Posts
ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌట్..

గబ్బా : బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజైన శనివారం 274/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టులో టిమ్ పైనీ (50 : 104 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధ సెంచరీ నమోదు చేయగా.. కామెరూన్ గ్రీన్ (47 : 107 బంతుల్లో 6 ఫోర్లు) సమయోచిత ఇన్నింగ్ ఆడాడు. అయితే, వీరిద్దరి ఔటైన తర్వాత ఆస్ట్రేలియాను వేగంగానే భారత్ బౌలర్లు కుప్పకూల్చారు. బౌలర్లు నటరాజన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్‌కు మూడేసి వికెట్లు దక్కగా.. మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఈరోజు ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 28తో బ్యాటింగ్ కొనసాగించిన కామెరూన్ గ్రీన్ మూడు చక్కటి బౌండరీలతో ఆకట్టుకున్నాడు.
కానీ వాషింగ్టన్ సుందర్ విసిరిన స్ట్రయిట్ డెలివరీని అడ్డుకోలేక క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పాట్ కమిన్స్ (2) శార్దూల్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ (20 నాటౌట్ : 35 బంతుల్లో ఒక సిక్స్) చివరి వరకు ఉన్నాడు. నాథన్ లయన్ (24 : 22 బంతుల్లో 4 ఫోర్లు) మాత్రం క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడేశాడు.
ఆఖర్లో హజల్‌వుడ్ (11)ని నటరాజన్ వేసిన బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ చేయడం ద్వారా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌కి తెరదించాడు. శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేయగా.. తొలిరోజు మార్కస్ లబుషేన్ (108 : 204 బంతుల్లో 9 ఫోర్లు) సెంచరీ బాదిన విషయం తెలిసిందే.