Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Satyam NEWS 5 days ago

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మంగళవారం లీటరుకు సుమారు 90 పైసల వరకు ధరలను పెంచడంతో వారం రోజుల్లోనే రెండోసారి ఇంధన ధరల భారం ప్రజలపై పడింది.

తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.97.77 నుంచి రూ.98.64కు పెరగగా, డీజిల్ ధర రూ.90.67 నుంచి రూ.91.58కు చేరింది. రాష్ట్రాల వారీగా వ్యాట్ పన్నుల వ్యత్యాసం కారణంగా ధరల్లో తేడాలు కనిపిస్తున్నాయి.

నాలుగేళ్ల పాటు పెట్రోలు డీజిల్ ధరలు పెరగలేదు. అయితే గత శుక్రవారం పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.3 చొప్పున పెంపు చేసిన విషయం తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, అనంతరం ఇరాన్ ప్రతీకార చర్యలతో హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో చమురు రవాణా అంతరాయం ఏర్పడటంతో ప్రపంచ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఫిబ్రవరి చివరి నుంచి 50 శాతానికి పైగా పెరిగాయి. అయినప్పటికీ కీలక రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా ఇంధన ధరలను ప్రభుత్వం నియంత్రణలో ఉంచిందనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వచ్చాయి.

రేట్లు పెంచినా చమురు కంపెనీలకు నష్టాలే

శుక్రవారం జరిగిన రూ.3 పెంపు తర్వాత కూడా చమురు కంపెనీల నష్టాలు కొనసాగుతున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ తెలిపారు. మే 15న జరిగిన పెంపుతో నష్టాలు కొంత తగ్గినా, ప్రస్తుతం కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు సుమారు రూ.750 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయని పేర్కొన్నారు. క్రిసిల్ అంచనాల ప్రకారం, మే 15 పెంపు తర్వాత కూడా పెట్రోల్‌పై లీటరుకు రూ.10, డీజిల్‌పై రూ.13 వరకు నష్టం కొనసాగుతోంది.

తాజా పెంపుతో ముంబైలో పెట్రోల్ ధర రూ.107.59, డీజిల్ రూ.94.08కు చేరగా, కోల్‌కతాలో పెట్రోల్ రూ.109.70, డీజిల్ రూ.96.07గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.104.49, డీజిల్ రూ.96.11కు పెరిగింది. 2022 మే తర్వాత ఇదే అత్యధిక ఇంధన ధరలుగా నమోదయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చిలో ఒక్కసారిగా రూ.2 తగ్గింపు మినహా, ఏప్రిల్ 2022 నుంచి ధరలు స్థిరంగానే కొనసాగాయి.

ఇక సీఎన్‌జీ ధరలు కూడా వరుసగా పెరుగుతున్నాయి. మే 15న ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కిలోకు రూ.2 పెంచగా, ఆదివారం మరో రూపాయి చొప్పున పెంపు చేశారు. అలాగే వంటగ్యాస్ ఎల్పీజీ సిలిండర్ ధరలను మార్చిలో రూ.60 పెంచినా, ఇంకా ప్రతి 14.2 కిలోల సిలిండర్‌పై చమురు సంస్థలకు రూ.674 నష్టం వస్తోందని సమాచారం.

ఇంధన ధరల పెంపు ద్రవ్యోల్బణంపై కూడా ప్రభావం చూపనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ 2026లో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరగా, టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 8.3 శాతానికి పెరిగి 42 నెలల గరిష్టాన్ని తాకింది. ఇంధన, విద్యుత్ రంగ ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు.

ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల ప్రజలకు ఇంధన పొదుపు పాటించాలని, అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను అనుసరించాలని సూచించారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక పర్యటనలను తగ్గించడం, భౌతిక సమావేశాల స్థానంలో వర్చువల్ సమావేశాలను నిర్వహించడం వంటి ఆదేశాలు జారీ చేశాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News