ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి పన్నెండేళ్లు అయింది. నాటి ఉమ్మడి రాష్ట్ర జ్ఞాపకాలు కేవలం చరిత్ర పుస్తకాలకే పరిమితమయ్యేలా పరిస్థితులు వేగంగా మారిపోయాయి.
ఈ పన్నెండేళ్ల కాలంలో రెండు రాష్ట్రాల మధ్య భౌగోళిక, ఆర్థిక విభజనతో పాటు రాజకీయంగా గతంలో కలిసి ఉన్నారా అని ఆశ్చర్యపోయేలా గీత ఏర్పడింది. ఏపీలో అధికార, ప్రతిపక్షాలుగా చక్రం తిప్పుతున్న ఏ ఒక్క పార్టీకి తెలంగాణలో కనీస ఉనికి లేదు. అలాగే తెలంగాణను శాసిస్తున్న ఏ జాతీయ, ప్రాంతీయ పార్టీలు కూడా ఏపీ రాజకీయాలపై ప్రత్యక్ష ప్రభావం చూపలేకపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, రెండు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రాలు, ఎజెండాలు పరస్పరం ఎలాంటి సంబంధం లేనంతగా విడిపోయాయి.
ఏపీని బూచిగా చూపడం మాత్రం ఆపలేదు!
అయినప్పటికీ, తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికీ కొందరు నాయకులు ఏపీని, ఏపీ ప్రజలను ప్రస్తావిస్తూ లబ్ధి పొందాలని చూడటం ఒక విచిత్రమైన మైనస్ అంశంగా మిగిలిపోయింది. స్థానిక సమస్యలను, అభివృద్ధిని పక్కనబెట్టి, ఇప్పటికీ ఆంధ్ర బూచి ని చూపిస్తే తప్ప రోజు గడవని పరిస్థితి కొందరు నేతలకు ఉంది. గతంలో సెంటిమెంట్‌ను రగిల్చి రాజకీయంగా లాభపడినట్లు, ఇప్పుడు కూడా అదే పంథాను ఎంచుకుంటున్నారు. కానీ, ఒకప్పటిలా ప్రజల్లో ఈ అంశంపై ఎలాంటి ఎమోషనల్ కనెక్టివిటీ లేదు. ప్రజలు అభివృద్ధిని, ఉపాధిని కోరుకుంటున్నారే తప్ప పాత గొడవలను పట్టించుకోవడం లేదన్న చిన్న లాజిక్‌ను నేటికీ కొందరు రాజకీయ నేతలు అర్థం చేసుకోలేకపోతున్నారు.
ప్రాంతీయ రాజకీయాలకు కాలం చెల్లినట్లే
రాబోయే మరో పదేళ్లలో ఈ విధమైన ఏపీ బూచి రాజకీయాలకు పూర్తిగా కాలం చెల్లనుంది. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎన్నో రంగాలు, పెట్టుబడులపై కొందరు నేతలు చేస్తున్న బెదిరింపులు లేదా ఏపీకి వెళ్లిపోండి అనే వ్యాఖ్యలు భవిష్యత్తులో అర్థరహితం కానున్నాయి. ఎందుకంటే, ఏపీలో మౌలిక వసతుల కల్పన, పారిశ్రామికీకరణ ఇదే వేగంతో కొనసాగితే.. వచ్చే పదేళ్లలో హైదరాబాద్‌పై ఆధారపడటం క్రమంగా తగ్గిపోతుంది. ఇప్పటికే షూటింగ్‌ల సందడి ఏపీలో పెరుగుతోంది. ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు కూడా ఏపీ కేంద్రంగా తమ సొంత మౌలిక వసతులను పటిష్టం చేసుకుంటున్నాయి. చివరకు మీడియా హబ్‌లు, ఐటీ కంపెనీలు, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏపీకి తరలివెళ్తే.. ఉపాధి, వ్యాపారాల కోసం ఏపీ నుండి హైదరాబాద్ వచ్చే వారి సంఖ్య సహజంగానే తగ్గుతుంది.
హైదరాబాద్ నుంచి ఏపీ కోసం పని చేయడం తగ్గితే చాలు!
ఎప్పుడైతే వలసలు, పెట్టుబడుల కేంద్రీకరణ తగ్గుతుందో, అప్పుడు రాజకీయంగా వాడుకోవడానికి ఆంధ్రా అనే అంశమే మిగలదు. బహుశా రాబోయే ఐదు నుండి పదేళ్ల వరకే ఈ సెంటిమెంట్‌ను రాజకీయంగా వాడుకునే చివరి అవకాశం ఉండవచ్చు. ఆ తర్వాత, కేవలం అభివృద్ధి, పరిపాలన ఆధారంగానే తెలంగాణలో రాజకీయాలు నడవాల్సి ఉంటుంది. ఈ మారుతున్న సామాజిక, ఆర్థిక సమీకరణాలను గమనించకుండా పాత పంథాలోనే రాజకీయం చేస్తామనుకుంటే.. భవిష్యత్ తరాల ఓటర్లు ఆ నేతలను తిరస్కరించడం ఖాయంగా కనిపిస్తోంది.

