Dailyhunt
నల్లాకు అక్రమంగా బిగించిన మోటార్లు స్వాధీనం

నల్లాకు అక్రమంగా బిగించిన మోటార్లు స్వాధీనం

సూర్య 3 weeks ago

జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్ మహా నగరానికి జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి పైపు లైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తోంది.

కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు తమ నల్లాలకు మోటార్ల బిగించుకోవడం జలమండలి అధికారుల దృష్టికి వచ్చింది. దీని వల్ల మిగిలిన వినియోగదారులకు.. లో- ప్రెజర్ తో నీటి సరఫరా జరుగుతోంది. ఇలా చేయడం చట్టరీత్యా నేరం. ఈ నేపథ్యంలో జలమండలి విజిలెన్స్ అధికారులు క్రమంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.జలమండలి పైపులైనుకు నేరుగా విద్యుత్ మోటార్లు బిగించి నీటిని అక్రమంగా తోడుతున్న మోటార్లు సీజ్ చేసారు. బుధవారం రోజున ఓ అండ్ ఎం డివిజన్ నంబర్-6, ఎస్ఆర్ నగర్ పరిధిలోని ఎస్ఆర్టి కాలనీలో నల్లాకు మోటార్లు బిగిస్తున్నారని స్థానికులు జలమండలి విజిలెన్సు అధికారులకు సమాచారం అందించారు.. దీంతో స్పందించిన అధికారులు నీటి సరఫరా సమయంలో పర్యటించి పైపులైనుకు అక్రమంగా బిగించిన 7 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు.

ఎవరైనా వినియోగదారులు ఇలా తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే.. వారిపై జలమండలి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు మోటార్లు సీజ్ చేస్తారు. రెండోసారి మోటార్లు బిగిస్తే రూ.5 వేలు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తారు. కాబట్టి వినియోగదారులెవరూ నల్లాకు మోటార్లు బిగించవద్దని జలమండలి విజ్ఞప్తి చేస్తోంది.

ఒకవేళ తక్కువ ప్రెజర్ తో నీరు సరఫరా అయినా.. లేదా నీటి సరఫరాలో ఏవైనా ఇతర సమస్యలు తలెత్తినా.. తమకు దగ్గర్లోని సంబంధిత మేనేజర్, డీజీఎం, జీఎం అధికారులను సంప్రదించాలి. లేదా జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వాటిపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుని సమస్యల్ని పరిష్కరిస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu