Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫ్యాక్షన్ నుంచి ఫైటర్ జెట్ల దాకా.మారిన సీమ ఇమేజ్!

ఫ్యాక్షన్ నుంచి ఫైటర్ జెట్ల దాకా.మారిన సీమ ఇమేజ్!

Satyam NEWS 1 week ago

రాయలసీమ జిల్లాలు.. అనగానే ఇప్పటికీ మిగిలిన ప్రపంచానికి గుర్తొచ్చే ఇమేజ్ వేరు. కానీ, గడిచిన కొన్నేళ్లుగా అక్కడ, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంటున్న పారిశ్రామిక విప్లవం గురించి చాలామందికి అవగాహన తక్కువ.

ఒకప్పుడు కరువు సీమగా, ఫ్యాక్షన్ గడ్డగా ప్రచారంలో ఉన్న ఈ ప్రాంతం.. ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. కియా కార్ల కంపెనీ ఎంట్రీతో ఉమ్మడి అనంత జిల్లా గ్లోబల్ మ్యాప్‌లో నిలవగా, తాజాగా ఆ జిల్లా నుంచి విడిపోయి ఏర్పడిన శ్రీసత్యసాయి జిల్లా ఏకంగా దేశ రక్షణ రంగానికే హబ్‌గా మారబోతోంది.

ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ స్థానాలు, నాలుగు రెవెన్యూ డివిజన్లతో (పుట్టపర్తి, పెనుకొండ, కదిరి, మడకశిర), 32 మండలాలు, 17.2 లక్షల జనాభా ఉన్న శ్రీసత్యసాయి జిల్లా.. ఇప్పుడు రాయలసీమలోనే మోస్ట్ ఇండస్ట్రియల్ అండ్ డిఫెన్స్ జిల్లాగా దూసుకుపోతోంది.

ఈ జిల్లా ప్రత్యేకత ఏమంటే.. ఇక్కడి తూమకుంట పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పటికే వందలాది పరిశ్రమలు కొలువుదీరాయి. కేవలం కియా కార్ల ప్లాంట్ మాత్రమే కాదు.. దానికి అనుబంధంగా హ్యుందాయ్ మోబిస్, హ్యుందాయ్ ట్రాన్సిస్, ఎస్హెచ్కే మెటల్స్, సియోన్ ఇహ్వా లాంటి అంతర్జాతీయ ఆటోమొబైల్ విడిభాగాల తయారీ ప్లాంట్లు ఇక్కడ విజయవంతంగా నడుస్తున్నాయి.

వీటితో పాటు ప్రముఖ ఇన్నర్ వేర్ బ్రాండ్ జాకీ, ప్రసిద్ధ బెర్జర్ పెయింట్స్ కూడా తమ భారీ తయారీ యూనిట్లను ఇక్కడే ఏర్పాటు చేశాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు ఏకంగా పది వేల కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సెమీకండక్టర్ల తయారీ యూనిట్ కూడా ఇక్కడ రాబోతుండటం విశేషం.

రక్షణ రంగంలో కీలక హబ్ గా….

రానున్న రోజుల్లో ఏరోస్పేస్ రంగానికి ఈ జిల్లా గ్లోబల్ హబ్‌గా మారబోతోంది. రేమండ్ గ్రూప్‌నకు చెందిన జెకె మైని గ్లోబల్ ఏరోస్పేస్ సంస్థ అత్యాధునిక ఏరోస్పేస్ విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఇక్కడే నిర్మిస్తోంది. దీనికి తోడు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా భారీ సోలార్ పవర్ ప్రాజెక్టుతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను ఇక్కడ స్థాపిస్తోంది. ఇక, వీటన్నింటినీ మించి.. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ శంకుస్థాపన జరుపుకున్న అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ - AMCA ప్రాజెక్టు ఈ జిల్లా చరిత్రనే మార్చేయబోతోంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం పుట్టపర్తి రన్‌వేకు ఆనుకొని ఉన్న 600 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ తయారు చేసే ఐదో తరం అధునాతన యుద్ధ విమానాల పరీక్షల కోసం ప్రస్తుత రన్‌వేను ఏకంగా 10 వేల అడుగులకు విస్తరించనున్నారు. రన్‌వేతో పాటు అత్యాధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) టవర్, అడ్వాన్స్‌డ్ నావిగేషన్ వ్యవస్థలను ఇక్కడ నిర్మిస్తున్నారు. భారత్ పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారు చేసే యుద్ధ విమానాల అసెంబ్లీ, టెస్టింగ్, సర్టిఫికేషన్ ప్రక్రియలన్నీ ఇకపై పుట్టపర్తి కేంద్రం నుంచే జరుగుతాయి.

ఈ మెగా ప్రాజెక్టుతో పాటు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ - BEL, భారత్ ఫోర్జ్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు, పదుల సంఖ్యలో ప్రైవేట్ డిఫెన్స్ భాగస్వామ్య కంపెనీలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ఈ ఒక్క డిఫెన్స్ హబ్ పుణ్యమా అని రానున్న రోజుల్లో శ్రీసత్యసాయి జిల్లాకు దాదాపు రూ.లక్ష కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.

శ్రీసత్యసాయి జిల్లాకు ఉన్న మరో అతిపెద్ద భౌగోళిక అడ్వాంటేజ్ ఏంటంటే.. ఇది కర్ణాటక రాజధాని, ఐటీ హబ్ అయిన బెంగళూరుకు అత్యంత సమీపంలో ఉండటం. అటు అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలతో సరిహద్దులను పంచుకుంటూ.. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరగా ఉండటం వల్ల ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు ఇక్కడ స్థిరపడటానికి అనుకూలంగా మారింది.

ఒకప్పుడు కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే ప్రపంచానికి తెలిసిన పుట్టపర్తి.. ఇకపై దేశ సరిహద్దులను రక్షించే యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా గర్జించబోతోంది. మొత్తానికి సీమ జిల్లాల్లోనే శ్రీసత్యసాయి జిల్లా మోస్ట్ స్పెషల్ అండ్ పవర్‌ఫుల్ జిల్లాగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News