Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీ పట్ల ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా ఉంది

మీ పట్ల ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా ఉంది

Satyam NEWS 3 weeks ago

జ్రాయెల్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఏదో సభలోనో లేక ఎక్స్ వేదికగానో కాదు… ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమెన్ నెతన్యాహూతో టెలిఫోన్ లో మాట్లాడుతూ డోనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్ వెల్లడించింది.

లెబనాన్‌లో కొనసాగుతున్న సైనిక చర్యల నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోందని ట్రంప్ నేరుగా నెతన్యాహుకు హెచ్చరించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. లెబనాన్‌లో జరుగుతున్న సైనిక దాడులు కొనసాగితే ఇరాన్ తో జరుపుతున్న తమ దౌత్య చర్చలను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ నెతన్యాహుతో మాట్లాడిన సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇజ్రాయెల్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ "నువ్వు అసలు ఏమి చేస్తున్నావు?" అని ట్రంప్ గట్టిగా ప్రశ్నించినట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు.

హిజ్బుల్లా దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ తీసుకుంటున్న చర్యలు అతిగా ఉన్నాయని ట్రంప్ భావించినట్లు ఆ సంస్థ రిపోర్టు తెలిపింది. ఒకే హిజ్బుల్లా కమాండర్‌ను లక్ష్యంగా చేసుకుని మొత్తం భవనాలను ధ్వంసం చేయడం, అలాగే బీరూట్ పై మరింత కఠిన చర్యల హెచ్చరికలు జారీ చేయడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం.

సంభాషణకు సంబంధించిన వివరాలు తెలిసిన మరో అధికారి మాట్లాడుతూ "ఇప్పుడు అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. ఈ చర్యల కారణంగా ఇజ్రాయెల్‌ను కూడా ద్వేషిస్తున్నారు" అని ట్రంప్ నెతన్యాహుకు చెప్పినట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇజ్రాయెల్ అంతర్జాతీయ ప్రతిష్ఠ దెబ్బతింటోందనే అమెరికా అధ్యక్షుడి ఆందోళనను ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ వేడెక్కిన సంభాషణ అనంతరం నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఇజ్రాయెల్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. అయితే అమెరికా అధికారుల కథనం ప్రకారం, ఈ సంభాషణలో ట్రంప్ పూర్తిగా పైచేయి సాధించారని పేర్కొన్నారు. చర్చ సమయంలో నెతన్యాహు "సరే, సరే, అన్నీ చూసుకోండి" అని స్పందించినట్లు ఒక అధికారి వెల్లడించారు.

ట్రంప్ రెండో అధ్యక్ష పదవీకాలం ప్రారంభమైన తర్వాత నెతన్యాహుతో జరిగిన అత్యంత ఉద్రిక్త సంభాషణల్లో ఇదొకటిగా అమెరికా పరిపాలన వర్గాలు అభివర్ణించాయి. ఈ ఘటన అనంతరం ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదికలో స్పందిస్తూ, తాను పెద్ద ఎత్తున బీరుట్‌పై దాడి చేయవద్దని కోరిన తర్వాత నెతన్యాహు తన దళాలను వెనక్కి మళ్లించినట్లు పేర్కొన్నారు.

అంతేకాకుండా, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ తో జరుగుతున్న చర్చలు వేగంగా ముందుకు సాగుతున్నాయని ట్రంప్ మరో సందేశంలో తెలిపారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలను కొనసాగించాలన్నదే తన లక్ష్యమని ఆయన సంకేతాలు ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News