్ఘ పనిగంటలు, వ్యక్తిగత జీవితానికి సమయం లేకపోవడం వంటి సమస్యలతో విసిగిపోయిన ఆమె చివరకు ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసింది.

సుమారు 9 ఏళ్లు చేసిన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసిన ఆమె.. ఆ తర్వాత ఆటో రిక్షా నడపడం ప్రారంభించింది. తనకు నచ్చిన సమయాల్లో పని చేసుకునే స్వేచ్ఛ లభించడంతో పాటు, పని-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను సాధించగలిగింది. ప్రస్తుతం తాను నెలకు సుమారు రూ.60 వేల వరకు ఆదాయం పొందుతున్నానని, గతంతో పోలిస్తే ఇప్పుడు తాను మరింత సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నానని ఆమె చెబుతోంది.

ఈ మహిళ కథను మరో మహిళా ఎంట్రప్రెన్యూర్‌ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్‌ చేయగా విస్తృత చర్చకు దారితీసింది. సాంప్రదాయ కెరీర్‌ను వదిలి తనకు మానసిక ప్రశాంతతను ఇచ్చే వృత్తిని, అది కూడా పురుషాధిక్యత ఉండే పనిని ఎంచుకోవడంపై అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉద్యోగం అంటే కేవలం అధిక జీతమే కాదని, జీవన నాణ్యత కూడా ముఖ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ కథకు స్పందించిన ఓ ఐటీ ఉద్యోగి, '18 ఏళ్లుగా ఐటీ రంగంలో ఉన్నా ఇప్పటికీ అంతులేని మీటింగ్‌లు, గంటల తరబడి కొనసాగే కాల్స్, అర్ధరాత్రి వచ్చే ప్రొడక్షన్ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాం' అంటూ వ్యాఖ్యానించారు. ఈ రంగంలో కొనసాగాలంటే ఎంతో సహనం, మానసిక స్థైర్యం అవసరమని పేర్కొన్నారు.

ఆమె గతంలో సంపాదించిన ఆదాయంతో మంచి సేవింగ్స్‌ చేసి ఉండవచ్చని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు. ఇంకొందరు మాత్రం సరళమైన, ప్రశాంతమైన జీవితం కోసం ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. చివరికి ప్రతి మనిషి కోరుకునేది మనశ్శాంతేనని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన ఉదాహరణను కూడా నెటిజన్లు పంచుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా ఇలాగే ఉద్యోగాన్ని వదిలి ఆటో రిక్షా నడపడం ప్రారంభించాడని, క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించి ఐదు ట్రక్కుల యజమానిగా ఎదిగాడని తెలిపారు. రూ.5 కోట్లకు పైగా సంపాదించినప్పటికీ ఇప్పటికీ ఆటో నడుపుతుండటం అతని వినయానికి నిదర్శనమని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education