Monday, 14 Jun, 2.21 pm SMTV 24x7 NEWS

జాతీయం
బీజేపీ అధిష్ఠానాన్ని వెంటాడుతున్న భయాలు....పూర్తికాలం యడ్డీనే సీఎంగా కొనసాగించనున్న పార్టీ

ముఖ్యమంత్రి పీఠం నుంచి యడ్డియూరప్పను బీజేపీ అధిష్ఠానం దిగిపోవాలని ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రచార్ని కొట్టిపారేసిన కర్ణాటక సీఎం.. తాను పూర్తికాలం సీఎంగా కొనసాగుతానని కుండబద్దలు కొట్టారు. శుక్రవారం హాసన్ జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటు సొంత పార్టీలోని అసమ్మతి వర్గాలు, విపక్షాలనూ లక్ష్యంగా చేసుకుని చురకలంటించారు. వచ్చేవారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అరుణ్‌సింగ్‌ కర్ణాటక పర్యటనపై విపరీతార్థాలు వెతకొద్దని సూచించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా రెండు నెలలకు ఓ సారి అరుణ్‌సింగ్‌ కర్ణాటకకు వస్తారని, ఇదే క్రమంలో ఈనెల 16న విచ్చేస్తున్నారని యడ్డీ తెలిపారు. ఆయన పర్యటన వెనుక రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని, బీజేపీ తేజం మెరిసేలా ప్రణాళిక రూపొందించడమే లక్ష్యమన్నారు. కరోనా కట్టడికి సర్కారు చేపడుతున్న చర్యలపై అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం ఎంతో సానుకూలంగా ఉన్నాయన్నారు. నా పనితీరును ఢిల్లీ పెద్దలు ఎంతో మెచ్చుకుంటున్నారని, నా పదవికి ఏదో జరిగిపోతుందన్న ఆందోళన ఎవరికీ వద్దని పరోక్షంగా అసమ్మతి వర్గాన్ని హెచ్చరించారు. రానున్న రెండేళ్లూ నేనే అధికారంలో ఉంటానని ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, అసమ్మతి గళం గట్టిగా వినిపిస్తున్నా యడియూరప్ప విషయంలో బీజేపీ అధిష్ఠానం ఓ నిర్ణయం తీసుకోడానికి తటపటాయిస్తోంది. దీనికి గత అనుభవాలే కారణం. 2008లో సొంతంగా కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. తొలుత ముఖ్యమంత్రిగా యడియూరప్పను నియమించింది.

తర్వాత జరిగిన పరిణామాలతో ఆయనను తప్పించి సదానంద గౌడను సీట్లో కూర్చోబెట్టింది. ఆయనను కూడా కొన్నాళ్లే పదవిలో ఉంచి, తర్వాత జగదీశ్ షెట్టర్‌కు బాధ్యతలు అప్పగించింది. అధిష్ఠానంపై తిరుగుబావుటా ఎగురేసిన యడియూరప్ప సొంత కుంపటి పెట్టుకున్నారు. 2012లో కర్ణాటక జనతా పక్ష (కేజీపీ) పార్టీని ఏర్పాటుచేసి 2013 ఎన్నికల్లో ఒంటిరిగా పోటీచేశారు.

మొత్తం 224 స్థానాల్లోనూ పోటీచేసిన యడ్డీ పార్టీ.. 8 సీట్లనే దక్కించుకున్నా బీజేపీకి మాత్రం భారీ నష్టాన్ని మిగిల్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ పరాజయాన్ని మూటగట్టుకుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి..

బీజేపీ ఓటమికి యడ్డీ పరోక్షంగా కారణమయ్యారు. తర్వాత 2014లో కేజీపీని బీజేపీలో విలీనం చేసి పార్టీ బాధ్యతలను చేపట్టారు. ఇక, 75 ఏళ్ల వయసు దాటారన్న కారణం చూపించి అద్వాణీ వంటి సీనియర్ నేతలకు మోదీ-షా ద్వయం విశ్రాంతినిచ్చింది. కానీ, యడ్యూరప్పను మాత్రం పక్కన పెట్టలేకపోయింది.

దీనికి కారణం ఆయన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం. సొంత వర్గం లింగాయత్‌లు ఆయనకు అండగా ఉన్నారు. రాష్ట్రంలో ఇది చాలా బలమైన సామాజిక వర్గం. వొక్కళిగలు కూడా ఇలాంటి బలమైన వర్గమే అయినప్పటికీ, వాళ్లు దక్షిణ కర్ణాటకకు మాత్రమే పరిమితం.

లింగాయత్‌లు మాత్రం రాష్ట్రం అంతా విస్తరించి ఉన్నారు. 1989లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన లింగాయత్ నేత వీరేంద్ర పాటిల్ ఒక ఏడాది తర్వాత సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. రాష్ట్రంలో అద్వాణీ రథయాత్ర తర్వాత జరిగిన అల్లర్లను వీరేంద్ర పాటిల్ కట్టడి చేయలేకపోయారు. దీంతో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ బెంగళూరు విమానాశ్రయంలో పాటిల్‌ను సీఎం పదవి నుంచి తప్పించారు.

నాటి నుంచి లింగాయత్‌లు కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ జనతా పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా మారారు. కొన్నేళ్ల తర్వాత యడ్యూరప్ప నాయకత్వంలోని బీజేపీకి విధేయతను చాటుకుంటున్నారు. యడ్యూరప్పను తప్పించాలని పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తున్నా.. ఈ ఓటు బ్యాంకు దూరమై వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని వెనకడుగు వేస్తోంది.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: SMTV Telugu
Top