Dailyhunt
ట్రంప్ మూర్ఖత్వం వల్ల ఎంత నష్టం? ఎంత కష్టం?

ట్రంప్ మూర్ఖత్వం వల్ల ఎంత నష్టం? ఎంత కష్టం?

Satyam NEWS 3 weeks ago

మెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం తాత్కాలికంగా ఆగిపోయినా జరిగిన నష్టం మాత్రం అపారం. ప్రపంచంలోని చాలా దేశాల ఆర్ధిక పరిస్థితి ఈ యుద్ధం కారణంగా ఛిన్నాభిన్నం అయింది.

గతంలో కఠిన వ్యాఖ్యలు చేస్తూ ఈ రాత్రికే ఇరాన్ nను పూర్తిగా అంతం చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన వైఖరిలో మార్పు చూపుతూ కాల్పుల విరమణ ప్రకటించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

ట్రంప్ చేసిన తీవ్ర బెదిరింపులు అమలులోకి రాకపోవడం, ఇరాన్ వెనుకడుగు వేయకపోవడం వల్ల పరిస్థితి పూర్తిగా మారిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా అమెరికాలో అంతర్గత సంక్షోభం కూడా ముదిరే అవకాశం స్పష్టంగా కనిపించింది.

ఇరాన్ ప్రభుత్వం ట్రంప్ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోకుండా తమ ధోరణిని కొనసాగించింది. అమెరికా ఒత్తిళ్లకు లొంగకుండా తాము కూడా సమర్థంగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశాలు కనిపించగా, చివరికి ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించడం గమనార్హంగా మారింది.

అంతేకాదు, ఇరాన్‌కు సంబంధించి మరో రెండు వారాల గడువు పొడిగిస్తూ పరిస్థితిని చర్చల ద్వారా పరిష్కరించాలనే సంకేతాలు ఇచ్చారు. ఇక ఇరాన్ కూడా స్పందిస్తూ, అమెరికా ముందుగా దాడులు నిలిపివేస్తే తాము కూడా కాల్పులను నిలిపివేస్తామని ప్రకటించింది.

అదే సమయంలో, పాకిస్తాన్ అభ్యర్థన మేరకే తాము ఈ కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నామని తెలిపింది. ఇది ప్రాంతీయ దౌత్యపరమైన పరిణామాలకు సూచనగా భావిస్తున్నారు. శాంతి చర్చలకు మార్గం సుగమం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ స్పష్టం చేసింది.

యుద్ధ ప్రభావం విషయంలో గణనీయమైన నష్టం జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఘర్షణల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు, వేలాది మంది గాయపడినట్లు అంచనా వేస్తున్నారు. పలు కీలక మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.

చమురు శుద్ధి కేంద్రాలు, సైనిక స్థావరాలు, రవాణా వ్యవస్థలకు భారీ నష్టం వాటిల్లింది. అంతేకాకుండా, హోర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో వాణిజ్య నౌకాయానానికి ఆటంకం కలగడంతో గ్లోబల్ ట్రేడ్ పై ప్రభావం పడింది. చమురు సరఫరా అంతరాయం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తీవ్రంగా మార్పులు చూశాయి. ఈ యుద్ధం వల్ల బిలియన్ల డాలర్ల ఆర్థిక నష్టం జరిగిందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు ట్రంప్ కూడా యుద్ధం కంటే శాంతి ముఖ్యం అన్న దృక్పథంతో ముందుకు సాగుతున్నామని ప్రకటించారు. ఈ పరిణామాలు తాత్కాలికంగా ఉద్రిక్తతలను తగ్గించినప్పటికీ, పరిస్థితి ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి రాలేదని అంతర్జాతీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాబోయే రోజుల్లో జరిగే చర్చలు, నిర్ణయాలు ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపుతాయా లేదా అన్నది కీలకంగా మారనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News