తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ ఆనవాళ్లను తొలగించే ధైర్యం ప్రస్తుత ముఖ్యమంత్రికి ఉందా అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రశ్నించారు.
అంబర్‌పేట నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చారిత్రాత్మక పాత్ర పోషించారని, పది సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి పరంగా అగ్రస్థానంలో నిలబెట్టారని తలసాని పేర్కొన్నారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, సంక్షేమం, మౌలిక వసతులు వంటి అనేక రంగాల్లో తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.
మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. నగరంలో రహదారులు, పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు, సుందరీకరణ కార్యక్రమాలు చేపట్టి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చామని తెలిపారు.
ఆరు హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని తలసాని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వం నాయకులు, కార్యకర్తల గౌరవాన్ని పెంచే విధంగా పనిచేసిందని తెలిపారు. నియోజకవర్గాల్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలనే ఆశ్రయిస్తున్నారని, అదే పార్టీ ఇచ్చిన గుర్తింపని పేర్కొన్నారు.
పార్టీని తల్లి లాంటి సంస్థగా భావించి కాపాడుకోవాలని తలసాని పిలుపునిచ్చారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికే భవిష్యత్తులో ప్రాధాన్యం, పదవులు ఉంటాయని స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

