Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుపతిలో భక్తులకు టీటీడీ వసతి సౌకర్యాలు ఇవే

తిరుపతిలో భక్తులకు టీటీడీ వసతి సౌకర్యాలు ఇవే

Satyam NEWS 1 week ago

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో విస్తృత స్థాయిలో వసతి, విశ్రాంతి, లాకర్, స్నాన, అన్నప్రసాదం, వైద్య తదితర సౌకర్యాలను టిటిడి అందుబాటులో ఉంచింది.

భక్తుల కోసం తిరుపతిలో శ్రీనివాసం, విష్ణునివాసం, మాధవం, ఎస్వీ గెస్ట్ హౌస్, పద్మావతీ గెస్ట్ హౌస్, తిరుచానూరు తోళ్లప్ప గార్డెన్స్ వంటి వసతి సముదాయాలను టీటీడీ నిర్వహిస్తోంది. వీటితో పాటు డార్మిటరీలు, ఉచిత లాకర్లు, మరుగుదొడ్లు, స్నాన గదులు, ప్రథమ చికిత్స కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఏసీ గదులను ఆన్ లైన్ మరియు రొటేషన్ విధానంలో భక్తులకు కేటాయిస్తున్నారు. నాన్ ఏసీ గదులను ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన కేటాయిస్తున్నారు.

విష్ణునివాసం

2011లో ప్రారంభించిన విష్ణునివాసంలో 408 గదులు, 09 హాళ్లు, 706 లాకర్లు అందుబాటులో ఉన్నాయి. ఏసీ, నాన్ ఏసీ గదులను ఆన్‌లైన్ మరియు రొటేషన్ విధానంలో భక్తులకు కేటాయిస్తున్నారు.

శ్రీనివాసం కాంప్లెక్స్

2003లో ప్రారంభమైన శ్రీనివాసం కాంప్లెక్స్‌లో 552 గదులు, 09 డార్మిటరీలు, 1038 లాకర్లు ఉన్నాయి. ఏసీ, నాన్ ఏసీ, డీలక్స్ గదులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి.

మాధవం గెస్ట్ హౌస్

2009లో ప్రారంభించిన మాధవం గెస్ట్ హౌస్‌లో 164 ఏసీ గదులు, డీలక్స్ సూట్లు ఉన్నాయి.

ఎస్వీ గెస్ట్ హౌస్

1955లో నిర్మించిన ఎస్వీ గెస్ట్ హౌస్‌లో ఏసీ, నాన్ ఏసీ కలిపి 31 గదులను భక్తులకు కేటాయిస్తున్నారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన గదులను కేటాయిస్తున్నారు.

ఇతర వసతి కేంద్రాలు

రేణిగుంట సమాచార కేంద్రంలో 4 గదులు, 1 డార్మిటరీ, 18 లాకర్లు అందుబాటులో ఉన్నాయి. 2002లో ప్రారంభమైన భూదేవి కాంప్లెక్స్ లో 1 - డార్మిటరీ, 100 లాకర్లు ఉన్నాయి. తిరుచానూరు తోళ్లప్ప గార్డెన్స్‌లోని గెస్ట్ హౌస్ 1982లో భక్తులకు అందుబాటులోకి రాగా, అందులోని 30 గదులను ఆన్ లైన్ లో నిబంధనల ప్రకారం బుకింగ్ చేసుకోవచ్చు. తిరుపతి శ్రీ పద్మావతీ గెస్ట్ హౌస్‌ 1979లో భక్తులకు అందుబాటులోకి రాగా, అందులో ఉన్న 35 గదులు ప్రోటోకాల్ ప్రతినిధులకు కేటాయించబడుతున్నాయి.

విష్ణునివాసం, శ్రీనివాసం, తోళ్లప్ప గార్డెన్స్‌లలో అన్నప్రసాదం సౌకర్యం కూడా భక్తులకు అందుబాటులో ఉంది. వీటితో పాటు శ్రీ గోవిందరాజ స్వామి సత్రాల స్థానంలో నిర్మిస్తున్న భవనాలు పూర్తి అయితే మరిన్ని వసతి గదులు, లాకర్లు, డార్మిటరీలు భక్తులకు అందుబాటులో రానున్నాయి.

గదుల కేటాయింపు విధానం

తిరుపతిలోని విష్ణునివాసంలో పరిమిత సంఖ్యలో గదుల కేటాయింపు కరెంట్ బుకింగ్ లో మినహా, తిరుపతిలోని మిగిలిన అన్ని చోట్ల నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో www.ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లో ముందస్తుగా భక్తులు బుక్ చేసుకోవాలి. ఒంటరి మరియు అవివాహిత స్త్రీ, పురుష జంటలకు గదులు కేటాయించబడవు.

భక్తులు టీటీడీ కల్పిస్తున్న వసతి, లాకర్, విశ్రాంతి, అన్నప్రసాదాలు సదుపాయాలను వినియోగించుకుని స్వామివారి దర్శనాన్ని పూర్తి చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. దర్శనం అనంతరం గదులు, లాకర్లు వెంటనే ఖాళీ చేసి ఇతర భక్తులకు సహకరించాలని కోరుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News