దేశంలోనే అత్యంత సురక్షితమైనవిగా భావించే ఆర్మీ స్థావరాలలో ఒకటి అయిన సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ యూనిట్‌లో ఊహించని దొంగతనం జరిగింది.
సైనిక విభాగానికి చెందిన బెల్ ఆఫ్ ఆర్మ్స్ నుంచి 4 ఏకే-47 అత్యాధునిక రైఫిళ్లు కనపడకుండా పోవడం ఆర్మీ వర్గాల్లో కలకలాన్ని రేపింది. సెలవు మంజూరు చేయలేదనే అసంతృప్తితోనే ఒక సైనికుడు ఈ ఆయుధాలను ఎత్తుకెళ్లాడనే ప్రాథమిక అనుమానాలతో ఆర్మీ అధికారులు వెంటనే బొల్లారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇంటి దొంగ పనే!
ఈ ఘటన వెలుగులోకి రావడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మిలిటరీ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రతా దృష్ట్యా బొల్లారం పరిసరాల్లోని కొన్ని కీలకమైన ఆర్మీ , సివిల్ రహదారులను ఆర్మీ అధికారులు పూర్తిగా మూసివేశారు. మిలిటరీ ఆర్మీ చెక్‌పోస్టుల వద్ద ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానిత వ్యక్తుల కోసం ఆర్మీ ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా జల్లెడ పడుతున్నారు.
ఆర్మీ అధికారుల నిర్లక్ష్యం వల్లే
సాధారణంగా మిలిటరీ బెల్ ఆఫ్ ఆర్మ్స్ అనేది 24 గంటలూ కఠినమైన డబుల్ లాక్ భద్రత, సాయుధ పారా-సెంట్రీల పహారా , రిజిస్టర్ ఎంట్రీలతో ఉంటుంది. ఒక బయటి వ్యక్తి లేదా సాధారణ దొంగ లోపలికి వెళ్లి ఏకే-47 రైఫిళ్లను ఎత్తుకెళ్లడం దాదాపు అసాధ్యం. ఆయుధాలు దాచే గదికి సంబంధించిన తాళాలు, యాక్సెస్ కోడ్‌లు, డిజైనేటెడ్ ఆర్మరర్, కమాండింగ్ ఆఫీసర్‌ల నియంత్రణలో మాత్రమే ఉంటాయి. అందువల్ల, ఈ ఘటన వెనుక ఆర్మీలోని వ్యక్తి ప్రమేయం ఉందనే కోణంలోనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ ఆయుధాలతో మారణ హోమం సృష్టిస్తే !
గతంలో కూడా దేశంలోని కొన్ని ఆర్మీ క్యాంపుల్లో తీవ్రమైన ఒత్తిడి, సెలవులు దొరక్కపోవడం , మానసిక అసంతృప్తికి గురైన కొందరు జవాన్లు, సిబ్బంది ఇటువంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన దాఖలాలు ఉన్నాయి. ఆధునిక ఏకే-47 ఆయుధాలు బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ఘోరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున మిలిటరీ ఇంటెలిజెన్స్ ఈ విషయాన్ని అ తీవ్రంగా పరిగణిస్తోంది.

