Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్లిష్ట సమయంలో కుటుంబం నుంచే మద్దతు రాలేదు

క్లిష్ట సమయంలో కుటుంబం నుంచే మద్దతు రాలేదు

Satyam NEWS 1 week ago

నకు రాజకీయంగా క్లిష్ట సమయంలో కుటుంబం నుంచే మద్దతు రాలేదని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నేడు ఆమె వే టు న్యూస్ కాంక్లేవ్‌లో మాట్లాడుతూ పలు అంశాలపై తన స్పందన ఇచ్చారు.

రాష్ట్ర రాజకీయాలు, మహిళా సాధికారత, రైతు సమస్యలు, నీటి ప్రాజెక్టులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని "ఆర్ఎస్ఎస్ సీఎం"గా కవిత అభివర్ణించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తానని తెలిపారు.

బండి సంజయ్ కుమారుడిపై నాన్‌బెయిలబుల్ సెక్షన్లు ఉన్న కేసులు నమోదైనా అరెస్ట్ చేయకపోవడం వెనుక రాజకీయ కారణాలున్నాయని కవిత ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. మహిళలకు సంబంధించిన కేసుల్లో మీడియా ట్రయల్స్ జరగడం బాధాకరమని, బాధితురాలి క్యారెక్టర్‌ను టార్గెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేయడం సరికాదన్నారు. తెలంగాణ మహిళలు ఈ వ్యవహారాన్ని గమనిస్తున్నారని, అవసరమైన సమయంలో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

భిన్నాభిప్రాయాలు చెప్పినందు వల్లే బయటకు పంపారు

తనకు ఉద్యమ నాయకుడు కేసీఆర్ తో ఎలాంటి సమస్య లేదని, కానీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేతగా వ్యవహరించిన కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్‌లోని నాయకత్వ విధానాలపై విభేదాలు ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్‌లో తాను భిన్నమైన అభిప్రాయాలు చెప్పేదాన్నని, అంతర్గతంగా చెప్పిన అభిప్రాయాలను బయటకు లీక్ చేసి తనను బయటకు వెళ్లే పరిస్థితి తీసుకువచ్చారని ఆరోపించారు. ఆ తర్వాత ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేనను స్థాపించినట్లు చెప్పారు.

తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు, కఠిన పరిస్థితులే తనలో మార్పు తీసుకొచ్చాయని కవిత పేర్కొన్నారు. ఎవరికీ నచ్చకపోయినా మనకు నచ్చిన పని చేయాలని తాను నేర్చుకున్నానన్నారు. మహిళలు రాజకీయాల్లో ఫెయిల్ అయితే వారిపై "ఏమీ చేతకాదు" అనే ముద్ర వేస్తారని, అందుకే తాను విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నానని తెలిపారు. మహిళలు, జెన్ జీ యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.

యువతకు రుణలు ఇచ్చి వ్యాపారాలు పెట్టిస్తా

రాష్ట్రంలో గుణాత్మక మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేశామని తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం మాత్రమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లాలని అన్నారు. అందుకోసం యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు ఇచ్చి వ్యాపారాలు ప్రారంభించేలా ప్రోత్సహిస్తామని వెల్లడించారు. వారిలో నుంచి ఒక గూగుల్ లాంటి సంస్థ వచ్చినా సరిపోతుందని చెప్పారు.

రైతుల విషయంలో గత, ప్రస్తుత ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయని కవిత ఆరోపించారు. ధరణి పేరు మార్చి భూమాత పెట్టినా పరిస్థితి మారలేదన్నారు. గోదావరి జలాలను పూర్తిగా వినియోగించుకోలేకపోయామని, 960 టీఎంసీల వినియోగ అవకాశముంటే 250 టీఎంసీలు కూడా వినియోగించలేదన్నారు.

పాలమూరు ప్రాజెక్టు 30 నెలల్లో పూర్తి కావాల్సి ఉండగా 132 నెలలు గడిచినా పూర్తికాలేదని విమర్శించారు. ఖర్చులు రూ.32 వేల కోట్ల నుంచి రూ.85 వేల కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన 12 ఏళ్లైనా పాలమూరులో వలసలు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలని కుట్ర చేస్తోందని ఆరోపించిన కవిత, ముందుగా ప్రాంతీయ వాదం తర్వాతే జాతీయ వాదం ఉండాలని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి నేతలు పార్లమెంట్‌లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో విఫలమయ్యారని అన్నారు.

కుటుంబం పట్టించుకోలేదు…

లిక్కర్ స్కామ్ పేరుతో బీజేపీ తనను, అరవింద్ కేజ్రీవాల్ ను బద్నాం చేయాలని ప్రయత్నించిందని కవిత ఆరోపించారు. కోర్టు ఆ ఆరోపణలను కొట్టివేసిందని, కేసు విచారించిన సీబీఐ అధికారిపై విచారణ చేయాలని ఆదేశించడం దేశంలోనే తొలిసారి జరిగిందని పేర్కొన్నారు. ఆ సమయంలో తన కుటుంబం నుంచి పూర్తిస్థాయి మద్దతు రాలేదని, కానీ అత్తవారి కుటుంబం తనకు ధైర్యం ఇచ్చిందని వెల్లడించారు.

తెలంగాణ ప్రజలకు మర్చిపోలేనంత మంచి చేసి చరిత్రలో నిలిచిపోవడమే తన లక్ష్యమని కవిత స్పష్టం చేశారు. తమిళనాడులో నటుడు విజయ్ గెలిచినట్లే తెలంగాణలో కూడా తెలంగాణ రక్షణ సేన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఎన్టీఆర్, కేసీఆర్, ఇందిరాగాంధీ, సుష్మా స్వరాజ్, మార్గరెట్ థాచర్ వంటి నాయకులు స్ఫూర్తి అని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News