Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొత్త సినిమాలతో మళ్లీ కలకలం రేపుతున్న ఐబొమ్మ

కొత్త సినిమాలతో మళ్లీ కలకలం రేపుతున్న ఐబొమ్మ

Satyam NEWS 1 week ago

బొమ్మ మళ్లీ కొత్త సినిమాలను అప్ లోడ్ చేస్తున్నదా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తున్నది. తెలుగు సినిమా పరిశ్రమను ఒకప్పుడు తీవ్రంగా కలవరపరిచిన పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ మరోసారి కార్యకలాపాలు ప్రారంభించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

కొంతకాలం పూర్తిగా కనిపించకుండా పోయిన ఈ వెబ్‌సైట్ మళ్లీ కొత్త డొమైన్లతో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడంతో టాలీవుడ్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొత్త సినిమాలు విడుదలైన కొద్ది గంటల్లోనే వాటి పైరసీ కాపీలు అందుబాటులోకి వస్తున్నాయనే సమాచారం సినీ పరిశ్రమకు షాక్ ఇస్తోంది.

గతంలో ఐబొమ్మ నిర్వహణకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన తరువాత ఈ వెబ్‌సైట్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని భావించారు. అప్పట్లో ఐబొమ్మకు సంబంధించిన పలు డొమైన్లు బ్లాక్ చేశారు. అంతేకాకుండా "సర్వీస్ శాశ్వతంగా నిలిపివేశాం" అనే సందేశం కూడా సైట్‌లో కనిపించింది.

డిస్ట్రిబ్యూటర్లలో తీవ్ర ఆందోళన

అయితే తాజాగా ఐబొమ్మ మళ్లీ కొత్త పేర్లు, మిర్రర్ సైట్ల రూపంలో అందుబాటులోకి వచ్చిందని పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కొత్త సినిమాల పైరసీ వెర్షన్లు తిరిగి వెబ్‌సైట్‌లో కనిపించడం సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఇప్పటికే థియేటర్లకు ప్రేక్షకులు తగ్గిపోతున్న సమయంలో పైరసీ మళ్లీ పెరగడం వల్ల బాక్సాఫీస్ వసూళ్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇమ్మడి రవికి ఇటీవల బెయిల్ లభించడం, ఆ వెంటనే ఐబొమ్మ తరహా సైట్లు మళ్లీ యాక్టివ్ కావడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే ప్రస్తుతం నడుస్తున్న సైట్లు అసలు ఐబొమ్మ నెట్‌వర్క్‌కే సంబంధించినవా లేదా కేవలం క్లోన్ వెబ్‌సైట్లా అన్న విషయంపై అధికారిక స్పష్టత లేదు. సైబర్ క్రైమ్ అధికారులు ఈ అంశంపై నిఘా కొనసాగిస్తున్నట్లు సమాచారం.

చిత్ర సీమకు వేల కోట్ల రూపాయల నష్టం

సినిమా పైరసీ వల్ల భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసిన వెంటనే మరో కొత్త డొమైన్‌తో తిరిగి ప్రత్యక్షమవడం వల్ల పైరసీని పూర్తిగా అరికట్టడం సవాలుగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ సర్వర్లు, VPNలు, ఎన్క్రిప్టెడ్ నెట్‌వర్క్‌లను ఉపయోగించడం వల్ల ఈ నెట్‌వర్క్‌లను పూర్తిగా నిర్వీర్యం చేయడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News