బండారు దత్తాత్రేయ అనేక కీలక హోదాల్లో పనిచేసి ప్రతి పదవికి ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చారని మాజీ ఎంపీ జి.వి.ఎల్. నరసింహారావు కొనియాడారు. బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన "ప్రజల కథే నా ఆత్మకథ" పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలోని మద్దిలపాలెం కాకతీయ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జి.వి.ఎల్. నరసింహారావు, భారతీయ జనతా పార్టీ కోసం తన సంపూర్ణ జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు దత్తాత్రేయ అని పేర్కొన్నారు. ఆయన జీవిత చరిత్రను చదివి యువత స్ఫూర్తి పొందాలని సూచించారు. ఇతర రాజకీయ పార్టీలలో కూడా దత్తాత్రేయలాంటి నిబద్ధత కలిగిన నాయకులు ఉన్నారని అన్నారు.
సామాన్యుడి నుంచి అసమాన్యుడుగా ఎదిగారు…
ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ దేశ సేవ లక్ష్యంగా ఏర్పడిన సంస్థ అని తెలిపారు. దత్తాత్రేయ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని గుర్తు చేశారు. చిన్న ఇంట్లో నివసిస్తూ ప్రజల మనిషిగా జీవించారని, ప్రజల పట్ల ఆయనకు అపారమైన నిబద్ధత ఉందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో 1991లో భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా గెలవడం ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టమని తెలిపారు.
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాజకీయాల్లో పదవులతో పాటు విభేదాలు, శత్రుత్వాలు సహజమని అన్నారు. అయితే రాజకీయ జీవితంలో శత్రువులు లేని నాయకుడిగా బండారు దత్తాత్రేయ ప్రత్యేక గుర్తింపు పొందారని చెప్పారు. "అలయ్ బలయ్" కార్యక్రమంలో పాల్గొనడం ఒక గౌరవంగా భావిస్తారని పేర్కొన్నారు. అలాంటి కార్యక్రమాలను ఉత్తరాంధ్రలో కూడా నిర్వహించి వివిధ రాజకీయ పార్టీల నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావాలని సూచించారు.
ప్రజలకు సేవ చేయడమే నా ధ్యేయం
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, రాజకీయాలు మరియు వ్యాపారం కేవలం వృద్ధి కోసం కాదని, అవి పవిత్రమైన బాధ్యతలని పేర్కొన్నారు. రాజకీయాల అసలు ఉద్దేశ్యం ప్రజాసేవ మాత్రమేనని అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు సేవ చేయడం ప్రధాన బాధ్యతగా భావించాలని సూచించారు. నేటి రాజకీయాల్లో కూడా విలువలు కలిగిన నాయకులు ఉన్నప్పటికీ, రోజురోజుకీ రాజకీయ విలువలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ, ప్రజల మధ్య నుంచి ఎదిగిన మహోన్నత నాయకుడు బండారు దత్తాత్రేయ అని కొనియాడారు. అవమానాలు, కష్టాలు, బాధలు ఆయన ఎదుగుదలను అడ్డుకోలేకపోయాయని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన అందించిన సేవలు ఎనలేనివని తెలిపారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో విశాఖపట్నం అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. గవర్నర్‌గా పనిచేసినప్పుడు రాజ్ భవన్ గోడల మధ్య కాకుండా ప్రజల మధ్య జీవించారని కొనియాడారు.

