Dailyhunt
ఏపీ ప్రజలకు అలర్ట్: ఎండల వేడి మధ్య వర్షాల చినుకులు

ఏపీ ప్రజలకు అలర్ట్: ఎండల వేడి మధ్య వర్షాల చినుకులు

సూర్య 2 weeks ago

వేసవి తాపంతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఒక మంచి వార్త చెప్పింది. రేపటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరికొన్ని చోట్ల వడగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది.

ఈ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న వివరాలను కూడా వెల్లడించింది.విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకార్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. మేఘావృత వాతావరణంతో పాటు పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశముంది. మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉండొచ్చని అన్నారు.దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, రాయలసీమ మరియు పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు. వీటి ప్రభావంతో రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.పిడుగులతో కూడిన వర్షాలు పడే సమయంలో రైతులు, పశు కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా చెట్ల కింద నిలబడకూడదని సూచించారు.శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu