Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'సకల శాఖల సజ్జల' పై ధ్వజమెత్తిన విజయసాయి రెడ్డి.

'సకల శాఖల సజ్జల' పై ధ్వజమెత్తిన విజయసాయి రెడ్డి.

Satyam NEWS 1 week ago

మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులు అయిన ఇద్దరు ఇప్పుడు వీధినపడ్డారు. అందులో ఒకరు విజయసాయి రెడ్డి. అన్ని కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి ఇటీవలి కాలంలో వైసీపీ నుంచి బయటకు వచ్చారు.

తాజాగా తాను ఒక రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు గా విజయసాయి రెడ్డి చెప్పారు. మరొకరు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ పార్టీని నడుపుతున్న వ్యక్తి. అంతే కాకుండా అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ తానై ప్రభుత్వాన్ని నడిపారు. సకల శాఖల మంత్రిగా అప్పటిలో పేరు పొందారు.

తాజా పరిస్థితి చూస్తే

వైసీపీ లోని 'కోటరీ' తనపై సోషల్ మీడియాలో నమ్మకద్రోహి అంటూ దుష్ప్రచారం చేస్తోందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. తాను నమ్మకద్రోహినే అయితే వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాదిరిగా కాంగ్రెస్‌తో సంధి చేసుకుని, CBI, ED చార్జ్‌షీట్లలో తన పేరు లేకుండా చూసుకునేవాడినని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

జగన్‌కు నమ్మకస్తుడిగా ఉన్న కారణంగానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జగన్‌తో పాటు ప్రతి చార్జ్‌షీట్‌లో తనను A2గా చేర్చిందని ఆయన పేర్కొన్నారు. జగన్ 16 నెలలు జైలులో ఉంటే, తాను 15 నెలలు జైలులో ఉన్నానని గుర్తుచేశారు. తన రక్తంలోనే నమ్మకద్రోహం ఉంటే అప్పుడే అప్రూవర్‌గా మారేవాడినని అన్నారు.

2019 ఎన్నికల తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం పార్టీలో శృతిమించిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆ సమయంలో ఆయన రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని విమర్శించారు. జగన్‌ను ఎవరినీ కలవకుండా గోడ కట్టింది సజ్జల కాదా అని ప్రశ్నించారు. జగన్‌కు కుటుంబ సభ్యులు దూరం కావడానికి కూడా సజ్జలే కారణమని ఆరోపించారు.

తనకు సంబంధం లేని లిక్కర్ స్కామ్ కేసులో 2024 ఎన్నికల తర్వాత తనను A5గా చేర్చారని విజయసాయిరెడ్డి తెలిపారు. కాకినాడ సీ పోర్ట్ కేసులో కూడా తనను A2గా చేర్చారని పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన రెండున్నరేళ్ల కాలంలో 'సకల శాఖల మంత్రి'గా వ్యవహరించారని ఆరోపిస్తున్న వ్యక్తి పేరు ఏ చార్జ్‌షీట్‌లోనూ లేదని వ్యాఖ్యానించారు.

జగన్‌కు వెన్నుపోటు పొడుస్తూ ఎలాంటి కేసులు లేకుండా చేసుకోవడం 'కోటరీ' నాయకుడికి తెలిసినంత తనకు తెలియదని విజయసాయిరెడ్డి అన్నారు. తాను ఏనాడూ నమ్మకద్రోహం పనులు చేయలేదని స్పష్టం చేశారు. తనపై జగన్‌కు చాడీలు చెప్పి ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించిందీ ఆ 'కోటరీ' నాయకుడేనని ఆరోపించారు.

నాస్తికుడు, కమ్యూనిస్టుగా చెప్పుకునే ఆ నాయకుడు వైసీపీకే కాకుండా రాష్ట్రానికే నమ్మకద్రోహి అంటూ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి తనను నేరుగా పొమ్మనలేక పొగ పెట్టింది ఎవరు? అని ప్రశ్నించారు.

తన ఆత్మగౌరవాన్ని చంపుకుని పార్టీలో పనిచేయలేకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి వెల్లడించారు. 'కోటరీ' వల్ల ఎదురైన అవమానాలను భరించలేకే పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. కోవర్టు రాజకీయం తనకు చేతకాదని వ్యాఖ్యానించారు.

'కోటరీ' నాయకుడి చేతిలో జగన్ బందీ అయ్యారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఒక వర్గం ఆధిపత్యం పెరగడం వల్లే తాను వైసీపీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్న భావనను తన బహిరంగ లేఖ ద్వారా వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారానికి సమాధానంగానే ఈ లేఖ రాస్తున్నట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News