Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజ్యసభలో జగన్ కేసుల ప్రస్తావనతో వైసీపీ లో అలజడి

రాజ్యసభలో జగన్ కేసుల ప్రస్తావనతో వైసీపీ లో అలజడి

Satyam NEWS 1 week ago

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచే బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ తన ప్రసంగంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన కేసులను ప్రస్తావించడంతో వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు.

దీంతో సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

చర్చలో పాల్గొన్న చింతకాయల విజయ్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు పనితీరుతో పాటు ప్రత్యేక సీబీఐ కోర్టుల పనితీరుపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో న్యాయవ్యవస్థలో పెండింగ్ కేసులు పెరగడానికి జడ్జిల కొరత ప్రధాన కారణాల్లో ఒకటిగా మారిందన్నారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మొత్తం 31 కేసులు నమోదై ఉన్నప్పటికీ, 13 సంవత్సరాలు గడిచినా వాటిలో విచారణ ప్రక్రియ ముందుకు సాగలేదని ఆయన పేర్కొన్నారు. డిశ్చార్జ్ పిటిషన్‌ల విచారణకే 13 సంవత్సరాలు పడితే అసలు ట్రయల్ ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నించారు. న్యాయ ప్రక్రియలో జాప్యం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు.

జడ్జిల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల కేసుల పరిష్కారంలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని, న్యాయవ్యవస్థలో ఖాళీలను త్వరగా భర్తీ చేయడం ద్వారా పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుందని చింతకాయల విజయ్ అభిప్రాయపడ్డారు.

అయితే జగన్ కేసులను సభలో ప్రస్తావించడాన్ని వైసీపీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. సవరణ బిల్లుపై జరుగుతున్న చర్చలో రాజకీయ అంశాలను ప్రస్తావించడం తగదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, సభలో కొంతసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News