ప్రజాస్వామ్య పరిరక్షణలో విలేకరుల పాత్ర కీలకమని, వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు స్పష్టం చేశారు.
గురువారం స్థానిక గుంటూరు రోడ్డులోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అరవిందబాబు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఏప్రిల్ 28న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి వారణాసి జగన్మోహన్ రెడ్డి (49) ను మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన దుండగులు వెంటాడి హత్య చేయటం దుర్మార్గమైన చర్య అని అన్నారు.
ఈ ఘటనకు కారకులైన రౌడీషీటర్ మహబూబ్ బాషా ఎలియాస్ తమీమ్ ను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇటీవల గంజాయి కేసులో బెంగళూరు పోలీసులు నిండితుడు రౌడీ షీటర్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారని తెలిపారు.
బెయిల్ పై వచ్చిన అతను తనపై వార్తలు రాసినందుకు హత్య చేశారని తెలిపారు. నిజాయితీగా వార్తలు రాసి సమాజాన్ని చైతన్యపరిచే ఇటువంటి విలేకరులను ప్రతి ఒక్కరు కాపాడుకోవాలని అన్నారు. విలేకరులు సమాజంలోని కష్టనష్టాలను వెలికితీసి ప్రజలకు తెలియజేయడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తారని చదలవాడ అన్నారు.
కరోనా సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన వేళ తాను ఎమ్మెల్యేగా పట్టణంలో పర్యటించినప్పుడు విలేకరులు తనతోపాటు ప్రజల్లో తిరిగారని తెలిపారు. ఆ సమయంలో పేద ప్రజలకు ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు, అన్నం, పెరుగన్నం అందించడానికి సుదూర గ్రామాలకు వెళ్లి సేవలందించారని కొనియాడారు.
గత ప్రభుత్వంలో మీడియాపై దాడులు
గత వైసిపి ప్రభుత్వం హయాంలో విలేకరులపై దాడులు జరిగాయని ఎమ్మెల్యే ఆరోపించారు. అయినప్పటికీ విలేకరులు ధైర్యంగా కుటుంబాలను వదిలి సమాచార సేకరణకు ప్రజల్లోకి వెళ్తున్నారని ప్రశంసించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని చదలవాడ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ విలేకరులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

