భాగ్యనగర స్థిరాస్తి మార్కెట్ సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తూ దూసుకుపోతోంది. గతంలో కేవలం బడ్జెట్, అవసరాలకే పరిమితమైన కొనుగోలుదారులు, ఇప్పుడు మెరుగైన జీవన ప్రమాణాలు, విశాలమైన స్థలానికే మొగ్గు చూపుతున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ, కార్పొరేట్ రంగాలలో పనిచేస్తూ ఏడాదికి రూ. 40 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన ఉన్నత ఉద్యోగ వర్గాల ప్రాధాన్యతలు గత ఐదేళ్లలో పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు నగరంలో అత్యధికంగా అమ్ముడైన 2 BHK ఇళ్ల స్థానాన్ని, ఇప్పుడు ప్రీమియం లగ్జరీ 3 BHK ఫ్లాట్లు ఆక్రమిస్తున్నాయి.
నాటి అవసరం వేరు.. నేటి లగ్జరీ వేరు!
చరిత్రను ఒకసారి గమనిస్తే.. 2021 కరోనా సంక్షోభం తర్వాతి రోజుల్లో సగటు ఐటీ ఉద్యోగి ఆలోచనా విధానం ఎక్కువగా పొదుపు చుట్టూనే తిరిగేది. నాడు మంచి ప్యాకేజీలు ఉన్నప్పటికీ 1250 నుండి 1600 చదరపు అడుగుల విస్తీర్ణం గల 2 BHK ఫ్లాట్లను కొనడానికే ఎక్కువ ఆసక్తి చూపించేవారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆర్థిక సుస్థిరత పెరగడం, హైబ్రిడ్ వర్క్ కల్చర్ స్థిరపడటంతో.. ఇల్లు అనేది కేవలం పడుకునే స్థలం మాత్రమే కాదు, అది తమ హోదాకు, సౌకర్యానికి ప్రతీకగా ఉండాలని కొనుగోలుదారులు భావిస్తున్నారు. అందుకే, ఇప్పుడు ఏకంగా 2,000 నుండి 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం గల 2.5 లేదా 3 BHK ఫ్లాట్ల వైపు ఐటీ వర్గాలు క్యూ కడుతున్నాయి.
హాఫ్ బెడ్‌రూమ్ అవసరం.. వెస్ట్ కారిడార్‌లో డిమాండ్!
ఈ ట్రెండ్‌లో 2.5 BHK ఫ్లాట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇందులోని ఆ హాఫ్ బెడ్‌రూమ్ గదిని ఐటీ ఉద్యోగులు తమ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఆఫీస్ స్పేస్‌గా, పిల్లల స్టడీ రూమ్‌గా లేదా మీడియా రూమ్‌గా మార్చుకుంటున్నారు. హైదరాబాద్ పశ్చిమ కారిడార్‌లోని కోకాపేట్, నానక్‌రామ్‌గూడ, టెల్లాపూర్, నల్లగండ్ల, గచ్చిబౌలి వంటి ఐటీ హబ్‌ల పరిసరాల్లో నిర్మితమవుతున్న గేటెడ్ కమ్యూనిటీలలో ఈ తరహా లగ్జరీ గృహాల అమ్మకాలు రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ప్రముఖ డెవలపర్ల నివేదికల ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న కొత్త ప్రాజెక్టులలో దాదాపు 70 శాతం వాటా 3 BHK లగ్జరీ విభాగాలదే .
కార్పొరేట్ లైఫ్ స్టైల్‌కు అద్దం పడుతున్న గేటెడ్ కమ్యూనిటీలు
రూ. 40 లక్షల ఆదాయం ఉన్న ఐటీ నిపుణులు కేవలం ఫ్లాట్ సైజునే కాకుండా, ఆ ప్రాజెక్ట్‌లో లభించే అత్యాధునిక మౌలిక వసతులను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి క్లబ్‌హౌస్‌లు, ఇండోర్ స్పోర్ట్స్ అరేనాలు, కో-వర్కింగ్ స్పేస్‌లు, ల్యాండ్‌స్కేప్ గార్డెన్లు ఉన్న ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహంతో పాటు భవిష్యత్తులో వచ్చే మెరుగైన రీసేల్, అద్దె విలువల ను దృష్టిలో ఉంచుకుని ఈ లగ్జరీ అప్‌గ్రేడ్‌కు వెనుకాడటం లేదు.

