Wednesday, 31 May, 5.33 am తెలంగాణ

రాజన్న
మహిమాన్వితం మల్లన్న క్షేత్రం

మహిమాన్వితం మల్లన్న క్షేత్రం రూ.11 కోట్లతో అభివృద్ధికి ప్రతిపాదనలు అతి ప్రాచీన శైవక్షేత్రం ఓదెల శ్రీమల్లికార్జునస్వామి ఆలయం...అనాదిగా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ స్వయంభూ శివలింగం ఉండి చారిత్రక నేపథ్యం ఉన్నందున పలు రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల యాత్రికులు వేలాదిగా తరలివస్తుంటారు. కాకతీయుల కాలంలో పునర్నిర్మాణమైన ఈ ఆలయం పెద్దపల్లి జిల్లాలోనే పెద్దదైన ఆలయంగా ఉంది. ఏటా దాదాపు రూ.1 కోటికి పైగా ఆదాయంతో ఉమ్మడి జిల్లాలో వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, ధర్మపురి ఆలయాల తరువాత ఆదాయపరంగా ఐదో స్థానంలో నిలిచి 6ఏ ఆలయంగా గుర్తింపు పొందింది. కొమురవెల్లి, ఐనవోలు ఆలయాల మాదిరిగా ఇక్కడ కూడా భక్తులు పట్నాలు, బోనాలతో మల్లికార్జునస్వామిని కొలుస్తుంటారు. జగజ్జనని శ్రీభ్రమరాంభ సమేతంగా వెలసిన ఓదెల మల్లికార్జునస్వామి ఆలయం శివభక్తితో ఇంటింటి ఇలవేల్పుగా పేరుగాంచిన వైనంపై 'న్యూస్‌టుడే' కథనం. ఓదెల, న్యూస్‌టుడే పూర్వం కాలంలో ఇక్కడి ప్రాంతం దండకారణ్యంగా ఉన్న రోజుల్లో పంకజ మహామునీశ్వరుడు అర్దరాత్రి సమయంలో శివలింగాన్ని సేవించి తపస్సు చేసినట్లు చెబుతారు. కాలక్రమేణా కలియుగంలో శివలింగంపై పుట్టపెరిగి కనుమరుగైందని చారిత్రక ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. దండకారణ్యంలో కొంత స్థలాన్ని సాగుచేసే క్రమంలో స్థానికుడు చింతకుంట ఓదెలు నాగలితో దున్నుతుండగా ఓంకార శబ్దంతో శివలింగం బయటపడిందని, నాగలి తాకిన గాయం ఇప్పటికీ శివలింగంపై ఉన్నట్లుగా ఆధారాలున్నాయి. ఈ నేపథ్యంలో ఓదెల మల్లికార్జునస్వామిగా వెలసి భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. కాకతీయుల కాలంలో ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. ఆలయంలో దక్షిణదిశగా శ్రీభ్రమరాంబ అమ్మవారు, ఉత్తరంవైపున శ్రీవీరభద్రస్వామి, క్షేత్రపాలకునిగా భైరవస్వామిలను ప్రతిష్టించారు. పశ్చిమంలో వీరశైవ మఠం ఉంది.

ఆలయంలో జరిగే కార్యక్రమాలు ప్రతి ఆది, బుధవారాల్లో మల్లికార్జునస్వామి జాతర జరుగుతుంటుంది. మామూలు రోజుల్లోకంటే జాతర జరిగే రోజుల్లో మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌, హైదరాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారంగా ప్రతినిత్యం అభిషేక పట్నం, బోనం, కోడెలతో యాత్రికులు మొక్కులు చెల్లిస్తుంటారు. ఫిబ్రవరిలో శ్రీభ్రమరాంబ, మల్లికార్జునస్వామి కల్యాణమహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తుంటారు. మహాశివరాత్రి ఉత్సవాలు, ఉగాది పర్వదిన వేడుకలు, శ్రీరామనవమి రోజున శ్రీరామచంద్రస్వామి కల్యాణోత్సవాలు, ఏటా జులైలో జరిగే పెద్దపట్నం బ్రహ్మోత్సవాలు, అగ్నిగుండ మహోత్సవాలతో పాటు తొలి ఏకాదశి, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా జరుపుతుంటారు.

మరిన్ని వసతులు కల్పించాలి స్వరూప భక్తురాలు మహిమగల మల్లికార్జునస్వామి దర్శనానికి ప్రతియేటా కుటుంబ సభ్యులతో వచ్చి ఒక్కరోజు విడిది చేస్తుంటాం. ఈ రోజుల్లో కొత్తకొత్త ఆలయాలు ఎంతో అభివృద్ధికి నోచుకుంటుండగా పురాతన మల్లన్న ఆలయం మాత్రం తగినంత అభివృద్ధి చెందడం లేదు. అంతేకాక సరైన బస్సు సౌకర్యం కూడా లేదు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, ఓదెల ఆలయాలను కలుపుతూ ప్రత్యేకంగా బస్సులు నడిపితే బాగుంటుంది. అలాగే తిరుపతి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఓదెలలో నిలిపేలా చేస్తూ భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది.

సౌకర్యాలపై దృష్టిపెట్టాలి వనిత దాతలు ముందుకు వచ్చి చేసిన కొన్ని అభివృద్ధి పనులు తప్పితే ప్రభుత్వపరంగా జరిగిన అభివృద్ధి ఏమిలేదని ఇక్కడి వసతులు చూస్తే అర్థం అవుతుంది. ఇంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆలయ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఆలయాన్ని అన్నివిధాల అభివృద్ధి చేయాలి. మహిళలకు అవసరాలు తీర్చుకోవడానికి వసతులు, సులభ్‌ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలి. పుణ్యస్నానాలకు కోనేరు నిర్మాణం చేస్తే మంచిది

ఆలయ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపించాం ఎ.మారుతి, ఆలయ కార్యనిర్వహణాధికారి స్థానిక శాసనసభ్యులు దాసరి మనోహర్‌రెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధికి రూ.11 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఆలయం చుట్టూ సాలారంతో కూడిన ప్రాకారాలు, నాలుగు రాజగోపురాలు, నందీశ్వరుని వద్ద హాఫ్‌షెడ్‌తోపాటు 60 వసతిగృహాల నిర్మాణానికి దేవాదాయశాఖ మంత్రికి విన్నవించాం. భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం, మధునపు పోచమ్మ, బంగారు పోచమ్మ ఆలయ పునరుద్ధరణ, ఆయా ప్రధాన రహదారుల్లో ఆర్చిగేట్ల నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వ సహకారంతో కృషిచేస్తాం.

Dailyhunt
Top