కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు, పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ చేతిలో బాధితురాలై మైనర్ బాలిక తల్లి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో తన కుటుంబానికి, తన కూతురికి జరిగిన అన్యాయం, కలిగిన ఆవేదన, భయాందోళనల పైన సవివరంగా తెలిపారు.
తన కూతురుపై బండి సంజయ్ కొడుకు చేసిన అఘాయిత్యం, తన మైనర్ కూతురు పడిన అవేదన, తమకు పోలీసు స్టేషన్ లో ఎదురైన ఇబ్బందులు, బండి సంజయ్ బెదిరింపులు, కావాలని తన బిడ్డపై చేస్తున్న దుష్ప్రచారం, పరారీలో ఉన్న బండి భగీరద్, తండ్రి సంజయ్ వలన తమ కుటుంబానికి పొంచి ఉన్న హాని వంటి పలు అంశాలపై తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రకటన వివరాలు
భరించలేని తీవ్ర వేదన అనుభవిస్తున్నప్పటికీ, ఒక మైనర్ కుమార్తె, బాధితురాలైన మైనర్ కుమార్తె నిస్సహాయ తల్లిగా ఈ ప్రకటన జారీ చేయాల్సి వస్తుంది. నా కుమార్తెకు రక్షణ, గౌరవం, భవిష్యత్తును పొందే అర్హత అందరి లాగే ఉన్నది. మేము ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్లం.
మాకు ఎలాంటి రాజకీయ అండదండలు లేవు. కానీ ఈ రోజు మా బిడ్డను కాపాడుకోమని, మా న్యాయ పోరాటాన్ని వినమని సమాజంలోని వ్యవస్థలను వేడుకోవాల్సిన దారుణమైన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఈ ప్రకటన పగతోనో, ప్రచారం కోసమో చేయడం లేదు. నిజాలతో మా బాధను అందరికీ తెలియపరచాలని ఈ ప్రకటన జారీ చేస్తున్నాము.
నిందితుడు బండి భగీరథ్ బయట ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. మా కుటుంబానికి తీవ్రమైన ప్రమాదం ఉన్నది. గతంలో బండి సంజయ్ ఇంటికి, అయన అనుచరుడు సంగప్ప కోరితో వెళ్లాము. కానీ బండి సంజయ్ బెదింపులకు దిగారు.
దీంతోపాటు తమ కుటుంబం పైన సామాజిక మాధ్యమాల ద్వారా, వ్యక్తుల ద్వారా జరుగుతున్న బెదిరింపులు, దాడులు మాకు తీవ్రమైన భయాన్ని కలిగిస్తున్నాయి. మా బిడ్డ పుట్టిన తేదీకి సంబంధించి కావాలనే వివాదం రేపి న్యాయపరమైన విచారణ ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2025వ సంవత్సరంలో నా కూతురికి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌తో పరిచయం ఏర్పడింది.
మొదట్లో సాధారణ పరిచయంగా ప్రారంభమై ఆ తర్వాత బండి సంజయ్ కొడుకు భగీరథ్ పదేపదే మాట్లాడటము, బలవంతంగా ఒప్పించడముతోపాటు అనేక రకాల ప్రలోభాలకు గురి చేయడం వలన నా కుమార్తె ఆయనపై మానసిక ఆధారపడటం జరిగింది. కానీ మా కుమార్తెను మాయమాటలు చెప్పి మానసికంగా లొంగదీసుకోబడింది.. పూర్తిగా బండి భగీరథ్ నియంత్రణలోకి వెళ్లిపోయింది. తన ఇష్టం లేకపోయినా… అనేక సార్లు తీవ్రంగా ప్రతిఘటించిన సందర్భాల్లోనూ శారీరక సంబంధం కోసం బండి భగీరథ్ పదేపదే ఒత్తిడి తీసుకువచ్చారు.
ముఖ్యంగా 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి, 2026 జనవరి 1 తెల్లవారుజామున మోయినాబాద్‌లో తనపై దాడి జరిగింది. ఆ రోజు తనకు ఇష్టం లేకున్నా మద్యం సేవించాలని ఒత్తిడి తీసుకొచ్చిన భగీరథ్ అచేతన స్థితిలో ఉన్నప్పుడు అనుచితమైన ప్రవర్తనకు దిగాడు. బలవంతంగా శారీరకంగా దాడి చేశాడు. తన కుమార్తెతో అనేక సార్లు శారీరక సంబంధం కోసం పదేపదే ఒత్తిడి తెచ్చాడు.
చివరికి ధైర్యం కూడా తీసుకొని 2026 మార్చి ఏప్రిల్ నెలలో చట్టపరంగా ముందుకు పోదామని ప్రయత్నించాము. బండి భగీరథ్ ప్రతినిధిగా చెప్పుకుంటూ 2026 ఏప్రిల్ 22వ తేదీన సంగప్ప అనే వ్యక్తి మా నివాసానికి వచ్చి మాట్లాడాడు.
సంగప్ప కోరిక మేరకు ఆ తర్వాత తెల్లారి ఏప్రిల్ 23న మేము కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటికి వెళ్లి ఆయన్ని కలిశాము. బాధితురాలైన కూతురు తల్లిదండ్రులుగా ఆ భేటీకి వెళ్ళినప్పుడు మాకు భరోసా, రక్షణ కలుగుతుందని అనుకున్నాము. కానీ బండి సంజయ్ ఇంటి నుంచి తీవ్రమైన భయంతో బయటకు వచ్చాము.
తన రాజకీయ ప్రాబల్యం, తన మద్దతుదారుల ద్వారా, అనుచరుల ద్వారా మా కుటుంబానికి కష్టాలు తప్పవు అని, జరగబోయే పరిణామాల గురించి బండి సంజయ్ చేసిన చెప్పిన మాటలు, హెచ్చరికలు, బెదిరింపులు మమ్మల్ని తీవ్రంగా భయపెట్టాయి. ఆ రోజు నుంచి మా కుటుంబం నిరంతరంగా భయంలో బతుకుతున్నాము.
చివరికి ఈ నెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి పోక్సో చట్టం కింద మా ఫిర్యాదును నమోదు చేయాలని కోరాము. మైనర్ బాలిక అయిన మా కూతురు తనకు కలిగిన కష్టనష్టాలను వెల్లడించినప్పటికీ ఐదు గంటలకు పైగా మమ్మల్ని పోలీస్ స్టేషన్‌లో పోలీసులు వేచి ఉండేలా చూశారు.
కానీ మాకు జూరిస్డిక్షన్ సమస్యలు ఉన్నాయి, ఫిర్యాదును బదిలీ చేస్తాము అని రకరకాల కారణాలు చెప్పారు. జీరో ఎఫ్ఐఆర్ గురించి పదే పదే పట్టుబట్టిన తర్వాతే రశీదు జారీ చేశారు. మా మైనర్ కుమార్తెకు జరిగిన ఇంతటి ఆవేదన ఇంకొక ఏ బిడ్డకు కలగకూడదు.
కావాలనే కొందరు దీనిని వ్యక్తిగత సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మొదట పోలీసులు బాధితురాలి ఆరోపణలు స్పష్టంగా చెప్పినప్పటికీ, బెయిల్ పొందదగిన నిబంధనలను మాత్రమే చేర్చారు. ప్రజల ఆందోళన, ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి మా కూతురు నుంచి మరోసారి వివరమైన వాంగ్మూలం నమోదు చేసి తీవ్రమైన సెక్షన్లను నమోదు చేశారు.
మా బిడ్డపై జరిగిన దాడిని నిష్పాక్షికంగా, స్వతంత్రంగా, న్యాయబద్ధంగా విచారణ జరగాలని కోరుతున్నాము. మా మైనర్ బిడ్డ ఫోటోలను, ఆమె గుర్తింపును బయటకు వచ్చేలా సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. మైనర్ల గుర్తింపును, గౌరవాన్ని కాపాడటం పోక్సో చట్టం బాధ్యత మాత్రమే కాదు, సమాజం నైతిక బాధ్యత అని వేడుకుంటున్నాము.

