తెలంగాణ రాష్ట్రం కళలకు పురిటిగడ్డ అని, కళాకారులను గౌరవించి ఆదుకోవడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
శ్రీ సోమశేఖర మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కల్చరల్ సొసైటీ కిన్నెర సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో వివిధ రంగాలకు చెందిన కళాకారులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమం సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మృందగ వాద్యకారుడు డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు, సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజల గారలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఘనంగా సన్మానం సత్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ "రాష్ట్ర ప్రభుత్వం తరపున కళాకారులకు పూర్తి ప్రోత్సాహం అందిస్తాం. కళలు కేవలం కళాకారుల కోసమే కాకుండా, సమాజ శ్రేయస్సు కోసం కూడా ఉపయోగపడాలి. కళల ద్వారా సామాజిక సందేశాన్ని ప్రజలకు చేరవేయాలని రాష్ట్రంలోని కళాకారులందరికీ నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
పూర్వ కాలంలో సమాజంలోని అనేక రుగ్మతలను తొలగించడానికి కళారూపాలు ఎంతో కృషి చేశాయి. నేడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సామాజిక అభివృద్ధి కోసం, సామాజిక రుగ్మతల నిర్మూలన కోసం పాలనతో పాటు కళలను కూడా ఒక సాధనంగా ఉపయోగిస్తోంది. కళాకారులు ఈ ప్రయత్నంలో పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, వారి నైపుణ్యాన్ని ప్రభుత్వం తప్పకుండా గుర్తించి గౌరవిస్తుందని" డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కళల పట్ల, కళాకారుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని పేర్కొన్నారు. సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా నాట్య రంగంలో విశేష అనుభవం ఉన్న ప్రొఫెసర్ అలేఖ్య గారిని నియమించడం కళల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి నిదర్శనమని, రాష్ట్రంలో సంగీతం, నాట్యం వంటి లలిత కళలకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి ప్రోత్సాహం లభిస్తుందని భరోసా ఇచ్చారు.
భారతీయ శాస్త్రీయ సంగీతంలో మృదంగ వాద్యానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన మహనీయుడు ఎల్లా వెంకటేశ్వరరావు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొనియాడారు.
ఎల్లా వెంకటేశ్వరరావు గారికి 83 ఏళ్లు అని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. ఈ వయస్సులో కూడా వారు మృదంగాన్ని అంత శక్తివంతంగా వాయిస్తున్నారంటే, అది కళ పట్ల వారికి ఉన్న మక్కువ మరియు నిరంతర సాధన వల్లే సాధ్యమైందని నేను నమ్ముతున్నాను.
ఎల్లా వెంకటేశ్వరరావు గారు కేవలం ఒక వాద్యకారుడు మాత్రమే కాదని, భారతీయ సంగీత శిఖరాలైన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, పండిట్ రవి శంకర్, చెంబై, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, ఎం. బాలమురళీకృష్ణ, యేసుదాస్, అమ్జద్ అలీ ఖాన్, హరిప్రసాద్ చౌరాసియా వంటి దిగ్గజాలతో కలిసి వేదికలను పంచుకున్న అరుదైన ప్రతిభావంతులని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కర్ణాటక, హిందుస్థానీ శైలులు రెండింటిలోనూ ఆయన మృదంగ విన్యాసం అనితరసాధ్యమని ప్రశంసించారు.
ఆయన ప్రతిభకు దక్కిన అరుదైన గౌరవాలను డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, భారత ప్రభుత్వం దేశ నాలుగవ అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మశ్రీ'తో ఆయనను గౌరవించడం మనందరికీ గర్వకారణమని అన్నారు.
1961లో ఆల్ ఇండియా రేడియో దేశవ్యాప్త పోటీల్లో ప్రథమ స్థానం సాధించి, అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా 'గోల్డెన్ ల్యూట్' పురస్కారం అందుకోవడం ఆయన నిరంతర సాధనకు నిదర్శనమని తెలిపారు. జకార్తాలో 'శివతాండవం' ప్రదర్శనకు గాను 'హోషా బాంకా' అవార్డు, రోమ్‌లో గోల్డ్ మెడల్, అమెరికాలోని టెక్సాస్‌లో గౌరవ పౌరసత్వం వంటివి ఆయన అంతర్జాతీయ కీర్తికి మచ్చుతునకలని వివరించారు.
నవ మృదంగ సమ్మేళనం వంటి విలక్షణ ప్రయోగాల ద్వారా మృదంగ వాద్యంలో ఆయన చేసిన కృషి అద్భుతమని, 1994లో ఉత్తమ గురువుగా ఎంపికై ఎందరో శిష్యులను తీర్చిదిద్దడం అభినందనీయమని భట్టి విక్రమార్క కొనియాడారు. ఢిల్లీ తెలుగు అకాడమీ వారి 'విశాల భారతీ గౌరవ సత్కారం', ఉగాది పురస్కారం, కళారత్న, విశ్వ సాహితి వంటి ఎన్నో పురస్కారాలు ఆయన కృషికి లభించిన నిజమైన గుర్తింపులని ఆయన తెలిపారు.
సంగీత సాధనలో నిరంతరం శ్రమిస్తూ, తెలుగు జాతి పేరును ప్రపంచ యవనికపై నిలబెట్టిన ఎల్లా వెంకటేశ్వరరావు గారు నేటి తరానికి స్ఫూర్తిప్రదాత అని పేర్కొన్నారు.
సంగీత నాటక అకాడమీ చైర్మన్ డాక్టర్ అలేఖ్య పుంజల గారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి తొలి మహిళా రిజిస్ట్రార్‌గా సేవలందించారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొనియాడారు . "సంగీతం, నాటకం, మరియు నృత్య రంగాలలో విశేష ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ, ఆమె అనేక జిల్లాల్లో తన ప్రదర్శనల ద్వారా వివిధ కళారూపాలకు జీవం పోస్తున్నారు.
ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ పాత్రను తన నృత్య రూపకం ద్వారా అద్భుతంగా ప్రదర్శించి, ఐలమ్మ పోరాట సందేశాన్ని లోకానికి చాటిచెప్పారు. భగవంతుడు తనకు ప్రసాదించిన కళను వేలమంది శిష్యులకు నేర్పిస్తూ గొప్ప గురువుగా గుర్తింపు పొందారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను కళారూపాల ద్వారా ప్రజల వద్దకు చేరవేస్తున్న ఆమె, కాకతీయ వంశానికి చెందిన రాణి రుద్రమదేవి వీరగాథను నృత్య రూపకం ద్వారా దేశవ్యాప్తంగా సుపరిచితం చేసిన గొప్ప కళాకారిణి. తన అద్భుత ప్రజ్ఞాపాటవాలతో కళా రంగానికి ఆమె ఎనలేని సేవ చేస్తున్నారని" డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

